logo

మోగుతున్న ప్రమాద ఘంటికలు

నాలుగేళ్ల కిందటి నీటి కష్టాలు మళ్లీ పునరావృతం కాబోతున్నాయి. నిర్మల్‌ జిల్లాను ఆనుకొని ఉన్న శ్రీరాంసాగర్‌ జలాశయంలోని నీటిమట్టం తగ్గడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి

Updated : 17 Apr 2024 06:53 IST

ఎస్సారెస్పీలో తగ్గిన నీటిమట్టం.. రెండు జిల్లాలకు కష్టం

 న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: నాలుగేళ్ల కిందటి నీటి కష్టాలు మళ్లీ పునరావృతం కాబోతున్నాయి. నిర్మల్‌ జిల్లాను ఆనుకొని ఉన్న శ్రీరాంసాగర్‌ జలాశయంలోని నీటిమట్టం తగ్గడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పలు నివాసిత ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలు కానున్నాయి.

 ప్రతి ఒక్కరికి మిషన్‌ భగీరథ నీరు అందించేందుకు నిర్మల్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ జలాశయం నీటిని వినియోగించేలా పథకం రూపొందించారు. ఇందుకోసం నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం లోకల్‌వెల్మల్‌ గ్రామం గోదావరి నదీ తీరాన ఈ ఇన్‌టేక్‌వెల్‌ నిర్మించారు. ప్రత్యేకంగా నిర్మించిన కెనాల్‌ ద్వారా ఇన్‌టేక్‌వెల్‌కు నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిలావర్‌పూర్‌ మండలం మాటేగావ్‌ వద్ద నీటి శుద్ధి కేంద్రం (ఫిల్టర్‌బెడ్‌-వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) ఏర్పాటు చేశారు. ఇలా శుద్ధికేంద్రం నుంచి గోదావరి నీళ్లు నిర్మల్‌ నియోజకవర్గం, ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలకు సరఫరా చేస్తున్నారు.

10 టీఎంసీల కంటే తగ్గితే బురద నీరు

సాధారణంగా ఎస్సారెస్పీలో నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 11 టీఎంసీలకు నీటి మట్టం తగ్గింది. ఒక వేళ 10 టీఎంసీలకు తగ్గితే బురదనీరు వస్తుంది. ఫలితంగా తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలకు కష్టాలు ఎదురు కానున్నాయి. ప్రస్తుతం 11 టీఎంసీల నీటిలో కొంత రైతులకోసం పంట చేలకు అందిస్తుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతోంది. మూడు కాలువల నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల నీరు చేలకు ఇస్తున్నారు. నీటి మట్టం ఇంకా తగ్గితే మున్ముందు తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లోకల్‌వెల్మల్‌ గ్రామం వద్ద నిర్మించిన ఇన్‌టేక్‌వెల్‌ ఎత్తుప్రాంతంలో ఉన్నందున ప్రాజెక్టులో డెడ్‌స్టోరేజీలో నీటి మట్టం ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

2019లో కటకట..

మిషన్‌ భగీరథ పథకం ప్రారంభమైన ఏడాదికే ఎస్సారెస్పీలో నీటి మట్టం తగ్గడం ఆ సమయంలో ఆందోళనకు దారితీసింది. 2019లో జేసీబీతో పూడిక తీయాల్సి వచ్చింది. డెడ్‌స్టోరేజీ నుంచి నీళ్లను వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా రహదారి నిర్మించారు. మోటార్లతో డెడ్‌స్టోరేజీ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తి ఇన్‌టేక్‌వెల్‌లో పోసి ప్రజల దాహార్తి తీర్చారు. అప్పట్లో రెండు మూడు రోజులకోమారు నీటిని అందించారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమవుతుందనే ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది.


ఉన్నతాధికారులకు నివేదించాం
సురేష్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ

ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేశాం. నీటి కష్టాలు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే మా శాఖ ఉన్నతాధికారులకు, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారులకు నివేదించాం. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని