FD Interest: 8.40% వ‌ర‌కు అత్య‌ధిక వ‌డ్డీ అందిస్తున్న బ్యాంకు ఇదే..

ఈ ఆఫ‌ర్ 31 అక్టోబ‌రు, 2022 వ‌ర‌కు డిపాజిట్ చేసిన వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

Updated : 04 Oct 2022 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ను పుర‌స్క‌రించుకుని డిపాజిట్‌దార్ల‌ను ఆకర్షించేందుకు బ్యాంకులు మంచి వడ్డీ రేట్లతో డిపాజిట్లను అందిస్తున్నాయి. ఇందులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాస్త ముందున్నాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 'షాగున్ 501' పేరుతో ప్ర‌త్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ప్రారంభించింది. 501 రోజుల ఎఫ్‌డీపై రిటైల్ ఖాతాదారుల‌కు సంవ‌త్స‌రానికి 7.90% వ‌డ్డీని ఈ బ్యాంకు అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజన్లు ఏడాదికి 8.40% వ‌డ్డీ పొందొచ్చు. ఈ ఆఫ‌ర్ అక్టోబ‌ర్‌ 31 వరకు డిపాజిట్ చేసిన వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

  • 7 రోజుల నుంచి 500 రోజుల వ‌ర‌కు సాధార‌ణ డిపాజిట్‌దార్ల‌కు 4 నుంచి 7.35 శాతం వ‌ర‌కు వ‌డ్డీ అందించనుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కైతే 46 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి ఉన్న అన్ని డిపాజిట్ల‌పైనా సాధార‌ణ డిపాజిట్‌దార్ల‌క‌న్నా 0.50% అధిక వ‌డ్డీని ఈ బ్యాంకులో పొందొచ్చు. రూ. 2కోట్లలోపు ఎఫ్‌డీల‌కు ఈ వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి.
  • 1-10 ఏళ్ల కాలప‌రిమితితో మ‌ధ్య‌లో ఉప‌సంహ‌రించుకోవ‌డానికి అవ‌కాశ‌మున్న రూ.2 కోట్లు దాటి ఉన్న‌ (Callable) ఎఫ్‌డీల‌పై గ‌రిష్ఠంగా 7.0% వ‌ర‌కు వ‌డ్డీని బ్యాంకు అందిస్తోంది. మ‌ధ్య‌లో ఉప‌సంహ‌రించుకోవ‌డానికి వీలులేని (Non-Callable) ఎఫ్‌డీల‌పై గ‌రిష్ఠంగా 7.25% వ‌డ్డీని బ్యాంకు ఇస్తోంది. 

గ‌మ‌నిక‌: ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు స‌్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల‌ డిపాజిట్ల‌పై రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ (DICGC) కింద బీమా ఉంటుంది. నష్టభయం గురించి ఆలోచించేవారు రూ.5 లక్షలకు మించి వీటిల్లో డిపాజిట్‌ చేయకపోవడమే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని