Health Insurance: ఆరోగ్య బీమా పున‌రుద్ధ‌ర‌ణ గ‌డువు ద‌గ్గ‌ర పడుతోందా?

నిరంత‌రం క‌వ‌రేజీ అందించేందుకు గానూ, స‌మ‌యాన‌కి ఆరోగ్య బీమా పున‌రుద్ధ‌రించ‌డం అవ‌స‌రం.

Updated : 19 Sep 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌తి వ్య‌క్తీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ఒక ముఖ్య‌మైన అంశం ఆరోగ్య బీమా. రోజు రోజుకూ వైద్య ఖ‌ర్చులు పెరుగుతున్న నేప‌థ్యంలో కుటుంబ ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం ఇది త‌ప్ప‌నిస‌రి. అలాగే, నిరంత‌రం క‌వ‌రేజీ అందించేందుకుగానూ.. స‌మ‌యానికి పున‌రుద్ధ‌రించ‌డం కూడా అవ‌స‌రం. ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు బీమా సంస్థ‌లు పునరుద్ధ‌ర‌ణ స‌దుపాయం ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నాయి. కాబ‌ట్టి పాల‌సీదారులు ప్ర‌స్తుతం ఉన్న పాల‌సీ గ‌డువు ముగిసేలోపు పున‌రుద్ధ‌ర‌ణ పూర్తి చేయాలి. అలాగే, పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో కొన్ని ముఖ్యమైన విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నిరంత‌ర క‌వ‌రేజీ కోసం..

ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న పాల‌సీ గ‌డువు ముగిసేలోపు పున‌రుద్ధ‌రించుకోవాలి. ఒక‌వేళ ఏమైనా ప్ర‌తికూల‌ ప‌రిస్థితుల కార‌ణంగా గ‌డువు తేదీకి పునరుద్ధ‌రించ‌లేక‌పోయినా గ్రేస్ పిరియడ్‌ ఉంటుందని గుర్తుంచుకోండి. సాధార‌ణంగా బీమా సంస్థ‌లు 30-రోజుల గ్రేస్ పిరియడ్ ఇస్తుంటాయి. ఈ స‌మ‌యంలోపు పునరుద్ధ‌ర‌ణ పూర్తి చేయ‌డం వ‌ల్ల పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా జాగ్ర‌త్త‌ప‌డొచ్చు. కానీ, ఒక‌వేళ పాల‌సీ గ‌డువు తేదీ (గ్రేస్ పీరియడ్ పరిగణించకుండా) ముగిసిన త‌ర్వాత అనారోగ్యం కార‌ణంగా ఆసుప్ర‌తిలో చేరాల్సి వ‌స్తే మాత్రం క‌వ‌రేజీని కోల్పోతారు. అందువ‌ల్ల నిరంతర క‌వ‌రేజీ కోసం గ‌డువు తేదీలోపు పునరుద్ధ‌ర‌ణ పూర్తి చేయ‌డం మంచిది. గ‌డువు తేదీ స‌మీపిస్తున్న‌ప్పుడు.. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ బీమా సంస్థ‌లు మొబైల్‌కి సంక్షిప్త సందేశాల‌ను పంపిస్తుంటాయి. ఒక‌వేళ మీ బీమా సంస్థ నుంచి ఇటువంటి మెసేజీలు రాక‌పోతే అల‌ర్ట్‌ల‌ను యాక్టివేట్ చేయాలని బీమా సంస్థ‌ను కోర‌వ‌చ్చు.

క‌వరేజీ పెంచుకోవ‌చ్చు..

ప్ర‌తి ఏడాదీ వైద్య ఖ‌ర్చులు పెరుగుతూనే వ‌స్తున్నాయి. వీటికి త‌గిన‌ట్లే క‌వరేజీ కూడా ఉండాలి. పాల‌సీ పునరుద్ధ‌ర‌ణ స‌మ‌యంలోనే క‌వ‌రేజీ పెంపునకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, కుటుంబ ఆరోగ్య అవ‌స‌రాల‌కు అనుగుణంగా క‌వరేజీని పెంచుకోవ‌చ్చు లేదా టాప్‌-అప్, సూప‌ర్ టాప్‌-అప్ పాల‌సీను యాడ్‌-ఆన్ పాల‌సీగా తీసుకోవ‌చ్చు.

కుటుంబ స‌భ్యులు పెరిగితే.. 

పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో కొత్త కుటుంబ స‌భ్యుల‌ను పాల‌సీలో చేర్చే అవ‌కాశం ఉంటుంది. కొత్త‌గా వివాహం అయ్యి జీవిత భాగ‌స్వామి వ‌చ్చినా, పిల్ల‌లు పుట్టినా పాల‌సీలో చేర్చి కొత్త కుటుంబ స‌భ్యుల‌ను ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ కిందకి తీసుకురావ‌చ్చు. అలాగే కుటుంబ స‌భ్యులు ఎవ‌రైనా మ‌రిణించిన‌ప్పుడు కూడా పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో ఈ వివ‌రాలు తెలియ‌జేయ‌వ‌చ్చు. దీనివ‌ల్ల‌ ప్రీమియం త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

పాల‌సీ బ‌దిలీ చేసుకోవ‌చ్చు..

మీ ప్ర‌స్తుతం బీమా సంస్థ‌ సేవ‌ల‌తో అసంతృప్తిగా ఉన్నా.. ప్రస్తుతం పాల‌సీ మీ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేక‌పోయినా పాల‌సీ బ‌దిలీ చేసుకోవ‌చ్చు. పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో పాల‌సీ స‌మీక్ష చేసుకుని మీ అవ‌స‌రాల‌కు స‌రిపోయే మ‌రొక పాల‌సీకి మార‌వ‌చ్చు. ఇలా మారడం వల్ల వెయిటింగ్ పిరియడ్ లాంటివి పాత పాలసీ నుంచి పరిగణనలోకి తీసుకుంటారు.

మొబైల్ అప్లికేష‌న్‌..

మొబైల్ అప్లికేషన్లు బీమా క్లెయిమ్, సెటిల్‌మెంట్‌లను సులభంత‌రం చేస్తున్నాయి. వేగంగా, పార‌ద‌ర్శ‌కంగా క్లెయిమ్ ప్రక్రియ‌ను పూర్తి చేసేందుకు స‌హాయ‌ప‌డుతున్నాయి. కాబట్టి, ప్రస్తుత బీమా సంస్థ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను అందిస్తున్న‌దీ.. లేనిదీ  తెలుసుకోండి. క్లెయిమ్ సమాచారం కోసం డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయడం.. రియల్ టైమ్ క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్, పాల‌సీ సంబంధిత స‌మాచారాన్ని యాక్సెస్ చేయ‌డం.. ఇప్పటికే ఉన్న పాలసీని ఒక్క క్లిక్‌తో రెన్యూవల్ చేయడం వంటి  కొన్ని ముఖ్య‌మైన ఫీచ‌ర్లు యాప్‌లో ఉండాలి.

చివరగా: ఏళ్ల త‌ర‌బ‌డి ఒకే పాల‌సీని పున‌రుద్ధ‌రించ‌డం కూడా స‌రైన‌ది కాదు. ఎందుకంటే గ‌తంలో మీరు కొనుగోలు చేసిన పాల‌సీ అప్ప‌టి అవ‌స‌రాల‌కు స‌రైన‌దే కావ‌చ్చు. కానీ, కాల‌క్ర‌మేణా అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కాబ‌ట్టి, కుటుంబ ఆరోగ్య అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని అదే పాల‌సీని కొన‌సాగించాలా లేదా కొత్త పాల‌సీ తీసుకోవ‌డం మంచిదా.. అనే విష‌యాల‌ను అంచ‌నా వేసి, పునరుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో త‌గిన పాల‌సీని ఎంచుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు