logo

చిన్నారుల్లో ‘నవోదయం’!

దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలో విజయం సాధిస్తే.. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి.

Updated : 15 Apr 2024 06:34 IST

 విద్యాలయ  ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ

జవహర్‌ నవోదయ విద్యాలయం

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలో విజయం సాధిస్తే.. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత వసతితో కూడిన బోధన లభిస్తుంది. పౌష్టికాహారంతో పాటు క్రీడలు, నృత్యాలు, సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులు తర్ఫీదు పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌లోనే జవహర్‌ నవోదయ విద్యాలయం ఉంది. ఇక్కడ 6వ తరగతిలో 80 సీట్లు ఉండగా.. ఉమ్మడి జిల్లా నుంచి 3,656 మంది దరఖాస్తు చేయగా.. ఒక్క సీటుకు దాదాపు 45 మంది పోటీపడ్డారు. జనవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహించగా ఇటీవలే ఫలితాలు వచ్చాయి. ఎలాంటి శిక్షణ లేకుండానే పట్టుదల, దృఢసంకల్పంతో చదివి ప్రతిభ ఆధారంగా పలువురు ఎంపికయ్యారు. విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది.


విద్యాలయ విద్యార్థి సూచనలతో..

 హరిప్రసాద్‌, బోథ్‌, ఆదిలాబాద్‌ జిల్లా

మా బంధువు ఒకరు.. ప్రస్తుతం నవోదయ విద్యాలయంలో 8వ చదువుతున్నాడు. సెలవుల్లో వస్తే కలిసి మెలిసి తిరుగుతాం. ప్రవేశ పరీక్ష సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అతను పలు సూచనలు చేశారు. సీటు సాధించాలనే సంకల్పంతో ప్రతి రోజు ఆరు గంటల పాటు చదివాను. ప్రవేశ పరీక్ష బాగా రాసి సీటు సాధించాను.


అమ్మానాన్నల ఆశయం

కె.సాయిప్రతాప్‌, నర్సాపూర్‌, నిర్మల్‌ జిల్లా

నాన్న మహేందర్‌ కండక్టర్‌, అమ్మ కావ్య గృహిణి. మంచి చదువుతోపాటు ఉన్నతోద్యోగం సాధించాలంటే నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటూ.. అమ్మానాన్నలు అయిదో తరగతి ప్రారంభం నుంచే చెప్పారు. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకున్నా. ప్రవేశ పరీక్ష ప్రకటన జారీ అయిన తర్వాత నిత్యం ఉదయం, సాయంత్రం గణితం, ఆంగ్లం ఎక్కువగా చదివాను. సీటు సంపాదించడంతో అమ్మానాన్నల కలను నేరవేర్చా.


తోటి వారు భయపెట్టినా.. తోటి వారు భయపెట్టినా..

- రిషీక్‌, కుభీర్‌, నిర్మల్‌ జిల్లా

సీటు రావాలంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. శిక్షణ తీసుకోవాలంటూ తోటి విద్యార్థులు భయపెట్టారు. అయినప్పటికీ ఎలాంటి శిక్షణ లేకుండానే నిత్యం ఉదయం, సాయంత్రం నాలుగు గంటల పాటు చదువుకున్నా. సందేహాలుంటే ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకున్నా. సీటు సాధించడం సంతోషంగా ఉంది.


తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..

- అనువికశ్రీ, లోకేశ్వరం, నిర్మల్‌ జిల్లా

నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఉదయం, సాయంత్రం మూడు గంటల చొప్పున నెల రోజుల పాటు గణితం, ఆంగ్లం చదివాను. ఎలాంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాశాను. సీటు రావడంతో చాలా సంతోషంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని