logo

అనర్హత తొలగి.. ఆశలు మిగిలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటును ఎదుర్కొంటున్న అభ్యర్థులకు అదృష్టం కలిసొచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు నిర్ణీత సమయం కన్నా కాస్త ఆలస్యం కానుండటంతో వారిపై ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ముగిసిపోనుంది.

Updated : 15 Apr 2024 06:37 IST

 స్థానిక ఎన్నికల్లో వేటుపడిన అభ్యర్థుల పోటీకి మార్గం సుగమం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటును ఎదుర్కొంటున్న అభ్యర్థులకు అదృష్టం కలిసొచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు నిర్ణీత సమయం కన్నా కాస్త ఆలస్యం కానుండటంతో వారిపై ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ముగిసిపోనుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వేటు పడిన అభ్యర్థులకు ఒకింత మేలు చేశాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గత ఫిబ్రవరి 1వ తేదీన ముగిసింది. లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి ప్రత్యేక అధికారుల పాలనను అమలు చేస్తోంది. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జులై 3న, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జులై 4వ తేదీన ముగియనుంది. పాలకవర్గాల గడువు ముగియడానికి ముందే ఎన్నికలు జరిగితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పోటీకి దూరమయ్యేవారు.  

5,867 మంది అభ్యర్థులపై చర్యలు

నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం 2019లో జనవరిలో మూడు విడతలుగా పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించారు. ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల్లోగా తమ ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో నిర్దేశిత నమూనాలో ఆయా ఎంపీడీఓలకు లెక్కలు సమర్పించాలి. గెలిచిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను వెల్లడించారు. ఓడిపోయిన వారు, ఎన్నికల నిబంధనలపై అవగాహన లేనివారు అధికారులకు ఖర్చుల వివరాలను సమర్పించలేదు. మరికొందరు ఎలాగూ ఓడిపోయామనే నిర్లక్ష్యంతో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారు. ఆయా అభ్యర్థులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన కరవైంది. ఆయా మండలాల ఎంపీడీఓలు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం 2021లో అభ్యర్థులపై అనర్హత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాలో 831 మంది అభ్యర్థులపై, నిర్మల్‌ జిల్లాలో 1,058 మందిపై, కుమురం భీం జిల్లాలో 1,951 మందిపై, మంచిర్యాల జిల్లాలో 2,027 మందిపై, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,867 మందిపై మూడేళ్లపాటు వేటు పడింది.

ముగియనున్న నిషేధ కాలపరిమితి

వేటు పడిన అభ్యర్థులు ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనరాదు. మండలాల వారీగా గత డిసెంబరు నుంచి రానున్న మే నెలాఖరు వరకు ఆయా అభ్యర్థులపై నిషేధం ఉంది. ఆ గడువు ముగిస్తే గానీ వారు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. షెడ్యూల్‌ ప్రకారం సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలకు ప్రకటన జారీ అయినట్లయితే చాలా మందికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయేది. లోక్‌సభ ఎన్నికల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వేటు పడిన అభ్యర్థులకు కలిసొచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల ప్రక్రియకు అడుగులు ముందుకు పడతాయి. అప్పటిదాకా వేటుపడిన వారందరిపై నిషేధం తొలగిపోయి మరోసారి ఎన్నికల్లో పోటీపడే అవకాశం దక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని