logo

వీరి ఆపద.. వారికి సంపద

జిల్లాలో అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. భూకబ్జాలు, ఆర్థిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింగరేణి ప్రాంతంలో నేరాల సంఖ్య పెరుగుతోంది.

Updated : 15 Apr 2024 06:39 IST

 వడ్డీ వ్యాపారుల నివాసాలపై పోలీసుల ఆకస్మిక దాడులు 


ఫైనాన్స్‌ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న సీఐ బన్సీలాల్‌

జిల్లాలో అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. భూకబ్జాలు, ఆర్థిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింగరేణి ప్రాంతంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. డబ్బులతో వ్యాపారం చేసేవారు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యుల ఆపదే వారికి అక్రమ సంపాదన ఏకంగా అయిదు నుంచి పదిశాతం వడ్డీ వసూలు చేస్తూ ఫైనాన్స్‌ వ్యాపారులు ప్రజల నడ్డీ విరుస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లోని సింగరేణి కార్మికులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలే వనరులుగా మలచుకొని దందాలు నిర్వహిస్తున్నారు. కొందరు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తుండగా.. మరికొందరు అనుమతులే లేకుండా ఫైనాన్స్‌ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలో అక్రమంగా సాగుతున్న ఈ దందాపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేసథ్యంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.

మంచిర్యాల నేరవిభాగం, లక్షెట్టిపేట, న్యూస్‌టుడే

లక్షెట్టిపేట పట్టణంలో అనుమతులు లేకుండా ఫైనాన్స్‌లు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారి ఇళ్లపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తిమ్మాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటిలో 31 ఖాళీ ప్రామిసరీనోట్లు, 38 బాండ్‌ పేపర్లు, ఒక కాలి చెక్కును స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో లక్షెట్టిపేటకు చెందిన మరో మహిళ నుంచి రూ.26.65 లక్షల విలువైన 31 ప్రామిసరీ నోట్లు, రెండు చెక్కులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరేందర్‌ తెలిపారు. అనుమతులు లేకుండా అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అనుమతులు లేకుండా వ్యాపారం చేసే వారి వద్దకు వెళ్లవద్దని సూచించారు. దాడుల్లో ఎస్సైలు చంద్రకుమార్‌, స్వరూప్‌రాజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఓ వ్యాపారి ఇంటిలో స్వాధీనం చేసుకున్న బాండ్‌పేపర్లను పరిశీలిస్తున్న పోలీసులు

వివరాలు ఉండవు.. రసీదులు ఇవ్వరు..

అప్పుల కోసం ఫైనాన్స్‌ కార్యాలయాలకు వచ్చిన వారి నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులను తీసుకుంటారు. వీటిపై బాధితుల సంతకాలు తప్ప ఇతర ఏ వివరాలూ ఉండవు. ప్రతి నెలా బాధితులు కట్టిన వడ్డీలకు రసీదులు ఇవ్వరు. రూ. వందకు 5 నుంచి 10 శాతం వడ్డీ వసూలు చేస్తున్న ఫైనాన్స్‌ నిర్వాహకులు.. బాధితుడు డబ్బులు చెల్లించని పక్షంలో ప్రామిసరీ నోటు, చెక్కులపై ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారు.

బ్యాంకుల్లో రుణాల కోసం ఆస్తులను నమ్మకంగా మార్ట్‌గేజ్‌ చేస్తుంటారు. ఇక్కడి ఫైనాన్స్‌ నిర్వాహకులు ఇళ్లు, భూముల పత్రాలను తమ సంస్థతో మార్ట్‌గేజ్‌ చేయించుకుంటున్నారు. అధిక వడ్డీలు చెల్లించని పక్షంలో విలువైన భూములు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు.

నిబంధనలు పాటించకుండా..

జిల్లాలో ఫైనాన్స్‌ అండ్‌ హైర్‌పర్చేస్‌ కార్యాలయాలు ప్రభుత్వ రిజిస్ట్రార్‌ నిబంధనలు పాటించాలి. ఫైనాన్స్‌ పేరుతో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ గుర్తింపు పొందాలి. ఫైనాన్స్‌ పేరిట పాన్‌కార్డు, మనీలెండింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతూ.. ఏటా ఆదాయపన్ను రికార్డులను నమోదు చేయాలి. నిర్వాహకులెవరూ అలా చేయడం లేదు. కొంతమంది అనుమతులు లేకుండానే కార్యాలయాలను తెరుస్తూ అక్రమదందాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రిజిస్ట్రార్‌ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో అక్రమ వ్యాపారాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని