logo

గోతులు తీస్తూ.. కుప్పలు పోస్తూ

నదుల్లో నీటిమట్టం తగ్గడంతో ఇసుకాసురులకు అవకాశాలేర్పడ్డాయి. గోదావరి ఒడ్డునే పెద్దఎత్తున తవ్వకాలు చేసి రాత్రి వేళల్లో మొరాన్ని తరలిస్తూ నది మధ్యలో దారిని ఏర్పాటు చేస్తున్నారు.

Published : 15 Apr 2024 04:25 IST

 ఇసుక కోసం అక్రమంగా దారి నిర్మాణం.. పట్టించుకోని అధికారులు

మొరం నిల్వలు

ఈనాడు, ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే, కోటపల్లి : నదుల్లో నీటిమట్టం తగ్గడంతో ఇసుకాసురులకు అవకాశాలేర్పడ్డాయి. గోదావరి ఒడ్డునే పెద్దఎత్తున తవ్వకాలు చేసి రాత్రి వేళల్లో మొరాన్ని తరలిస్తూ నది మధ్యలో దారిని ఏర్పాటు చేస్తున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ దందా పట్ల అధికారులు ‘మామూలు’గానే వ్యవహరిస్తున్నారు. గ్రామం పక్కనే భారీ స్థాయిలో రాత్రి వేళల్లో మొరం తవ్వకాలు జరుగుతున్నా, నదీ ప్రవాహాన్ని మళ్లించి, పైపులు వేసి గోదావరిలో రోడ్డు వేస్తున్నా.. నీటి పారుదలశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అక్రమ తవ్వకాలతో నదిలో భారీ స్థాయిలో గుంతలు పడగా, అందులో నీరు ఉండటంతో పశువులు, మనుషులకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

గోదావరి తీరంలో ఇసుక రీచ్‌లను టీఎస్‌ఎండీసీ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఇసుకను తెచ్చి డంప్‌ చేస్తున్నారు. వారం, పది రోజుల్లో నిర్వహించే టెండర్‌ అనంతరం ఇసుక రీచ్‌లు ప్రారంభం కానున్నాయి. మంచిర్యాల జిల్లాలోని కొల్లూర్‌, ఎర్రాయిపేట్ గ్రామ సమీపంలో గోదావరి నది ప్రవహిస్తుండగా, అవతలి వైపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన రీచ్‌లు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎర్రాయిపేట్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఇష్టానుసారంగా జేసీబీలతో తవ్వుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇప్పటికే కిలోమీటరు వరకు నదిలోనే మొరం రోడ్డును ఏర్పాటు చేసినా, మైనింగ్‌ అధికారులు కిమ్మనడం లేదు. కొన్నిచోట్ల నీటిని మళ్లించడానికి ఏకంగా పైపులు సైతం వేయడం గమనార్హం.

గోదావరి నదిలో వేసిన రహదారి

కుంట్లం రీచ్‌ నుంచి..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కుంట్లం ప్రాంతం నుంచి ఇసుకను తెచ్చి డంప్‌ చేయడానికి మొరం రోడ్డు వేశారు. కిలోమీటరు పైగా గోదావరిలో ప్రయాణిస్తే ఇటు మంచిర్యాల జిల్లాలోని ఎర్రాయిపేట్, కొల్లూర్‌ క్వారీలకు చేరుకోవచ్చు. భూపాలపల్లి జిల్లాలో దూర భారం తగ్గించుకోవడానికే నదిలో రోడ్డు వేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందనే ప్రచారం ఉంది. భారీ ప్రొక్లెయిన్లతో రాత్రివేళల్లో మట్టిని తీస్తూ తవ్వకాలు చేస్తుండటంపై ఎర్రాయిపేట్, కొల్లూర్‌ గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్వారీల్లో నీళ్లు నిండి అనేక మూగజీవాలు మృత్యువాతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత దూరం రోడ్డును వేయడానికి భారీ స్థాయిలో మొరంను తవ్వి డంప్‌ చేసి ఉంచుకున్నారు.

రోడ్డు పేరుతో వసూళ్లు?

ఇసుక రీచ్‌లు ప్రారంభమయ్యాక గుత్తేదారులు ప్రతి లారీ చోదకుడి నుంచి రూ.300-500 వరకు బలవంతంగా వసూలు చేస్తారు.  అనుమతులు లేకుండా మొరం రోడ్డు వేయడమే కాకుండా, రహదారి సౌకర్యం కల్పించామని చెబుతూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మరోవైపు జేసీబీ అదనపు బకెట్ల పేరుతో రూ.3000-5000 వరకు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభమయ్యే ఇసుక రీచ్‌లో గుత్తేదారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని