logo

కాసిన్ని నీళ్లూ.. ఇవ్వలేరు వీళ్లు!

‘జగన్‌ ఐదేళ్ల పాలనలో.. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో గుక్కెడు తాగునీటి కోసం అల్లాడే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో తాగునీటి కష్టాలు మిన్నంటాయి. వేసవి మొదలులోనే నీటి కష్టాలు తీవ్రం అయ్యాయి.

Published : 16 Apr 2024 05:42 IST

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో తీవ్ర ఎద్దడి
ఈనాడు, డిజిటల్‌ - అమరావతి

‘గతంలో మాకు నీటి సమస్య వస్తే.. మా బస్తీలో చేతి పంపు ఆదుకొనేది. గత ప్రభుత్వాలన్నీ.. చేతిపంపులు వేశాయి. పాడైతే.. వెంటనే బాగు చేసేవాళ్లు. కానీ.. జగన్‌ వచ్చాక చేతి పంపులన్నీ మూలకు చేరాయి. మా బస్తీల్లో ఒక్క బోరూ వేయించలేదు. తాగునీటికే కాదు.. అవసరాలకూ నీళ్లు ఉండటం లేదు. అధికారులు, నాయకులను నీళ్లు అడిగితే.. ట్యాంకరు పంపిస్తామని చెబుతున్నారు. అది వచ్చేదీ లేదు.. నీళ్లు ఇచ్చేదీ లేదు. చివరికి బిందె నీటి కోసం కొట్లాడుకునేలా మా బతుకులను దిగజార్చారు..’

గుడివాడ పంచవటి కాలనీ మహిళల వేదన. ఎమ్మెల్యే కొడాలి నానిని మహిళలు నిలదీస్తే.. ట్యాంకరు పంపిస్తానని జారుకున్నారు.


గన్‌ ఐదేళ్ల పాలనలో.. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో గుక్కెడు తాగునీటి కోసం అల్లాడే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో తాగునీటి కష్టాలు మిన్నంటాయి. వేసవి మొదలులోనే నీటి కష్టాలు తీవ్రం అయ్యాయి. వేసవికి ముందే.. ట్యాంకులు, కుళాయిలు, బోర్లు, చేతిపంపులు బాగు చేయాలి. నగర, పుర పాలికలు, పంచాయతీలను నిధుల లేమి వేధిస్తోంది.

మాటల్లోనే సన్నద్ధత..

వేసవి వేళ గ్రామీణంలో మంచినీటి సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ప్రకటనలు గుప్పించారు. కానీ.. మంచినీటి చెరువులు, వేసవి స్టోరేజ్‌ ట్యాంకుల్లో నీటిని నిల్వ చర్యలు నామమాత్రమే. మెట్ట ప్రాంతాల్లో బోర్‌వెల్స్‌ పాడైనా.. వాటిని పట్టించుకోలేదు.

నేతల నిలదీత..

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎక్కడికి వెళితే.. అక్కడ తాగునీరు గురించే ఏకరవు పెడుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీని తొలి రోజే మంచినీటిపై విజయవాడ గ్రామీణంలో నిలదీశారు. చేతిపంపుల నుంచి ట్యాంకుల వరకూ ఏ సమస్యకూ పరిష్కారం చూపక పోవడంతో.. వైకాపా అభ్యర్థులు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలు నిలదీస్తుంటే.. నీళ్లు నములుతూ జారుకుంటున్నారు.

డబ్బా నీరే దిక్కండి...

ఉమ్మడి జిల్లాలో వెయ్యికి పైగా ప్రైవేటు తాగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి.  ఐదేళ్లలో కుప్పలు తెప్పలుగా వెలిశాయి. 20 లీటర్ల క్యాన్‌.. రూ.20కు అమ్ముతున్నారు. కానీ.. 25 లీటర్ల నీటి శుద్ధికి రూ.5 లోపే ఖర్చవుతోంది. జగన్‌ ప్రభుత్వం మంచినీటిని సరిగా సరఫరా చేయకుండా.. పేద, మధ్యతరగతి జేబులు గుల్ల చేసేలా వ్యాపారులకు కల్పించిన అవకాశమే ఇది.


కిలో మీటరు దూరం నుంచి తాగునీటిని తీసుకెళ్తున్న మహిళలు

కోడూరు మండలం బసవవానిపాలెం పరిసర గ్రామాల్లో తాగునీటికోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. దాహార్తి తీర్చుకోవడానికి కిలోమీటర్ల దూరం ప్రయాణించి నెల రోజులుగా ఇబ్బందులు పడుతూ తాగునీరు తెచ్చుకుంటున్నారు. గ్రామంలోని కుళాయిల నుంచి వచ్చే నీరు పచ్చగా ఉండి, దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఆ నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటరు దూరంలో సముద్రం ఉండడం వలన ఆటు, పోట్లకు సముద్రజలాలు చొచ్చుకు రావడంతో గ్రామంలో చేతి పంపులు వేసినా ఉప్పునీరే వస్తోందని ఆందోళన చెందుతున్నారు. తెదేపా ప్రభుత్వంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, కోడూరు(అవనిగడ్డ)

గ్రామంలో ఎండిపోయిన మంచినీటి చెరువు


 

గుడివాడ పట్టణంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి కాలనీ ఏర్పడి 20 ఏళ్లయినా నేటికీ తాగునీటి సౌకర్యం లేదు. నీళ్ల ట్యాంకరు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ట్యాంకుల ద్వారా అందే నీటిని డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. ఎమ్మెల్యేగా కొడాలి నాని నాలుగుసార్లు గెలిచినా తమ కష్టాలు తీరలేదని కాలనీవాసులు వాపోతున్నారు. ప్రశ్నిస్తే వచ్చే ట్యాంకర్‌ కూడా ఆగిపోతాయని స్థానికులు భయపడుతున్నారు.

గుడివాడలో రెండేళ్లుగా వేసవి కార్యాచరణ పక్కన పడేశారు. నీటి సరఫరా కోసం నిధులు కావాలని గతంలో పురపాలక అధికారులు ప్రణాళిక తయారు చేసి ఎమ్మెల్యే కొడాలి నాని వద్దకు పంపిస్తే దాన్ని మూలన పడేశారు. దీంతో తాగునీటి అవసరాలకనుగుణంగా పెదఎరుకుపాడులోని రెండు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. దీనికి భారీగా మోటార్లు ఏర్పాటు చేసి పంపింగ్‌ విధానం సరిచేయాలి. ఇది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. నిధులు కేటాయించకపోవటంతో ఈ వేసవిలోనూ నీటి ఎద్దడి తప్పేలా లేదు.

హెడ్‌ వాటర్‌ ట్యాంకు వద్ద ఉన్న కుళాయిలో నీరు పట్టుకుంటున్న ప్రజలు

ఘంటసాల మండలం ఎండకుదురు పంచాయతీ జలగలగండి కాలనీలో దివిసీమ ఉప్పెన బాధితులు ఉంటున్నారు. ఇప్పటి వరకు కాలనీవాసులు మంచినీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఎండకుదురు నుంచి మంచినీటి పైపులైన్లు వేసినా.. అవి పాతవికావడంతో లీకులుపడ్డాయి. దీంతో సమీప పొలాల్లో బావులకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.

న్యూస్‌టుడే, గుడివాడ (నెహ్రూచౌక్‌)


ఫిల్టర్లు పనిచేయడం లేదు
- జంగం గీత, నడుపూరు, పెడన మండలం

నడుపూరులో దీర్ఘకాలంగా ఫిల్టర్లు పనిచేయడంలేదు. చెరువు నీటిని నేరుగా కుళాయిలకు వదిలేస్తున్నారు. నీటి కష్టాలను తాళలేక మినరల్‌ వాటర్‌పై ఆధారపడుతున్నాం. మా గ్రామంలో దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి. రక్షిత నీటి పథకం నిర్వహణను పూర్తిగా వదిలేశారు

న్యూస్‌టుడే, పెడన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని