logo

ఉద్యోగులపై ఈసీ కన్ను..

పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే ఓటర్లను కలుస్తున్నారు.

Updated : 15 Apr 2024 06:39 IST

 నియమావళి ఉల్లంఘిస్తే కొలువుకు ఎసరే..

పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే ఓటర్లను కలుస్తున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొలువులకే ఎసరు వస్తుందని గుర్తుంచుకోవాలి. 

న్యూస్‌టుడే, చెన్నూరు


సార్వత్రిక పోరు నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయడం తగదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘా సహా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పోస్టులపై ఓ కన్నేసి ఉంచారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కలిగే ఫలితం కన్నా ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రచారం, వారి వ్యవహారశైలి మాత్రం పెద్ద చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. వీరు ఆయా పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా వ్యవహరించే సన్నివేశాన్ని దృశ్య రూపకంగా లేదా శ్రవణరూపకం (వీడియో, ఆడియో) ద్వారా ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి, యంత్రాంగానికి పంపినా, ప్రచార మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపులలో పోస్టు చేసినా అంతే సంగతులని ఇటీవలి ఉదంతాలు తెలుపుతున్నాయి.

హద్దుమీరితే అంతే సంగతులు

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయరాదనే నిబంధనలు 1949 సెప్టెంబరు 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వివిధ కార్పొరేషన్‌, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే అన్ని స్థాయిలు, కేటగిరీల ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి అధికారి ఉద్యోగి తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి.

ఇటీవలి ఘటనలు..

  •  ఈ నెల 7న సిద్దిపేటలో ఉపాధిహామీ, సెర్ప్‌ విభాగాలకు చెందిన పొరుగు సేవల సిబ్బందితో మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. సమావేశంలో పాల్గొన్న 106 మందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఉపాధిహామీ విభాగానికి చెందిన 68 మంది, సెర్ఫ్‌ పరిధిలో 38 మంది విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు.
  •  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నస్పూరు మున్సిపాలిటీ కృష్ణ కాలనీలోని పల్లె దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్త ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో ఎన్నికల అధికారులు ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  

సామాజిక మాధ్యమాలపై..

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మీడియాలో వచ్చే వార్తలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా మీడియా మానిటరింగ్‌ బృందాన్ని అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో ఏర్పాటు చేశారు. ఉద్యోగులు వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా, ప్రతికూలంగా పోస్టులు పెడితే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. సామాజిక మధ్యమాల ఖాతాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.

తప్పించుకోలేకుండా నిఘా

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీడియో సర్వేలెన్స్‌, స్టాటిస్టికల్‌ సర్వేలెన్స్‌ బృందాల నియామక ప్రక్రియ పూర్తవగా సభ్యులు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన సభలు, సమావేశాలను అధికారులు చిత్రీకరిస్తున్నారు. వీటిని ప్రత్యేకబృందం వీక్షిస్తోంది. ఉద్యోగులు పాల్గొన్నట్లు దృష్టికి వచ్చినా, ఎవరి నుంచైనా ఫిర్యాదువచ్చినా సంజాయిషీ నోటీసు జారీ చేస్తారు. ఉల్లంఘించినట్లు తేలితే సస్పెన్షన్‌ వేటు వేస్తారు.

ఇదీ తప్పే..

  •  ప్రత్యక్షంగాకానీ పరోక్షంగాకానీ ఒక అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారాలు దొరికినా వేటు పడుతుంది.
  •  తనకింది స్థాయి సిబ్బందిని అధికార   దర్పంతో ఒక పార్టీకి సహకరించాలని, ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పకూడదు.
  •  ముఖ్యంగా ప్రచార సభల్లో పాల్గొనడం, తమ కులం నేత అని ప్రచారం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తారు.
  •  ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్‌బుక్‌ లేదా వాట్సప్‌ గ్రూపులలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు నమోదు చేసినా కఠినమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందే..
  •  వారి సొంత ఊళ్లలోనూ కండువా వేసుకుని ప్రచారం చేయడం లేదా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంలాంటివి చేయొద్దు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని