Urban Cruiser: టయోటా అర్బన్‌ క్రూజర్‌ను ఇక కొనలేరు

వినియోగదారుల స్పందనను అనుసరించి టయోటా అర్బన్‌ క్రూజర్‌ను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

Published : 11 Nov 2022 12:25 IST

దిల్లీ: అర్బన్‌ క్రూజర్‌ ఎస్‌యూవీని తమ కార్ల పోర్ట్‌ఫోలియో నుంచి తొలగిస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఇకపై దేశంలో ఈ కారు విక్రయాలు నిలిచిపోనున్నాయి. దీన్ని కంపెనీ 2020 సెప్టెంబరులో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మారుతీ సుజుకీతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మారుతీ విటారా బ్రెజాకు మార్పులు చేసి అర్బన్‌ క్రూజర్‌గా ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 65 వేల యూనిట్లను విక్రయించారు. వినియోగదారుల స్పందనను అనుసరించి ఎప్పటికప్పుడు తమ కార్లలో మార్పులు చేస్తుంటామని.. కొత్త మోడళ్లను ప్రవేశపెడుతుంటామని కంపెనీ తెలిపింది. ఆ వ్యూహాల్లో భాగంగానే అర్బన్‌ క్రూజర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది.

కార్లను తొలిసారి కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా అర్బన్‌ క్రూజర్‌ను తీసుకొచ్చినట్లు టయోటా తెలిపింది. ముఖ్యంగా టైర్‌-2, టైర్‌-3 పట్టణాల్లో తమ ప్రణాళికల్ని విజయవంతంగా అమలు చేయగలిగామని పేర్కొంది. భారత మార్కెట్‌లో హైబ్రిడ్‌ సహా ఇతర కార్‌ మోడళ్లను సంయుక్తగా సరఫరా చేయాలని 2018 మార్చిలో టయోటా, సుజుకీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా మారుతీ నుంచి బాలెనో, బ్రెజాను తీసుకొని డిజైన్‌, ఫీచర్లలో టయోటా కొన్ని మార్పులు చేసింది. వాటినే గ్లాంజా, అర్బన్‌ క్రూజర్‌గా విక్రయిస్తోంది. తాజాగా అర్బన్‌ క్రూజర్‌ను వెనక్కి తీసుకున్నప్పటికీ.. గ్లాంజాను మాత్రం కొనసాగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని