logo

బడుల్లో కనీస సౌకర్యాలకు ప్రాధాన్యం

జిల్లాలో కనీస మౌలిక వసతులు కరవైన 672 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ బడుల్లో పనులకు తొలి  ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాగునీరు, విద్యుదీకరణ, మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతులు, కొత్తవి నిర్మించడం, ఏకరూప దుస్తుల కుట్టు పనులు వంటి తదితరాలు చేపట్టేలా మార్గనిర్దేశం చేశారు.

Published : 15 Apr 2024 04:37 IST

తాగునీటి ప్రదేశంలో కనిపించని నల్లాలు

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కనీస మౌలిక వసతులు కరవైన 672 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ బడుల్లో పనులకు తొలి  ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాగునీరు, విద్యుదీకరణ, మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతులు, కొత్తవి నిర్మించడం, ఏకరూప దుస్తుల కుట్టు పనులు వంటి తదితరాలు చేపట్టేలా మార్గనిర్దేశం చేశారు. పాఠశాలల్లోని సమస్యలను ఇంజినీరింగ్‌ అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తం రూ.21 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.4 కోట్లు ఉపాధి హామీ పథకం ద్వారా వెచ్చించనున్నారు.

సమన్వయంతో..

పనుల పర్యవేక్షణ పక్కాగా చేపట్టేలా ఉన్నతాధికారులు ఇప్పటికే దశలవారీగా వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జిల్లా పాలనాధికారి నేతృత్వంలో శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించేలా మార్గనిర్దేశం చేశారు. పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా శాఖలకు అప్పగించారు. మొత్తం 19 మండలాల్లో 13 పంచాయతీరాజ్‌, 2 ఆర్‌అండ్‌బీ, 3 టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, ఒక్క చోట పురపాలిక ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. నిధులను త్వరలోనే జిల్లా సమాఖ్యలకు మంజూరు చేయనున్నారు. వాటి ద్వారా మండల సమాఖ్యలకు, అక్కడి నుంచి సంబంధిత అమ్మ ఆదర్శ కమిటీల ఉమ్మడి ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటగా పనుల వ్యయంలో 25 శాతం కలెక్టర్‌ విడుదల చేయనున్నారు. ఈ పనులు జూన్‌ 10 వరకు పూర్తి చేసేలా ప్రణాళిక వేశారు.  


పకడ్బందీగా..:

ఎ.రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్‌

అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించిన పనులు పకడ్బందీగా నిర్వహించేలా ఇప్పటికే ఉన్నతాధికారులు సూచనలు, సలహాలిచ్చారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో ఆమోదం లభించింది. అవసరమైన నిధులు త్వరలోనే జిల్లా సమాఖ్యలకు మంజూరు కానున్నాయి. కనీస మౌలిక వసతులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. విద్యాసంవత్సరం ప్రారంభానికి పూర్తి చేసేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని