logo

స్వర్ణమ్మకు మణిహారాలు.. అడ్డుకట్టలు

నాడు ఆరు నెలల పాటు వెలవెల బోయే వాగు నేడు ఆరుగాలం నీటి నిల్వలతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయం నుంచి గోదావరికి వరకు వయ్యారి వంపులతో పరుగులు పెడుతున్న జల ప్రవాహం చూపరులను ఆకట్టుకుంటోంది.

Updated : 15 Apr 2024 06:35 IST

పచ్చని పంటలు, నీటి నిల్వతో కనువిందు చేస్తున్న ఆలూర్‌ అడ్డుకట్ట

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: నాడు ఆరు నెలల పాటు వెలవెల బోయే వాగు నేడు ఆరుగాలం నీటి నిల్వలతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయం నుంచి గోదావరికి వరకు వయ్యారి వంపులతో పరుగులు పెడుతున్న జల ప్రవాహం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం(అడ్డుకట్ట)లతో భూగర్భ జలాలు సహజంగా పెంపొందుతూ మానవాళి మనుగడకు అండగా నిలుస్తున్నాయి. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ వాగు నిండు వేసవిలోనూ నీటితో కళకళలాడుతోంది. ఈ వాగు సుమారు 38 కిలోమీటర్లు ప్రవహించి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన సోన్‌ వద్ద గోదావరిలో కలుస్తుంది.  

 ఆరుగాలం నీరు

నీటిని ఒడిసి పట్టే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం స్వర్ణ వాగుపై ఎనిమిది అడ్డుకట్టలను నిర్మించింది. సారంగాపూర్‌ మండలంలోని చించోలి(ఎం), యాకర్‌పల్లి, గొడిసెర, బీరవెల్లి, ఆలూర్‌, నిర్మల్‌ మండలంలోని చిట్యాల, తాంషా, సాకెర గ్రామాల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఆలూర్‌, సాకెర వద్ద అడ్డుకట్టతో పాటు సింగిల్‌ లైన్‌ రోడ్డు బ్రిడ్జి (ఎస్‌ఎల్‌ఆర్‌బీ) నిర్మించి స్థానికులకు రవాణా సౌకర్యాన్ని కల్పించారు. 2020 నుంచి 2022 వరకు ఒక్కొక్కటిగా ఇపుడు పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి. అడ్డుకట్టల ఏర్పాటుతో జలాశయం నుంచి గోదావరి వరకు స్వర్ణ వాగు ఏడాదిపాటు నీటితో నిండే ఉంటుంది. విహంగ వీక్షణం ద్వారా చూస్తే భువిపై పరిచిన నీలిరంగు చీరపై అడ్డుకట్టలు మణిహారాల్లా కనిపిస్తుంటాయి.

పరీవాహకం పచ్చదనం.. పెరిగిన భూగర్భజలం

వేసవి వచ్చిందంటే అడుగంటిన నీటిని తోడేందుకు రైతులు చెలమలు తవ్వేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ప్రాజెక్టు నుంచి గోదావరి తీరం వరకు స్వర్ణ వాగు ఇరువైపులా పరీవాహక ప్రాంతం పచ్చని పంటలతో కనువిందు చేస్తోంది. నిరంతరం వాగులో నీరు నిల్వ ఉండడంతో సమీప రైతులు విద్యుత్తు పంపుసెట్ల ద్వారా నీటిని ఎత్తిపోసి పంటలు పండిస్తున్నారు. జీవాలకు, అడవి జంతువులకు తాగునీరు పుష్కలంగా లభిస్తోంది. వాగు ప్రవహించే గ్రామాల పరిధిలోనూ భూగర్భ జలాలు పెరిగాయి.

మరో నాలుగు మంజూరు

ప్రస్తుతం ఉన్న 8 అడ్డుకట్టలు సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో మరో నాలుగు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పూర్తయి పరిపాలన అనుమతులు కూడా వచ్చాయి. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అక్కడక్కడ కొంత నీటి నిల్వలు లేకుండా ఖాళీగా ఉన్న ప్రాంతాలైన సారంగాపూర్‌ మండలంలోని కౌట్ల(బి), బోరిగాం, నిర్మల్‌ మండలంలోని వెంగ్వాపేట్‌, సోన్‌ మండలంలోని జాఫ్రాపూర్‌ గ్రామాల వద్ద నూతన అడ్డుకట్టలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే మరో 12 ఎంసీఎఫ్‌టీల నీరు వాగులో అదనంగా నిల్వ ఉండే అవకాశం ఉండనుంది. దీంతో అడ్డుకట్టల ద్వారా మొత్తం 37 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని