Best airlines: ప్రపంచ అత్యుత్తమ విమాన సంస్థ ఇదే.. టాప్‌-20లో మనదొక్కటే!

2022 గానూ ప్రపంచ అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌ సంస్థగా కతర్‌ ఎయిర్‌వేస్‌ (Qatar Airways) నిలిచింది. భారత్‌ నుంచి విస్తారా ఈ జాబితాలో 20వ స్థానాన్ని దక్కించుకుంది.

Published : 26 Sep 2022 14:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ కారణంగా భారీ సంక్షోభం ఎదుర్కొన్న విమానయాన రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కరోనా తగ్గుముఖం పట్టడం, వివిధ దేశాల మధ్య రాకపోకలు పెరగడం, పర్యాటకం కూడా వృద్ధి చెందడంతో విమానాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు విమానయాన సంస్థలు అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అలా 2022 గానూ ప్రపంచ అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌ సంస్థగా కతర్‌ ఎయిర్‌వేస్‌ (Qatar Airways) నిలిచింది. భారత్‌ నుంచి విస్తారా ఈ జాబితాలో 20వ స్థానాన్ని దక్కించుకుంది.

స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌లైన్‌ అవార్డ్స్‌ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. 2021 సెప్టెంబర్‌ నుంచి 2022 ఆగస్టు వరకు ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 100 దేశాలకు చెందిన కోటీ 40లక్షల మంది ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. మొత్తం 350 విమాయాన సంస్థలపై జరిపిన ఈ సర్వే ఫలితాలను యూకేలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. ఇందులో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ టాప్‌-20లో నిలవగా.. దక్షిణాసియా, భారత్‌లో అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌గా చోటు దక్కించుకుంది. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్తంగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ అవార్డు రావడం పట్ల విస్తారా సీఈఓ వినోద్‌ కన్నన్‌ సంతోషం వ్యక్తంచేశారు.

ఇక ఈ అవార్డుల్లో జపాన్‌కు చెందిన ఆల్‌ నిప్పన్‌ ఎయిర్‌వేస్‌ ప్రపంచంలోనే పరిశుభ్రత కలిగిన ఎయిర్‌లైన్‌గా అవార్డును సొంతం చేసుకుంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ విభాగంలో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. ఇక బెస్ట్‌ ఫస్ట్‌క్లాస్‌ క్యాబిన్‌ విభాగంలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌.. బెస్ట్‌ బిజినెస్‌ క్లాస్‌ విభాగంలో కతర్‌ ఎయిర్‌వేస్‌ తొలి స్థానంలో నిలిచాయి. కొవిడ్‌ మహమ్మారి వణికిస్తున్న సమయంలోనూ కతర్‌ ఎయిర్‌వేస్‌ నిరంతరాయంగా సేవలను కొనసాగించిందని స్కైట్రాక్స్‌ సీఈఓ ఎడ్వర్డ్‌ ప్లయిస్టెడ్‌ తెలిపారు. ఆ ఎయిర్‌లైన్స్ గమ్యస్థానాలు ఎప్పుడూ 30కి తగ్గలేదని పేర్కొన్నారు.

టాప్-5 ఎయిర్‌లైన్స్‌..

  • కతర్‌ ఎయిర్‌వేస్‌
  • సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌
  • ఎమిరేట్స్‌
  • ఆల్‌ నిప్పన్‌ ఎయిర్‌వేస్‌
  • క్వాంటస్‌ ఎయిర్‌లైన్స్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని