Zomato: జొమాటో సంచలన నిర్ణయం.. 225 నగరాల్లో సేవలు నిలిపివేత!

గతేడాది అక్టోబరు నెల నుంచి ఫుడ్‌ డెలివరీ రంగంలో వ్యాపారం మందకొడిగా సాగుతోందని జొమాటో (Zomato) తెలిపింది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా 8 నగరాల్లో ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది. 

Published : 12 Feb 2023 19:11 IST

ముంబయి: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది.  గ్రాస్‌ ఆర్డర్‌ విలువ (GOV) 0.3 శాతం ఉన్న కారణంగా ఆయా నగరాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.‘‘ గత కొన్ని త్రైమాసికాలుగా 225 నగరాల్లో వ్యాపారం ప్రోత్సాహకరంగా లేదు. ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ  మార్కెట్‌లో నెలకొన్న ఈ మందగమనం ఎవరూ ఊహించినది. ఇది మా వ్యాపార వృద్ధిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ, కంపెనీ నిర్దేశించుకున్న దీర్ఘకాల లక్ష్యాలను అందుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని జొమాటో వెల్లడించింది. సేవలు నిలిపివేసిన నగరాల జాబితాను మాత్రం జొమాటో వెల్లడించలేదు. 

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గత అక్టోబరు నుంచి ఫుడ్‌ డెలివరీ రంగంలో వ్యాపారం మందకొడిగా సాగడమే ఇందుకు ప్రధాన కారణమని జొమాటో భావిస్తోంది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా 8 నగరాల్లో ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది. ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని గత నెలలో జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) ప్రకటించారు. వివిధ విభాగాల్లో 800 మందిని నియమించుకుంటామని తెలిపారు. ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతేడాది చివరి రెండు నెలల్లో పనితీరు ఆధారంగా సంస్థలో మూడు శాతం సిబ్బందిని తొలగించి, ఇప్పుడ నియామకాలు చేపట్టడం మార్కెట్‌ గిమ్మిక్‌ అని పలువురు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కంపెనీ 225 నగరాల్లో సేవలు నిలిపివేయడం వల్ల మరింత మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని