Credit Card: ట్రావెల్‌ కార్డుతో హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి..

చాలా వరకు ట్రావెల్‌ కార్డులు జాయినింగ్‌ ఫీజు లేదా వార్షిక రుసుములతో వస్తాయి. కాబట్టి కార్డు తీసుకునే ముందు వీటిని తెలుసుకోవాలి.

Updated : 22 Nov 2022 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన సమయం దగ్గర పడుతోంది. 2022 ముగింపునకు కొన్ని వారాలే మిగిలి ఉన్నందున సంవత్సరాంతపు సెలవులు ఆస్వాదించేందుకు చాలా మంది హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుంటారు. దీంతో ప్రయాణ బుకింగులకు డిమాండ్‌ పెరిగి ఖర్చు పెరగవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రావెల్‌ కార్డుల సాయంతో ప్రయాణికులు తమ హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేసుకొని కొంత వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. అయితే, విహారయాత్రల కోసం క్రెడిట్‌ కార్డును ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..  

ట్రావెల్‌ కార్డులు..

క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు, ప్రయాణాలు చేసేవారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రావెల్‌ కార్డులను డిజైన్‌ చేసి అందిస్తున్నాయి. ప్రయాణాల్లో ఈ కార్డులను ఉపయోగించడం ద్వారా ప్రయాణానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందొచ్చు. ప్రస్తుతం రెండు రకాల ట్రావెల్‌ కార్డులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి కో-బ్రాండెడ్‌ కార్డులు. రెండోది నాన్‌ కో-బ్రాండెడ్‌ కార్డులు.

కో-బ్రాండెడ్‌ ట్రావెల్‌ కార్డులు ఎక్కువగా ప్రయోజనాలను అందిస్తుంటాయి. సాధారణంగా 1:1 రివార్డు పాయింట్లను ఎయిర్‌లైన్ మైల్స్‌గా మారుస్తుంటాయి. కార్డుదారులు వేగంగా రివార్డు పాయింట్లను సమకూర్చుకునేందుకు దోహదపడతాయి. కానీ, ఈ పాయింట్లను భాగస్వామ్య సంస్థలు, బ్రాండ్ల వద్ద మాత్రమే రిడీమ్‌ చేసుకునే వీలుంటుంది. నాన్‌ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు ప్రయాణ ఖర్చులపై రివార్డు పాయింట్లను అందిస్తాయి. వీటిని భాగస్వామ్య బ్రాండ్‌ల వద్ద మాత్రమే కాకుండా ఇతర చోట్ల కూడా ఉపయోగించుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు..

బడ్జెట్‌: ముందు ఖర్చు చేయండి.. తర్వాత బిల్లు చెల్లించండి అనేది క్రెడిట్‌కార్డుల్లో అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి, ఖర్చు చేసేటప్పుడు క్రెడిట్‌ కార్డు లిమిట్‌ వరకు ఇబ్బంది లేకుండా ఖర్చు చేయవచ్చు. బిల్లు కట్టే సమయం వచ్చినప్పుడు గానీ తెలియదు అసలు భారం. ఇటువంటి ఇబ్బందులు పడకూడదంటే.. పర్యటనకు వెళ్లేందుకు ముందే ఈ ట్రిప్‌ కోసం మీ బడ్జెట్‌ ఎంతో నిర్ణయించుకుని దాని ప్రకారం నడుచుకోండి. అప్పుడే ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతారు. క్రెడిట్‌ కార్డు లిమిట్‌ ఉన్నంతవరకు కాకుండా మీ బడ్జెట్‌ ప్రకారం ఖర్చు చేసేలా జాగ్రత్త పడొచ్చు.

పరిశోధన: ఆ తర్వాత మీ ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డు అందించే ప్రయోజనాలను తెలుసుకోవాలి. చాలా వరకు ట్రావెల్‌కార్డులు.. కార్డు ద్వారా చేసే ఖర్చుపై రివార్డు పాయింట్లను, ఎయిర్‌మైళ్లను అందిస్తాయి. వీటిని సెలవుల కోసం టూర్‌ ప్లాన్‌ చేసినప్పుడు ఉపయోగించుకుని ప్రయాణపు టికెట్‌, వసతి బుకింగ్‌పై రాయితీలను పొందవచ్చు. కాబట్టి విమాన టికెట్లు, హోటల్ రూమ్స్‌ వంటివి బుక్‌ చేసేటప్పుడు తగిన పరిశోధన చేసి ట్రావెల్‌ కార్డుతో బుక్‌ చేసుకుంటే.. అదనపు మొత్తం ఆదా చేసుకోవచ్చు. 

ప్రత్నామ్నాయ కార్డు: ట్రావెల్‌ చేస్తున్నప్పుడు ప్రాథమిక క్రెడిట్‌కార్డుతో పాటు ప్రత్యామ్నాయ కార్డును దగ్గర పెట్టుకోవడం మంచిది. ఒకవేళ ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య కారణంగా ప్రాథమిక కార్డు పనిచేయకపోయినా ప్రత్నామ్నాయ కార్డు ఉపయోగపడుతుంది. 

తక్కువ ఫారెక్స్‌ ఫీజులు: విదేశాల్లో ప్రయాణ ఖర్చులకు క్రెడిట్‌కార్డును ఉపయోగిస్తుంటే.. బ్యాంకులు సాధారణంగా విదేశీ మారకపు (మార్కప్‌) ఫీజు వసూలు చేస్తాయి. ఇది గరిష్ఠంగా 3.50% వరకు ఉండొచ్చు. అయితే, చాలా వరకు ట్రావెల్‌ కార్డులు తక్కువ ఫారెక్స్‌ ఫీజుతో వస్తున్నాయి. కాబట్టి విదేశాలకు టూర్‌ ప్లాన్‌ చేస్తుంటే ఫారెక్స్‌ ఫీజు, నగదు విత్‌డ్రా ఫీజు, విదేశీ లావాదేవీల రుసుములు తక్కువగా వర్తించే (లేదా వర్తించని) కార్డులను అన్వేషించి తీసుకోవడం ద్వారా అదనపు మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

వార్షిక రుసుములు: చాలా వరకు ట్రావెల్‌ కార్డులు జాయినింగ్‌ ఫీజు లేదా వార్షిక రుసుములతో వస్తాయి. కాబట్టి కార్డు తీసుకునే ముందు వీటిని తెలుసుకోవాలి. కార్డు రుసుములు, దాని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు రెండింటినీ పోల్చి చూడాలి. ఒకవేళ మీరు చెల్లించే వార్షిక రుసుములు మంచి ప్రయోజనాలు ఇవ్వకపోయినా.. మీరు ఎక్కువగా కార్డును ఉపయోగించకపోయినా వార్షిక రుసుములు లేని కార్డును ఎంచుకోవడం మంచిది.

చెల్లింపులు: క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది బిల్లు చెల్లింపు తేదీ. సమయానికి బిల్లు చెల్లించినప్పుడు మాత్రమే ఏ క్రెడిట్‌ కార్డు అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే ప్రయోజనాల కంటే ఛార్జీల భారమే ఎక్కువవుతుంది. అలాగే క్రెడిట్‌ స్కోరుపై దీని ప్రభావం నేరుగా పడుతుంది. కాబట్టి సమయానికి బిల్లు చెల్లించండి. ముఖ్యంగా విదేశీ యాత్రల్లో కార్డు వాడినప్పుడు బిల్లు అధికంగా ఉంటుంది. సమయానికి బిల్లు చెల్లించకపోతే అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని