logo

జొన్న కొనుగోళ్లు ఎప్పుడో..?

పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే మంచి దిగుబడులు వస్తాయని భావించి రైతులు యాసంగిలో అధిక విస్తీర్ణంలో జొన్న పంట సాగు చేశారు. మూసధోరణిలో పంటలు పండిస్తే భూసారం దెబ్బతిని దిగుబడులపై ప్రభావం చూపుతుంది.

Updated : 15 Apr 2024 06:37 IST

ఎదురుచూపులతో కాలం వృథా

పెంచికల్‌పాడ్‌లో జొన్న పంటను నూర్పిడి చేస్తున్న హార్వెస్టర్‌

కుంటాల, న్యూస్‌టుడే:  పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే మంచి దిగుబడులు వస్తాయని భావించి రైతులు యాసంగిలో అధిక విస్తీర్ణంలో జొన్న పంట సాగు చేశారు. మూసధోరణిలో పంటలు పండిస్తే భూసారం దెబ్బతిని దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఇదే క్రమంలో మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా జొన్న పంట వేశారు. ప్రసుత్తం కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా ఆశించిన మేర దిగుబడులు వస్తున్నాయి. అయితే మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.  

ఇదీ పరిస్థితి  

జిల్లా వ్యాప్తంగా సుమారు 17 వేల ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. అత్యధికంగా ముథోల్‌ నియోజకవర్గంలోనే వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 30 శాతం మేర కోతలు, నూర్పిడి పనులు పూర్తయ్యాయి. మరో 70 శాతం పంట కోత, నూర్పిడి దశలో ఉంది. ముందుగా నూర్పిడి చేసిన  రైతులు విపణిలో ధరలు లేక ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుందనే ధోరణిలో కల్లాల్లో నిల్వ చేసి ఉంచారు. కానీ అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మహారాష్ట్ర విపణిలో ప్రభుత్వ గిట్టుబాటు ధరల కంటే అధికంగా ఉండటంతో కొంత మంది రైతులు మాత్రమే అక్కడికి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎకరానికి సుమారుగా 20-25 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ వద్ద పంట వివరాలు నమోదు చేసుకోని రైతులు, కౌలు రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతూ నిల్వ చేయాలా వద్దా అనే సంశయంలో ఉన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రభుత్వం సడలింపునిస్తూ రైతులకు అండగా నిలవాలి. గత సంవత్సరం ప్రభుత్వ మద్దతు ధర రూ.2,970 ఉండగా ఈ ఏడాది రూ.3,180కి పెంచారు. ప్రభుత్వ గిట్టుబాటు ధర, మార్కెట్‌ ధరతో పోల్చుకుంటే క్వింటాకు రూ.800-1000 వరకు తేడా వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.  దిగుబడులు వస్తున్న ఈ నేపథ్యంలో ప్రధాన క్లస్టర్లలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు వెసులుబాటు ఉంటుంది. సమయంతోపాటు రవాణా భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు.  


కొనుగోళ్లు ప్రారంభించాలి..:

సబ్బిడి గజేందర్‌, రైతు, కుంటాల

ఎకరన్నర జొన్న పంట సాగు చేశా. పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్‌ ధరలతో లెక్కిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. చాలా మంది రైతులు పంటను నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటులో విక్రయిస్తే ఎకరానికి రూ.20 వేలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. స్థలాభావం వల్ల పంట దిగుబడులను నిల్వ చేయాలన్నా కర్షకులకు ఇబ్బందిగానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని