logo

కుటుంబానికి భారం కావొద్దని యువతి ఆత్మహత్య

‘పెళ్లికి ఇద్దరం అమ్మాయిలం ఉన్నాం.. తమ్ముడి చదువుకు డబ్బు కావాలి. సంపాదన ఇంటికి సరిపోవడం లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబానికి భారం కాకూడదనుకుంటున్నా’నంటూ.. ఓ యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన

Published : 27 May 2022 02:34 IST

బాలానగర్‌, న్యూస్‌టుడే: ‘పెళ్లికి ఇద్దరం అమ్మాయిలం ఉన్నాం.. తమ్ముడి చదువుకు డబ్బు కావాలి. సంపాదన ఇంటికి సరిపోవడం లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబానికి భారం కాకూడదనుకుంటున్నా’నంటూ.. ఓ యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ వహీదుద్దీన్‌ కథనం ప్రకారం..ఆదర్శనగర్‌కు చెందిన కొమరయ్య ఓ ప్రైవేటు కంపెనీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఓ కుమార్తెకి పెళ్లి కాగా మరో ఇద్దరికి చేయాల్సి ఉంది. ఇంటర్‌ వరకు చదివిన మూడో కుమార్తె గీత(22) ఓ కాల్‌సెంటర్‌లో పని చేసి ఇటీవల మానేసింది. తండ్రి, అక్క సంపాదించే డబ్బుతో కుటుంబ పోషణ, తమ్ముడి చదువుకు అయ్యే ఖర్చుల నిర్వహణ గీత చూసుకుంటుంది. వచ్చే డబ్బు సరిపోకపోవడం, తండ్రి మద్యానికి అలవాటు పడడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబానికి తాను భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని.. ‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా. తమ్ముడిని బాగా చదివించండ’ని సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి గది తలుపు కొట్టగా ఎంతకీ తీయకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా లోపల గీత ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని