logo

పర్యవేక్షణ కొరవడి.. పాలన తడబడి

జైనూరు మండలంలోని చింతకర్ర గ్రామంలో వారం కిందట మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు.

Updated : 15 Apr 2024 06:42 IST

 పల్లెల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

జైనూరు వ్యవసాయశాఖ కార్యాలయం వెనుక చెత్తాచెదారం

జైనూరు మండలంలోని చింతకర్ర గ్రామంలో వారం కిందట మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. దీంతో నీరు సరఫరా కావడం లేదు. గ్రామస్థులంతా గ్రామంలోని ఒకేఒక చేతిపంపు నుంచి నీటిని పట్టుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల విషయంలో ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి.  

లింగాపూర్‌, జైనూర్‌, న్యూస్‌టుడే

గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో.. ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. అయితే ప్రత్యేక పాలనకు జిల్లాలో గెజిటెడ్‌ అధికారులు సరిపడా లేకపోవడంతో.. ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీలకు చొప్పున బాధ్యతలు అప్పగించారు. పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రత్యేకాధికారులు సమన్వయం చేసుకుంటూ.. గ్రామాల్లో అభివృద్ధి కొనసాగించాలని ప్రభుత్వం ఉద్దేశం. అయితే మూడు నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నా.. చాలా గ్రామాలను వారు సందర్శించడం లేదు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, వేసవి కావడంతో తాగునీటి ఎద్దడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయం నెలకొంది.

జిల్లా వ్యాప్తంగా 334 గ్రామ పంచాయతీలకు 124 మంది గెజిటెడ్‌ అధికారులు ప్రత్యేకాధికారులుగా నియామకమయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఒక్కో ప్రత్యేక అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించడంతో.. ప్రత్యక్ష పర్యవేక్షణ కరవైంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం చర్యలు కనిపించడం లేదు. ప్రతి రోజు అన్ని గ్రామాలను సందర్శించడం సాధ్యం కాకపోవడంతో ప్రత్యేక అధికారులు చరవాణిలో పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేస్తున్నారు. ప్రత్యేకాధికారులు నియమితులైన వారు విధిగా వారంలో కనీసం రెండు సార్లు కేటాయించిన పంచాయతీలను సందర్శించాలి. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. కానీ వారు నెలకోసారి కూడా గ్రామాల ముఖం చూడడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.

తాగునీటి పైనే,..

ప్రత్యేకాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడంతో.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రోజుల తరబడి మురుగు కాలువల్లో పూడిక తొలగించడం లేదు. దీంతో దుర్వాసనతో పాటు దోమలతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. చెత్తాచెదారం తీయకపోవడంతో పేరుకుపోతున్నాయి. ప్రస్తుత వేసవి కావడంతో చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో తీవ్రంగా ఉంది. మిషన్‌ భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతున్నాయి. తాగునీటి వనరులు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


సమస్యల పరిష్కారానికి కృషి

భిక్షపతి గౌడ్‌, జిల్లా పంచాయతీ అధికారి

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సరిపడా గెజిటెడ్‌ అధికారులు లేకపోవడంతో ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీలు అప్పగించాం. వారు వారంలో కనీసం రెండుసార్లు పంచాయతీలను సందర్శించాలి. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని