logo

అధికారుల దాడులలేవి?

జిల్లాలో గల్లీ గల్లీలో గొలుసు దుకాణాలు కొనసాగుతున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్న ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.

Published : 15 Apr 2024 04:18 IST

ఆసిఫాబాద్‌, తిర్యాణి, న్యూస్‌టుడే :  జిల్లాలో గల్లీ గల్లీలో గొలుసు దుకాణాలు కొనసాగుతున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్న ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఆబ్కారీ, పోలీసు శాఖలు బెల్టు దుకాణాలపై  విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఈసారి మాత్రం నాటి చొరవ వారిలో లోపించినట్లు కనిపిస్తోంది. దీంతో పట్టణం, పల్లె తేడా లేకుండా దర్జాగా గొలుసు దుకాణాలు తెరచి విక్రయాలు జరుపుతుండటం విమర్శలకు తావిస్తోంది.

 రూ. వందల కోట్ల వ్యాపారం..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్లలో మొత్తం 32 మద్యం దుకాణాలు, కాగజ్‌నగర్‌లో మూడు బార్లు ఉన్నాయి. ఏటా వీటి ద్వారా సుమారు రూ.250 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా మద్యం అక్రమంగా ఇక్కడికి వస్తుండగా.. జిల్లా సరిహద్దు మండలాల నుంచి మన మద్యం పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. లైసెన్సు పొందిన వ్యాపారులే బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.  బెల్టు దుకాణాల్లో సీసాకు రూ.20-30 అదనంగా వసూలు చేస్తుండటంతో మందుబాబులపై అదనపు భారం పడుతోంది.

కుటుంబాల్లో అశాంతి..

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు. కొందరు గ్రామస్థులు వీటిని మూసి వేయించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. కిరాణ, ఇతర దుకాణాల మాదిరిగా కనిపిస్తున్నా.. చాలా చోట్ల లోపల జరిగేది మద్యం అమ్మకాలే. గ్రామాల్లోనే అందుబాటులో ఉండడంతో పెద్దలే కాకుండా యువత సైతం దీనికి అలవాటు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అధికంగా మందు తాగిన వారు అల్లర్లు, గొడవలకు కారకులవుతున్నారు. కూలీ చేసి సంపాదించిన దానిలో సగానికి పైగా మద్యానికే వెచ్చిస్తుండటంతో కొన్ని కుటుంబాల్లో అశాంతి నెలకుంటోంది. యువత తాగి వాహనాలు నడుపుతుండటంతో.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు దాదాపు 1500లకు పైగానే బెల్టు దుకాణాలు ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

జాతీయ రహదారులు, దాబాల్లోనూ..

ఆబ్కారీ నిబంధనల ప్రకారం.. లైసెన్సు పొందిన దుకాణాల్లోనే మద్యం విక్రయాలు జరగాలి. గొలుసు దుకాణాల్లో విక్రయించకూడదు. కానీ జిల్లాలో ఇవేమీ అమలు కావడం లేదు. జాతీయ రహదారుల పక్కన, దాబాల్లోనూ దర్జాగా అమ్మకాలు జరుగుతున్నాయి. పాఠశాలలు, ఇళ్ల మధ్య, దేవాలయాల సమీపంలోనూ కొందరు బెల్టు దుకాణాలు నడుపుతున్నారు.

ఇది తిర్యాణి మండల కేంద్రంలోని ఓ కిరాణ దుకాణం లోపల పరిస్థితి. మందు బాబులు లోపలికి వచ్చి తాగి సీసాలు వదిలి  వెళ్లిపోయిన తరువాతి దృశ్యం. ఈ మండల కేంద్రంలోనే 10-15 వరకు గొలుసు దుకాణాలు ఉన్నాయి. ఏజెన్సీ మండలంలో మద్యం విక్రయించొద్దని గతంలో ఆదివాసీ మహిళలు ధర్నాలు చేపట్టారు. ఓ మైదాన ప్రాంతంలోని మద్యం దుకాణం నుంచి గొలుసు వ్యాపారులు కొనుగోలు చేసి ఇలా విక్రయాలు జరుపుతున్నారు.

జిల్లా కేంద్రంలో..

ఇది జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రహరీ ముందున్న బెల్టు దుకాణం. ముందు ఇలా పరదాలు అడ్డుగా పెట్టి లోపల మద్యం తాగేందుకు వసతి కల్పించారు. ఈ ప్రాంతంలో నిత్యం ఉదయం, సాయంత్రం మద్యం ప్రియుల సందడి కనిపిస్తోంది. దీంతో ఇరుగు పొరుగున ఉన్న ఇళ్ల వారు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని