Indian Passport: భారత్‌ పాస్‌పోర్టుతో.. వీసా లేకుండానే 60 దేశాలకు వెళ్లొచ్చు

ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్టు (Passport) కలిగిన దేశంగా జపాన్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు వీసా (Visa) లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా 193 దేశాల్లో పర్యటించవచ్చు.

Published : 20 Jul 2022 19:17 IST

శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా జపాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్టు (Passport) కలిగిన దేశంగా జపాన్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు వీసా (Visa) లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా 193 దేశాల్లో పర్యటించవచ్చు. ఈ జాబితాలో సింగపూర్‌, దక్షిణ కొరియాలు రెండో స్థానంలో నిలిచాయి. కొవిడ్‌ కంటే ముందు ఈ జాబితాలో అగ్రస్థానంలో యూరోపియన్‌ దేశాలు ఉండగా.. తాజాగా ఆ స్థానాలను ఆసియా దేశాలు ఆక్రమించడం గమనార్హం.

జపాన్‌ (Japan) పాస్‌పోర్టు ఉంటే వీసా లేకుండానే (Visa-Free) 193 దేశాలకు ప్రయాణించే వీలుంది. సింగపూర్‌, దక్షిణ కొరియా దేశాల పాస్‌పోర్టులు ఉన్నవారు మాత్రం 192 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చని ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌’ పేర్కొంది. ఈ జాబితాలో రష్యా 50వ స్థానంలో నిలవగా.. ఆ దేశ పాస్‌పోర్టుతో 119 దేశాల్లో వీసా లేకుండానే సాఫీగా ప్రయాణం చేయవచ్చు. ఇక 69వ స్థానంలో ఉన్న చైనా పాస్‌పార్టుతో 80 దేశాల్లో స్వేచ్ఛగా తిరిగిరావచ్చు.

వీసాలేకుండా పర్యటించే వీలున్న జాబితాలో భారత్‌ 87వ స్థానంలో నిలిచింది. భారత్‌ పాస్‌పోర్టు (Indian Passport) ఉన్నవారు 60 దేశాల్లో ముందస్తు అనుమతి (వీసా) లేకుండానే పర్యటించవచ్చు. జర్మనీ, స్పెయిన్‌లు మూడో స్థానం (190దేశాలతో), ఫిన్లాండ్‌, ఇటలీ, లక్సంబర్గ్‌లు (189 దేశాలతో) నాలుగో ర్యాంక్‌ సాధించాయి. ఆస్ట్రియా, డెన్మార్‌లు మాత్రం 188దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలుతో ఐదో ర్యాంక్‌లో నిలిచాయి. ఇక చివరి స్థానంలో తాలిబాన్‌ అధికారంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కేవలం 27 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లవచ్చు.

ఒకదేశం పౌరులు ఇతర దేశాల్లో పర్యటించాలంటే అక్కడి ప్రభుత్వం ముందస్తు అనుమతి (Visa) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొన్ని దేశాలు మాత్రం అటువంటివి లేకుండా కేవలం పాస్‌పోర్టుతోనే తమ దేశంలో పర్యటించేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఇలా అత్యధిక దేశాల అనుమతి ఉన్న పాస్‌పోర్టును శక్తివంతమైనదిగా పరిగణిస్తుంటారు.  ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (IATA) సమాచారం ఆధారంగా హెన్లీ&పార్ట్‌నర్స్‌ పరిశోధకుల బృందం ప్రతిఏటా జాబితా రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే 2022 సంవత్సరానికి గాను ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌’ పేరుతో తాజా జాబితా విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని