ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ IPOకు సెబీ ఓకే

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓకు (Utkarsh Small Finance Bank IPO) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Published : 26 Oct 2022 00:42 IST

దిల్లీ: ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓకు (Utkarsh Small Finance Bank IPO) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరించేందుకు అనుమతిచ్చింది. ఆగస్టులో ఐపీఓ కోసం సెబీకి ఈ బ్యాంకు దరఖాస్తు చేయగా.. తాజాగా ఆమోదం లభించింది. ఐపీఓ ద్వారా ఫ్రెష్‌ షేర్లను విక్రయించనున్నారు. ప్రీ ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో భాగంగా రూ.100 కోట్ల మేర సెక్యూరిటీలను బ్యాంక్‌ జారీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ మేర ఐపీఓ పరిమాణం తగ్గుతుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మూలధన అవరాలను తీర్చుకునేందుకు ఈ బ్యాంక్‌ వినియోగించుకోనుంది.

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను 2016లో నెలకొల్పారు. 2017 నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సేవింగ్స్‌ అకౌంట్లు, కరెంట్‌ అకౌంట్స్‌ నిర్వహించడంతో పాటు రికరింగ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సేకరిస్తోంది. ఖాతాదారులకు లాకర్‌ సదుపాయం అందిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 686 బ్యాంకు శాఖలు ఉన్నాయి. 12,617 మంది ఉద్యోగులు ఉన్నారు. 2022 మార్చి నాటికి రూ.10,630 కోట్ల మేర రుణాలు, దాదాపు అదే స్థాయిలో డిపాజిట్లు కలిగి ఉంది. గతేడాది రూ.1350 కోట్లతో ఐపీఓకు వచ్చేందుకు ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సెబీ ఆమోదం సైతం పొందినప్పటికీ.. ఎందుకనో ఆ ప్రయత్నాలను విరమించుకుంది. తాజాగా పరిమాణం తగ్గించుకుని ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని