NHAI: ఫాస్టాగ్‌ జోరు.. గతేడాది రూ.50,855 కోట్లు వసూలు!

గతేడాది దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని ఫీజు ప్లాజాల వద్ద రూ.50,855 కోట్లు వసూలయినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. 2021తో పోల్చితే ఇది 46 శాతం అధికమని తెలిపింది.

Published : 24 Jan 2023 21:12 IST

దిల్లీ: దేశంలో ఫాస్టాగ్‌(FASTag) వసూళ్ల జోరు పెరిగింది. గతేడాది జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని ఫీజు ప్లాజా(Fee Plaza)ల వద్ద ఫాస్టాగ్‌ల ద్వారా రూ.50,855 కోట్లు వసూలయినట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) మంగళవారం వెల్లడించింది. 2021తో వసూలు చేసిన రూ.34,778 కోట్లతో పోల్చితే ఇది 46 శాతం అధికమని పేర్కొంది. అదేవిధంగా.. గతేడాది డిసెంబరులో ఫాస్టాగ్‌ ద్వారా రోజువారీ సగటు టోల్ వసూళ్లు రూ.134.44 కోట్లుగా నమోదైందని తెలిపింది. అదే నెల 24న అత్యధికంగా రూ.144.19 కోట్లు వచ్చినట్లు ఎన్‌హెచ్‌ఏఐ ఒక ప్రకటనలో చెప్పింది.

ఫాస్టాగ్‌ లావాదేవీల సంఖ్యలోనూ 2022లో 48 శాతం వృద్ధి సాధించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. 2021లో ఫాస్టాగ్ లావాదేవీల సంఖ్య 219 కోట్లు కాగా, 2022 నాటికి 324 కోట్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ ఫీజు ప్లాజాల సంఖ్య సైతం పెరిగింది. 2021లో వీటి సంఖ్య 922గా ఉండగా.. 2022 నాటికి 1,181కి చేరుకుంది. ఇదిలా ఉండగా.. 2021 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం అన్ని ప్రైవేటు, వాణిజ్య వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి రెట్టింపు రుసుం వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 6.4 కోట్ల ఫాస్టాగ్‌లు జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని