logo

ఆత్మరక్షణ విద్య నేర్చుకుందాం

ప్రస్తుత సమాజంలో ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా ఎక్కడకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఆమ్లదాడులు, హత్యాచారాలు, కిడ్నాపులు ఇలా ఏదో ఒకటి నిత్యం వార్తల్లో పతాక శీర్షికల్లో నిలుస్తూనే ఉంటున్నాయి.

Updated : 15 Apr 2024 06:41 IST

 దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లే అందరికీ ప్రేరణ\

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం :  ప్రస్తుత సమాజంలో ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా ఎక్కడకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఆమ్లదాడులు, హత్యాచారాలు, కిడ్నాపులు ఇలా ఏదో ఒకటి నిత్యం వార్తల్లో పతాక శీర్షికల్లో నిలుస్తూనే ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మార్షల్‌ ఆర్ట్స్‌ వారికెంతో ఉపయోగపడుతుంది. అన్ని విద్యాలయాల్లోనూ శిక్షణ తరగతులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇటీవల ఆత్మరక్షణ విద్యలో ప్రావీణ్యం ఉన్న తల్లీకూతుళ్లు ఇద్దరు దొంగలను ధైర్యంగా ఎదిరించి పోరాడి అందరికీ ప్రేరణగా నిలిచారు. కొంతమంది గృహిణులు సైతం ముందుకొచ్చి ఈ విద్యను నేర్చుకుంటున్నారు, తమ పిల్లలను నేర్పిస్తున్నారు.  

‘బాలికలకు ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరం. విద్యార్థి దశలోనే వ్యాయామం ఆత్మరక్షణ విద్యలో సాధన చేయాలి.’

  - సినీ నటుడు, కరాటే మాస్టర్‌ సుమన్‌


పాఠశాలల్లో..

పాఠశాలలో చదువుతున్న బాలికలు ధైర్యంగా ఉండాలని, ఆపత్కాలంలో భయపడకుండా ఆకతాయిలను ఎదిరించాలని ప్రభుత్వం భావించింది. అందుకు రాణిలక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్‌ పేరిట పథకాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రవేశపెట్టింది. ఆయా మార్షల్‌ ఆర్ట్స్‌ విద్యలో నిష్ణాతులైన మాస్టర్లను ఎంపిక చేసి పాఠశాలలో ఆత్మరక్షణ విద్య తరగతులను నిర్వహిస్తోంది.

స్ఫూర్తిగా తీసుకుందాం

ఇటీవల హైదరాబాద్‌లోని బేగంపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని రసూల్‌పురా జైన్‌కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు దొంగలు చోరీకి యత్నించారు. వారివద్ద నాటు తుపాకులు, కత్తులు ఉన్నాయి. దోపిడీకి ప్రయత్నిస్తున్న ఇద్దరు దొంగలను తల్లీకూతుళ్లు అమిత(46), వైభవి(19) ధైర్యంగా పోరాడారు. వారిని ప్రతిఘటించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లీకూతుళ్లను పోలీసులు అభినందించడమే కాకుండా ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని సూచించారు.

ఎంతో అవసరమని..

ఆమెకు ముగ్గురు పిల్లలు. మహిళలకు ఆత్మరక్షణ ఎంతో అవసరమని భర్తతో తన మనసులోని మాటను పంచుకున్నారు. భర్త ప్రోత్సాహంతో మాస్టర్‌ సాయికృష్ణ వద్ద మూడేళ్లుగా వుషూ క్రీడల్లో సాధన చేశారు. ఆమె పేరు నరంశెట్టి మాధురి. భర్త పేరు శ్రావణ్‌. బోథ్‌కు చెందిన ఈ దంపతులు హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సెలవుల్లో మాత్రం ఆమె సొంతూరు వచ్చి తప్పనిసరిగా సాధన చేస్తుంటారు. ఇటీవల సౌత్‌జోన్‌ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. క్రీడావిభాగంలో పోలీసు ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమంటున్నారు. ఆత్మరక్షణ విద్యను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని, అందుకే తన ముగ్గురు పిల్లలకు, భర్తకు నేర్పిస్తున్నానని చెబుతున్నారు.

మూడేళ్లుగా సాధన.

ఆదిలాబాద్‌కు చెందిన అకోజివార్‌ శ్రుతికి ఇద్దరు పిల్లలు. భర్త వీరేష్‌. ఆయన తైక్వాండో మాస్టర్‌గా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. శ్రుతి మూడేళ్లుగా భర్త వద్ద రణవిద్య తైక్వాండోను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. వీరి కూతురు సహ కూడా ఈ విద్యలో శిక్షణ పొందుతున్నారు. గతేడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో భాగంగా తల్లీకూతుళ్లు ఇద్దరు ఒకే వేదికపైన తైక్వాండో విన్యాసాన్ని ప్రదర్శించారు. వాటిని వీక్షించిన అప్పటి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ వారిని అభినందించారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఇలాంటి రణవిద్య నేర్చుకోవాలని సూచించారు. ఆపదలో స్వయంగా తమకు తాము రక్షించుకోవడానికి ఈ విద్యను నేర్చుకుంటున్నామని పేర్కొంటున్నారు.

  కుటుంబంతో కలిసి..

ఆమె పేరు కిరణ్‌ భట్‌. భర్త పురుషోత్తం భట్‌. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదిలాబాద్‌కు చెందిన ఈ కుటుంబమంతా మార్షల్‌ ఆర్ట్స్‌ తైక్వాండో విద్యను రెండు నెలల నుంచి నేర్చుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండేసి గంటలు మహావీర్‌ పార్కులో సాధన చేస్తున్నారు. మరో పదిమంది మహిళలను ప్రోత్సహించి ఈ శిక్షణ తరగతుల్లో చేర్పించారు. ఒంటరిగా ఎక్కడికెళ్లినా, ఏ ఊరికెళ్లినా విపత్కర పరిస్థితుల్లో ఎవరో వస్తారని, సహాయం చేస్తారని ఎదురు చూడకుండా తమను తాము రక్షించుకునే ఉద్దేశంతోనే ఈ ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటున్నానని చెబుతున్నారు. రోజూ సాధనతో ఆత్మవిశ్వాసం రెట్టింపైందని, రోజంతా ఉత్సాహంగా ఉంటున్నానంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని