Health Insurance: మీ ఆరోగ్య బీమా సంస్థ వెల్‌నెస్‌ బెనిఫిట్స్‌ అందిస్తుందా?

పాలసీదారులను అరోగ్యవంతమైన జీవనశైలి వైపు ప్రోత్సహించేందుకు..చాలా వరకు బీమా సంస్థలు, పాలసీలో భాగంగానే వెల్‌నెస్‌ ప్రయోజనాలను అందిస్తున్నాయి.

Published : 27 Feb 2023 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యమే ఎవరికైనా నిజమైన, అతిపెద్ద సంపద. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే.. ఎంత డబ్బు పోగుచేసినా, ప్రయోజనం శూన్యమే అవుతుంది. ఈ సత్యం మనలో చాలా మందికి తెలిసిందే. అయినప్పటికీ నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వేళకు పౌష్టికాహారం తీసుకోవడం, తగిన వ్యాయామం, వేళకు నిద్రపోవడం వంటివి చాలా మంది రోజువారి జీవితంలో చేయడం లేదు. దీంతో అనారోగ్యాలు, ముఖ్యంగా జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని..బీమా సంస్థలు వెల్‌నెస్‌ ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. బీమా సంస్థలు సాధారణంగా అందించే కొన్ని వెల్‌నెస్‌ ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. 

వెల్‌నెస్‌ ప్రయోజనాలు ఎందుకు?

పాలసీదారులను అరోగ్యవంతమైన జీవనశైలి వైపు ప్రోత్సహించేందుకు.. చాలా వరకు బీమా సంస్థలు, పాలసీలో భాగంగానే వెల్‌నెస్‌ ప్రయోజనాలను అందిస్తున్నాయి. తత్ఫలితంగా, పాలసీదారులు వారి జీవన విధానంపై మరింత శ్రద్ధ వహిస్తారు. ఆహారం, నిద్ర వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. దీంతో క్లెయింల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, బీమా సంస్థలు ఇలాంటి వెల్‌నెస్‌ ప్రయోజనాలను అందిస్తుంటాయి. 

నిజానికి, బీమా నియంత్రణ సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం..పాలసీదారులలో ఫిట్‌నెస్‌, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు, బీమా సంస్థలు ప్రివెంటివ్‌ హెల్త్‌ & వెల్‌నెస్ ప్రయోజనాలను అందించాలి. వీటిని ఇన్‌-బిల్ట్‌ కవరేజీలు లేదా ఐచ్ఛిక యాడ్‌-ఆన్‌లుగా కూడా అందించేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతించింది. 

ఎలా పనిచేస్తాయి?

పాలసీదారుడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలుసుకునేందుకు హార్ట్‌ రేట్‌, ఇన్సులిన్‌ లెవెల్‌ వంటి  వివిధ రకాల గుడ్‌ హెల్త్‌ సూచనలను బీమా సంస్థలు చూస్తాయి. పాలసీదారుని రిఫరెన్స్‌ కోసం పాలసీ పత్రాలలో కూడా వీటి గురించి స్పష్టంగా పేర్కొంటాయి. పాలసీ కాలవ్యవధి ప్రారంభమైన తర్వాత, డిజిటల్‌ పరికరాలు, మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా బీమా చేసిన వ్యక్తి పురోగతిని ఈ గుడ్‌ హెల్త్‌ సూచనల ద్వారా పర్యవేక్షిస్తుంటాయి. 

పాలసీదారుని పురోగతిని అనుసరించి..వెల్‌నెస్‌ పాయింట్లను నిర్దిష్ట కాలవ్యవధిలో లేదా ఏడాదికి ఒకసారి అందిస్తాయి. పాలసీదారుడు రోజువారి చేసే వ్యాయామం, ఇతర అలవాట్లలో బీమా సంస్థ సూచించిన స్థాయిని చేరుకున్నప్పుడు కూడా వెల్‌లెస్‌ పాయింట్లను అందిస్తాయి. ఉదాహరణకి, కొన్ని బీమా సంస్థలు ప్రతిరోజు నిర్ణీత అడుగుల దూరం వాకింగ్‌ చేస్తే వెల్‌నెస్‌ పాయింట్లను అందిస్తున్నాయి.    

ఎక్కడ ఉపయోగించవచ్చు?

ఆరోగ్య బీమా పాలసీ కింద వచ్చే ప్రివెంటివ్‌ హెల్త్‌, వెల్‌నెస్‌ ప్రయోజనాలు..వెల్‌నెస్‌ పాయింట్లు లేదా రివార్డు పాయింట్ల రూపంలో అందుబాటులో ఉంటాయి. పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియం తగ్గింపు, ఫార్మసి బిల్లులు, డాక్టర్ సంప్రదింపు ఛార్జీలు వంటి వాటి కోసం ఈ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవచ్చు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, ఎంప్యానెల్‌డ్ సర్వీస్ ప్రొవైడర్లు అందించే సేవలను పొందేందుకు కూడా ఈ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవచ్చు.  

ఆరోగ్య బీమా పాలసీ కింద సాధారణంగా లభించే వెల్‌నెస్‌ ప్రయోజనాలు..

ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌..
వెల్‌నెస్‌ ప్రయోజనాలల్లో చాలా వరకు బీమా సంస్థలు ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌లను అందిస్తున్నాయి. వీటితో, పాలసీదారులు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చు. ప్రమాదకరమైన వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించేందుకు వీలుంటుంది. నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద ఉచితంగా గానీ, తగ్గింపు ధరతో గానీ ఈ సేవలు లభిస్తాయి. 

ఆరోగ్య సంరక్షణ సేవలపై తగ్గింపు..
ఓపీడీ సంప్రదింపులు, చికిత్సలు, రోగనిర్ధారణ పరీక్షలు, ఔషధాలు మొదలైన ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తగ్గింపు పొందొచ్చు. 

పర్సనల్‌ వెల్‌నెస్‌ కోచ్‌..
కొన్ని బీమా సంస్థలు ఆరోగ్య సంరక్షణ కోసం వ్యక్తిగత వెల్‌నెస్‌ కోచ్‌ను అందిస్తున్నాయి. ఈ కోచ్‌..పాలసీదారులు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు రోజువారిగా చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన పౌష్టికాహారం, సరైన శరీర బరువును నిర్వహించడం, ధూమపానం వంటి చెడు అలవాట్లను విడిచి పెట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలు వంటి మరెన్నో సూచనలు ఇస్తుంటారు. 

ఫిట్‌నెస్‌ సెంటర్లలో..
ఫిట్‌గా ఉండేందుకుగానూ జిమ్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, యోగాకేంద్రాలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు వంటి వాటిలో చేరుతుంటారు. ఈ సెంటర్లలో రివార్డు పాయింట్లను ఉపయోగించుకుని తక్కువ ధరకు సభ్యత్వాన్ని పొందే వీలుంది. అయితే, బీమా సంస్థలు సూచించిన వాటికి మాత్రమే రివార్డు పాయింట్లు రిడీమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. 

ప్రీమియం తగ్గించుకోవచ్చు..
వెల్‌నెస్‌ పాయింట్లను పునరుద్ధరణ సమయంలో ప్రీమియం తగ్గింపు కోసం ఉపయోగించికోవచ్చు. యాడ్‌-ఆన్‌ కవర్‌గా అందుబాటులో ఉంటే, ఈ పాయింట్లను..రెన్యువల్ ప్రీమియంపై తగ్గింపు కోసం వాడుకోవచ్చు. 

సెకెండ్‌ ఓపినియన్‌..
ఏదైనా వ్యాధి నిర్ధారణ అయినట్లయితే..శస్త్రచికిత్సలకు వెళ్లేముందు మరొక డాక్టరు అభిప్రాయం తీసుకోవచ్చు. ఇందుకోసం పాలసీదారుడు ముందుగా బీమా సంస్థకు తెలియజేసి, సంబంధిత అన్ని మెడికల్‌ రికార్డులు, ఇన్వెస్టిగేషన్‌, ప్రస్తుత ఔషధాల కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. 

చివరిగా..

అన్ని బీమా సంస్థలు ఒకేరకమైన ప్రయోజనాలను అందించవు. కాబట్టి, మీ పాలసీ పత్రాలను తీసి మీకు వర్తించే వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌ గురించి తెలుసుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకుని వెల్‌నెస్‌ పాయింట్లను సంపాదించి ప్రయోజనం పొందండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని