logo

ఆన్‌లైన్‌ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత

ఆదిలాబాద్‌ ఐపీపీబీ(ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్ బ్యాంక్‌) మేనేజర్‌ విజయ్‌ జాదవ్‌ ఆన్‌లైన్‌ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది.

Updated : 29 Mar 2024 06:24 IST

కస్టడీలో మేనేజర్‌ ఆసక్తికర విషయాలు వెల్లడి

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ ఐపీపీబీ(ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్ బ్యాంక్‌) మేనేజర్‌ విజయ్‌ జాదవ్‌ ఆన్‌లైన్‌ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పోలీసు కస్టడీలో విచారణ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. వివిధ మండలాలకు చెందిన రైతులు సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి విక్రయించిన పత్తి పంట తాలూకూ డబ్బులు తపాలా కార్యాలయంలోని వారి ఖాతాల్లో సీసీఐ జమ చేయగా దీన్ని అవకాశంగా తీసుకున్న మేనేజర్‌ విజయ్‌ జాదవ్‌ అక్రమాలకు తెరలేపాడు. రైతులకు చెందిన దాదాపు రూ.కోటి వరకు వారికి తెలియకుండా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు. తమ డబ్బుల కోసం ఒత్తిడి తీసుకొచ్చిన రైతులకు కొందరికి నేరుగా చెల్లించి మరికొందరికి రేపు మాపు అంటూ వాయిదా వేస్తుండటంతో అనుమానం వచ్చిన బాధిత రైతులు తపాలా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీంతో తపాలాశాఖ చీఫ్‌ మేనేజర్‌ భాస్కర్‌ నాయక్‌ ఈ నెల 16న ఆదిలాబాద్‌కు చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మేనేజర్‌ పలు రైతులకు చెందిన రూ.36 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలటంతో ఆదిలాబాద్‌ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్‌ ఒకటో పట్టణ పీఎస్‌ సీఐ కే.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. అనంతరం విజయ్‌ జాదవ్‌ కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆయన న్యాయస్థానంలో ఈ నెల 19న లొంగిపోయారు.

షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి : పోలీసుల విచారణలో కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌లో త్రీపత్తి(మూడు ముక్కలాట)లో డబ్బులు నష్టపోయినట్లు నిందితుడు పేర్కొన్నాడు. నష్టపోయిన డబ్బులను రాబట్టుకోవడానికి రైతుల ఖాతాల నుంచి నేరుగా డబ్బులను తన ఖాతాలోకి బదిలీ చేసుకుని ఆన్‌లైన్‌ జూదం ఆడటంతోపాటు షేర్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు ఆయన వివరించినట్లు తెలిసింది. దీంతో రైతులకు డబ్బులు చెల్లించే పరిస్థితులు లేక వారికి రేపు మాపు అంటూ వాయిదాలు వేసినట్లు సమాచారం. మరో మూడు రోజులు పోలీసులు తమ కస్టడీలో నిందితుడిని విచారించి మరిన్ని వివరాలను రాబట్టే యత్నం చేస్తున్నారు. ఈ కేసు విషయంలో జిల్లా పాలనాధికారి, జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తపాలా కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని