logo

ఆహ్లాదం పోయి.. అధ్వానంగా మారి

ఉరుకులు, పరుగులతో జీవనం సాగిస్తున్న నేటి సమాజంలో ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని నాగమ్మ చెరువును మినీట్యాంకు బండ్‌గా మార్చాలనేదీ సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంకల్పం.

Published : 15 Apr 2024 04:20 IST

గత వర్షాకాలంలో బుద్ధ విగ్రహం చుట్టూ నీటితో కళకళలాడుతున్న నాగమ్మ చెరువు

కాగజ్‌నగర్‌ గ్రామీణం, సిర్పూర్‌(టి), న్యూస్‌టుడే : ఉరుకులు, పరుగులతో జీవనం సాగిస్తున్న నేటి సమాజంలో ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని నాగమ్మ చెరువును మినీట్యాంకు బండ్‌గా మార్చాలనేదీ సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంకల్పం. ఈ నేపథ్యంలో ఈ చెరువు నడి మధ్యలో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయించారు. చెరువు కట్ట నుంచి విగ్రహం వద్దకు వెళ్లడానికి వంతెన నిర్మించి 2023 జూన్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం చేయించారు. వర్షాకాలంలో బుద్ధుడి విగ్రహం చుట్టూ నీరు నిల్వ ఉండటంతో.. ఆహ్లాదాన్ని పంచింది. ప్రస్తుత వేసవిలో చెరువులోని నీటి మట్టం తగ్గడంతో ఎడారిని తలపిస్తోంది. ఇదే అదనుగా భావించిన పలువురు గొర్రెలు, మేకలు, కోళ్ల మాంసం వ్యర్థాలను సంచుల్లో నింపి చెరువులో ఇష్టానుసారంగా పడేస్తున్నారు. చెరువు సమీపంలో నివాసముంటున్న కుటుంబాలు, రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు దుర్గంధంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ చెరువు వార సంతకు సమీపంలో ఉన్నందున సంత కొనసాగే రోజుల్లో దుర్వాసన భరించలేకపోతున్నామని వ్యాపారులు, వినియోగదారులు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం రాత్రివేళల్లో మద్యం ప్రియులకు అడ్డాగా మారింది. మాంసం వ్యర్థాలను చెరువులో పడేయకుండా గ్రామ పంచాయతీ అధికారులు వ్యాపారులను కట్టడి చేయలేకపోతున్నారు. పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన చెరువు అధ్వానంగా మార్చారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాంసం వ్యర్థాలను చెరువులో పడేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.\

సంచుల్లో నింపి చెరువులో పడేసిన గొర్రెలు, మేకలు, కోళ్ల మాంసం వ్యర్థాలు

 చెక్‌డ్యాం మరమ్మతులు చేపడితేనే..

 చెరువుకు సమీపంలోని వాగుకు అడ్డంగా కట్టిన చెక్‌డ్యాం నీటిని కాలువతో కొన్నేళ్ల కిందట అనుసంధానం చేశారు. అప్పట్లో వేసవిలోనూ చెరువులో జలకళ ఉండేది. గతంలో కొంతమంది రైతులు యాసంగి సీజన్‌లో పంటలు పండించుకున్నారు. చెక్‌డ్యాం, కాలువకు మరమ్మతులు చేపడితే వేసవిలోనూ చెరువుకు జలకళ రానుంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని