logo

హెచ్‌వీడీఎస్‌తో నష్టాలకు చెక్‌!

గ్రేటర్‌లోని కొన్ని సర్కిళ్లలో విద్యుత్తు నష్టాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ వ్యవస్థల రీవ్యాంప్‌నకు కేంద్రం ఆర్‌డీఎస్‌ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సాంకేతికతతో నష్టాలకు చెక్‌ పెట్టే అవకాశాలను డిస్కం ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు.

Published : 30 Jun 2022 02:28 IST


 స్తంభానికే ట్రాన్స్‌ఫార్మర్‌, అక్కడే ప్రీపెయిడ్‌ మీటర్లు

గ్రేటర్‌లోని కొన్ని సర్కిళ్లలో విద్యుత్తు నష్టాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ వ్యవస్థల రీవ్యాంప్‌నకు కేంద్రం ఆర్‌డీఎస్‌ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సాంకేతికతతో నష్టాలకు చెక్‌ పెట్టే అవకాశాలను డిస్కం ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. హై వోల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (హెచ్‌వీడీఎస్‌) ట్రాన్స్‌ఫార్మర్లతో విద్యుత్తు చౌర్యాన్ని నివారించవచ్చు అని సూచిస్తున్నారు. కేంద్రంగా కొత్తగా ప్రకటించిన ఆర్‌డీఎస్‌ పథకంలో 2024-25 నాటికి వాణిజ్య, పంపిణీ నష్టాలను 12-15 శాతానికి తగ్గించాలని డిస్కంలకు లక్ష్యాలను నిర్దేశించి అందుకు నిధులను సైతం అందజేస్తుంది. ప్రస్తుతం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఆర్‌డీఎస్‌లో ఇంకా చేరనప్పటికీ... రెండు డిస్కంలు కలిపి రూ.18 వేల కోట్ల ప్రతిపాదలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి పంపాయి. ఆర్‌డీఎస్‌లో ప్రధానమైన వాటిలో నష్టాలను తగ్గించేందుకు ప్రీపెయిడ్‌ మీటర్ల బిగింపు. ఇదొక్కదానితో చెక్‌ పెట్టడం కష్టమని హెచ్‌వీడీఎస్‌తో ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఇంజినీర్లు అంటున్నారు.

ఎలా చేస్తారు?

* విద్యుత్తు చౌర్యం అధికంగా ఉన్న హైదరాబాద్‌ సౌత్‌లోని కొన్ని ఫీడర్లలో మీటర్లు యాథావిధిగా పనిచేస్తున్నాయి. పైకి చూడటానికి అంత బాగానే ఉన్నా ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వెళుతున్న కరెంట్‌కు.. ఇళ్లలోని మీటర్లలోని నమోదవుతున్న రీడింగ్‌కు పొంతన ఉండటం లేదు. కొన్ని ఫీడర్లలో 90 శాతం వరకు లెక్కలోకి రావడం లేదు. సగటున సర్కిల్‌లో 39 శాతం వరకు నష్టాలు ఉన్నాయి.

* ఇళ్లలోనే మీటర్లు ఉండటంతో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి చెక్‌ పెట్టేందుకు గతంలో స్తంభాలకే విద్యుత్తు మీటర్లు బిగించారు. కొందరు సిబ్బంది వినియోగదారులతో చేతులు కలిపి ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

* హెచ్‌వీడీఎస్‌ సైతం ఇదే విధానంలో ఉండనుంది. హెచ్‌వీడీఎస్‌ 25కేవీఏ సామర్థ్యం కల్గిన చిన్న ట్రాన్స్‌ఫార్మర్‌. నిలబెట్టేందుకు గద్దె కూడా అవసరం లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌పైనే బిగిస్తారు. అక్కడి నుంచి 5 ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్లు ఇస్తారు. నష్టాలు ఎక్కువ నమోదువుతున్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి అపార్ట్‌మెంట్లకు కనెన్షన్‌ ఇస్తున్న మాదిరి లోడునుబట్టి 5 ఇళ్లకు కనెన్షన్లు ఇస్తారు. వీరి ప్రీపెయిడ్‌ మీటర్లన్ని ఎవరి ఇళ్లలో వారికి కాకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న స్తంభానికే ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా మీటర్‌ ట్యాంపరింగ్‌కు, సర్వీసు తీగ బైపాస్‌ చేసి కరెంట్‌ వాడుకునే వీలు ఉండదని అంటున్నారు. ప్రీపెయిడ్‌ మీటర్లు కాబట్టి వినియోగదారుడు సైతం మొబైల్‌ నుంచే ఎంత కరెంట్‌ వాడుకుంటున్నామో చూసుకునే వీలుంటుంది. సెట్‌టాప్‌ బాక్స్‌ వచ్చాక కేబుల్‌ టీవీ దొంగతనంగా వాడుకోవడం ఎలా కుదరదో ఇందులోనూ అంతే అని చెబుతున్నారు.

* ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వెళుతున్న కరెంట్‌ ఎంత? అక్కడి 5 మీటర్లలో నమోదైన కరెంట్‌ యూనిట్లు ఎంత అనే వివరాలను ఏ నెలకు ఆనెల బేరీజు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని.. ఒకవేళ తేడా ఉంటే ఇట్టే తెలిసిపోతుందని ఒక ఇంజినీరు సూచించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని