logo

అడిగేదెవరు.. అడ్డంగా తవ్వేద్దాం..!

ఇసుక తవ్వాలంటే అనుమతి ఉండాలి.. అది కూడా నిబంధనల మేరకే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులకు అవేమీ పట్టవు.

Updated : 15 Apr 2024 04:53 IST

పట్టా భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలు
ఎన్నికల కోడ్‌ ఉన్నా లెక్కచేయని మాఫియా
న్యూస్‌టుడే, తోట్లవల్లూరు

రొయ్యూరు క్వారీలో లోడింగ్‌ చేస్తున్న జేసీబీ

సుక తవ్వాలంటే అనుమతి ఉండాలి.. అది కూడా నిబంధనల మేరకే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులకు అవేమీ పట్టవు. అంగబలం, అర్ధబలంతో రెచ్చిపోతున్నారు. నదిలో రోడ్డేసి... నిబంధనలు తుంగలో తొక్కి కనిపించినంత దూరం ఇష్టమొచ్చినంతలోతులో ఇసుక తవ్వేస్తున్నారు. ఇంత అరాచకం కొనసాగుతున్నా జిల్లా యంత్రాగానికి ఏ మాత్రం కానరావడం లేదు. ఆదివారం తెల్లవారుజామున రొయ్యూరు క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తుండగా బందెల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో రొయ్యూరు క్వారీలో అర్ధరాత్రుళ్లు అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం పట్టించుకోవడం లేదని కోటేశ్వరరావు ఆరోపించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో రొయ్యూరు క్వారీ పరిధిలోని పట్టా భూముల్లో ఒక పొక్లెయిన్‌, మూడు లారీలు ఇసుక లోడింగ్‌ చేస్తుంటే స్థానికులతో కలిసి అడ్డుకున్నామని తెలిపారు. అక్కడికి వెళ్లేసరికే స్థానిక వీఆర్‌వో, పోలీసులు ఉన్నారని తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకుపోతున్నారని అడ్డుకోగా వీఆర్‌వో, పోలీసులు లారీలను తహసీల్దార్‌ కార్యాలాయనికి తరలిస్తామని మమ్మల్ని నమ్మించి లారీలను వదిలి పెట్టారని ఆరోపించారు. అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాల్సిన అధికారులే ఇలా చేస్తే ఈ దందాను ఎవరు అరికడతారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు.

వైకాపా నాయకుల మట్టి దందా

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారం ఉండగానే ఆర్జించాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు హడావుడిగా అర్ధరాత్రి గ్రామాల్లో అక్రమంగా మట్టి తవ్వి అమ్మేసుకుంటున్నారు. కరిమెర్ల, మోటూరు గ్రామాల్లోని వైకాపా నాయకులు దగ్గర్లోని గ్రామాల్లో మట్టిని అనుమతులు లేకుండా తవ్వకాలు చేసి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలించేస్తూ ప్రైవేటు స్థలాల మెరకలకు, ఇతర వ్యాపారాలకు మట్టిని అమ్మేస్తున్నారు. కరిమెర్లలో మట్టిని తవ్వి చౌటపల్లి గ్రామానికి తరలించేస్తున్నారు. రోజూ అర్ధరాత్రి నుంచి తెల్లవారేలోగా ఈ దందా ముగించేస్తున్నారు. 10 రోజులుగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.

మోటూరులో కూడా వారం రోజులుగా ఇద్దరు వైకాపా నాయకులు అక్రమంగా మట్టిని తవ్వి అర్ధరాత్రి పూట టిప్పర్ల ద్వారా తరలించేస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామస్థాయి నాయకుడు ఒకరు, మండల స్థాయి యువనాయకుడు ఒకరు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరిలించేస్తున్నారు. దీనిపై గుడివాడ తహసీల్దారు ఏవీ రామాంజనేయులు మట్లాడుతూ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని