Warren Buffett: అవి.. వారెన్‌ బఫెట్ మనసు తొలుస్తున్నాయట..!

పెట్టుబడిదారిగా, ఆర్థికపరంగా ఎన్నో ఒడుదొడుకులను చూసిన బెర్క్‌షైర్‌హాత్‌వే అధిపతి అయిన వారెన్‌ బఫెట్‌(Warren Buffett) కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అవేంటంటే..?

Published : 24 Apr 2023 12:49 IST

వాషింగ్టన్: ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌(Warren Buffett)ను కొన్ని విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఏ సంస్థ దూసుకెళ్తుందో ముందుగానే గ్రహించి పెట్టుబడులు పెట్టే ఈ ధనవంతుడు.. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను కలవరానికి గురిచేస్తోన్న విషయాలను వెల్లడించారు. 

అమెరికాలో ఇటీవలి బ్యాంకు వైఫల్యాలు, ద్రవ్యోల్బణం వంటి ఆర్థికాంశాలతో మీరు చింతిస్తున్నారా..? అని బఫెట్‌(Warren Buffett)కు ప్రశ్న ఎదురైంది. ఇప్పుడు ప్రపంచమంతా మాంద్యం భయం కనిపిస్తోంది. ఈ సమయంలో ఆయన తన సంస్థ(Berkshire Hathaway ) ఎదుగుదల గురించి ఆందోళన వ్యక్తం చేస్తారేమోనని భావిస్తాం. కానీ తన సంస్థతో ఉన్న సమస్యల కంటే తన నియంత్రణలో లేని విషయాలే ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు.

‘ఈ వయసులో నేను ఆందోళన చెందుతున్న విషయాలు వేరే ఉన్నాయి. సంస్థ విషయంలో మా సామర్థ్యం గురించి మాకు ఎలాంటి చింతా లేదు. కానీ అణుముప్పు, భవిష్యత్తులో వచ్చే మహమ్మారి.. వంటి విషయాలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ అవేవీ నా నియంత్రణలో లేవు. ఇక నిద్రపోయేముందు నా సంస్థ గురించి భయపడిన రోజు లేదు. ఒకవేళ నా సంస్థకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. దానిని పరిష్కరించేందుకు కొత్త ఆలోచన చేస్తాను. నేను ఆశావహ దృక్పథంతో ఉంటాను. ఆర్థిక వ్యవస్థలో ఎదురయ్యే ప్రమాదాలు, కొత్త ట్రెండ్స్‌ను ముందుగానే అంచనా వేయగలనని నమ్మకమే అందుకు కారణం’ అని బఫెట్‌(Warren Buffett) వెల్లడించారు. అలాగే సుదీర్ఘమైన జీవితానికి ఆనందం, ఆశావాదం ముఖ్యమని బఫెట్ నమ్మకం. కొకొకోలా, బర్గర్లు, ఐస్‌క్రీముల వంటివి ఆరగించడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పారీ 92 ఏళ్ల పెట్టుబడిదారు. విరాళాల పరంగానూ ఆయన ముందువరుసలోనే ఉంటారని తెలిసిందే.

ఆయన కలవరానికి గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణం. 2022 ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌-రష్యా(Ukraine Crisis)మధ్య యుద్ధం నడుస్తోంది. ఏడాది దాటినా ఆ సంక్షోభానికి ముగింపు కనిపించకపోగా.. రష్యా అణుదాడికి పాల్పడొచ్చనే భయాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి(Coronavirus) ఉక్కిరిబిక్కిరి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని