logo

తీరాన నేడు.. ప్రజాగళం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లు బుధవారం పెడన రానున్నారు.

Published : 17 Apr 2024 04:52 IST

తరలిరానున్న తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

పెడన, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లు బుధవారం పెడన రానున్నారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక బస్టాండు సెంటరులో జరగనున్న బహిరంగ సభలో ఈ ఇరువురు అధినేతలు ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెడనలో సభ ముగిసిన తర్వాత మచిలీపట్నం చలరస్తా సెంటరులో జరగనున్న సభలో పాల్గొంటారు.

హెలీప్యాడ్‌ సిద్ధం: స్థానిక మచిలీపట్నం రోడ్డులోని ఫ్లైఓవర్‌కు సమీపంలో రెండు హెలీప్యాడ్‌లను సిద్ధం చేశారు. తెదేపా, జనసేన అధినేతలు వేర్వేరుగా హెలీకాప్టర్లలో పెడనకు చేరుకుంటారు. అక్కడి నుంచి కి.మీ దూరంలో ఉన్న సభాస్థలికి రోడ్డు మార్గంలో వస్తారు. పెడనలో సభ పూర్తయిన తర్వాత రోడ్డు మార్గంలో మచిలీపట్నం వెళ్తారు.

పెడనలో హెలీప్యాడ్‌ పరిశీలిస్తున్న ఎస్పీ

ఎస్పీ పరిశీలన: హెలీప్యాడ్‌, బస్టాండు సెంటరులోని సభాస్థలిని ఎస్పీ నయీమ్‌ అస్మి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. భద్రతకు తీసుకున్న చర్యల గురించి ఇన్‌ఛార్జి డీఎస్పీ రమేష్‌బాబు ఎస్పీకి వివరించారు. మొత్తం 384 మంది బందోబస్తులో పాల్గొంటారని అన్నారు. సభాస్థలి పరిసరాల్లోని భవనాలపై రూఫ్‌ టాప్‌ బందో
బస్తును ఏర్పాటు చేయాలని, భవనాల పైకి ప్రజల్ని అనుమతించవద్దని ఆదేశించారు. పెడన రూరల్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌, ఎస్సై సూర్యశ్రీనివాస్‌, ఇంటిలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచి అధికారులు ఎస్పీ వెంట ఉన్నారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా...

పెడనలో బుధవారం సాయంత్రం ప్రజాగళం సభ జరగనున్న నేపథ్యంలో పట్టణంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. మచిలీపట్నం-గుడివాడ రహదారిని పూర్తిగా మూసేస్తారు. ప్రత్యామ్నాయంగా గుడివాడ, 216 జాతీయ రహదార్లపై వాహనాల రాకపోకలను అనుమతిస్తారు. గుడివాడ రోడ్డు వైజంక్షన్‌, గూడూరు రోడ్డు కొత్తపేట రైల్వేగేట్ల వద్ద వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు  చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని