logo

మహా పోరు.. ప్రచార హోరు!

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో మహారాష్ట్రలోని చంద్రపూర్‌ స్థానానికి ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది.

Published : 15 Apr 2024 04:12 IST

 సరిహద్దు గ్రామాల్లో జిల్లా నేతల పర్యటన

సుర్దాపూర్‌లో భాజపా అభ్యర్థి తరఫున ఇంటింటి ప్రచారం చేస్తున్న జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, జిల్లా నాయకులు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం : పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో మహారాష్ట్రలోని చంద్రపూర్‌ స్థానానికి ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 19న అక్కడి గ్రామాల్లో పోలింగ్‌ జరగనుంది. సరిహద్దు గ్రామాల్లో ప్రచార హోరు తారాస్థాయికి చేరింది. ఆయా గ్రామాల్లో తెలుగు మాట్లాడేవారు అత్యధికులు ఉండటంతో ఆ ఓటర్లను ఆకర్షించేందుకు జిల్లా నేతలు ప్రచారంలో పాల్గొనడం మరింత ఆసక్తిని రేకేత్తిస్తోంది.

తెలంగాణ - మహారాష్ట్ర రాష్ట్రాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దున ఉంది. అటు వైపు యావత్మాల్‌, చంద్రపూర్‌, ఇటువైపు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలను పెన్‌గంగా నది విడదీస్తోంది. ఆ నదే రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వారి సత్సంబంధాలకు వారధిలా మారింది. నదికి అవతల మహారాష్ట్ర చంద్రపూర్‌ లోక్‌సభ నియోజకర్గ పరిధిలో యావత్మాల్‌, చంద్రపూర్‌ జిల్లాల్లోని ఆర్ని, రాజురా, బాల్లార్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నదికి ఇటు వైపున ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌-టి నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజల రాకపోకలు, బంధుత్వాలు కలుపుకొంటుండటంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినపుడు సరిహద్దు గ్రామాల్లో రాజకీయ చర్చ ఆసక్తికర అంశంగా మారుతోంది. ప్రస్తుతం ఈ నెల 19న చంద్రపూర్‌ లోకసభకు పోలింగ్‌ జరగనుండటంతో అందరి దృష్టి అటు వైపు మళ్లింది.

తెలుగు మాట్లాడే వారే లక్ష్యంగా..

చంద్రపూర్‌ లోకసభ పరిధిలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో భాజపా అభ్యర్థిగా సుధీర్‌ మునగంటివార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రతిభా ధనోర్కర్‌ నడుమే ప్రధానంగా పోటీ నెలకొందని మహారాష్ట్రవాసులు చెబుతున్నారు. మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల నడుమే ప్రధాన పోటీ జరగనుండటంతో.. సరిహద్దు గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేలా జిల్లా నేతలు అటువైపు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల కిందట ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ వెళ్లి ప్రచారం చేయగా.. ఆదివారం ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి తన అనుచరగణంతో తెలుగువారు అత్యధికంగా ఉండే మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలైన బోరి, పాటన్‌ సత్‌పల్లి, మాండ్వి, కమరెల్లి, సుర్దాపూర్‌, దిగ్రస్‌, దుర్బా, లింగ్టి, అర్దావన్‌ గ్రామాల్లో సుడిగాలి ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడి మరాఠీ భాష మాట్లాడేవారిని ఆకట్టుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆదిలాబాద్‌, బేల సభల్లో పాల్గొని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా చంద్రపూర్‌ లోక్‌సభ ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 19న జరిగినా వచ్చే నెల 13న జరిగే మన పోలింగ్‌ తర్వాతే జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు గెలుపు ఎవరిదనే చర్చ మాత్రం సరిహద్దు గ్రామాల్లో కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని