logo

రూ.10 కోట్లకు కుచ్చు టోపీ..!

కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖాతాదార్లకు కుచ్చుటోపీ పెట్టి పరారైనట్లు సమాచారం.

Published : 16 Apr 2024 05:33 IST

చిట్టీలు, వడ్డీల పేరుతో మోసం
ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి నిర్వాకం

హనుమాన్‌జంక్షన్‌: కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖాతాదార్లకు కుచ్చుటోపీ పెట్టి పరారైనట్లు సమాచారం. ఇటీవలే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్న అతడు ఎప్పట్నుంచో జంక్షన్‌లోనే ఉంటూ స్థానికంగా ఉన్న వ్యాపార సముదాయంలో ఓ దుకాణం అద్దెకు తీసుకుని చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బాపులపాడు మండలంతో పాటు, చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను నమ్మించి తన ఖాతాదార్లుగా చేసుకున్న ఇతడు, కొంతకాలం సక్రమంగానే వ్యాపారం నిర్వహించాడు. ఆ తర్వాత చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకపోవడం, ఇదే సమయంలో వడ్డీ ఆశ చూపి అప్పులు తీసుకున్న వారికి అసలు, వడ్డీలు ఇవ్వడం మానేశాడు. గట్టిగా నిలదీసిన వారికి అదిగో, ఇదిగో అంటూ సమాధానం చెబుతూ వచ్చిన సదరు విశ్రాంత ఉపాధ్యాయుడు, పది రోజుల కిందట గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ్నుంచి వెళ్లిపోయాడు. స్థానికంగా ఉన్న ఇంటిని విక్రయించేసి, తన వ్యక్తిగత లావాదేవీలన్నీ చక్కబెట్టుకుని వేరే ప్రాంతానికి పరారైపోయాడు. దాదాపు రూ.10 కోట్లు వరకు ఇతడు చెల్లించాల్సి ఉందని, వందల సంఖ్యలో బాధితులు ఉన్నరని సమాచారం. సోమవారం సాయంత్రం కొంతమంది బాధితులు ఈ వ్యవహారంపై ఏం చేద్దాం అనే విషయంపై చర్చించేందుకు సమావేశమయ్యారు. చివరకు బాధితుల వివరాలన్నీ సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని