logo

సంపాదన కాదు.. సమయం వెచ్చించండి

చిన్నారుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానసిక ఎడబాటు చోటు చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితులు ప్రారంభంలో ఫర్వాలేదనిపిస్తుండగా, కాలక్రమంలో కొందరిని వేధిస్తున్నాయి.

Updated : 05 Oct 2022 03:30 IST

పెద్దల నుంచి పిల్లలకు కావాల్సిందదే అంటున్న నిపుణులు
బల్దియా ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభం


ప్రచార పత్రాలను విడుదల చేస్తున్న మేయర్‌ విజయలక్ష్మి

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నారుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానసిక ఎడబాటు చోటు చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితులు ప్రారంభంలో ఫర్వాలేదనిపిస్తుండగా, కాలక్రమంలో కొందరిని వేధిస్తున్నాయి. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఈ అంశంపై హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ దృష్టిపెట్టింది. నగరంలోని మానసిక నిపుణులతో చర్చించి.. వారంపాటు ఉచిత మానసిక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పలువురు మానసిక నిపుణులు తమ గతానుభవాలను జీహెచ్‌ఎంసీతో పంచుకున్నారు. ఒత్తిడి అంటే అర్థం తెలియని వయసు వారు.. నేను డిప్రెషన్లో ఉన్నానంటూ తమను సంప్రదిస్తున్నారని, రాజధానిలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యే చిన్నారిలోకం విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిపుణులు ఏం చెప్పారంటే..

పిల్లల మానసిక సమస్యలపై చదువుకున్న తల్లిదండ్రులకూ అవగాహన ఉండట్లేదు. తీరిక లేని జీవితం, సంపాదన, ఏం చేసినా పిల్లల కోసమేగా.. అనే ఆలోచనలతో.. చిన్న వయసు నుంచే పిల్లలను పని మనుషుల వద్దనో, డేకేర్‌ సెంటర్లలోనో చేర్చుతున్నారు. అలాంటి పిల్లల్లో మొండిపట్టు, తక్కువ మాట్లాడేవారు మానసిక సమస్యలకుగురవుతున్నారు.

పిల్లలతో ఆడుకోవడం, సమయం కేటాయించడం వీలుపడక.. చాలా మంది చిన్నారుల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు పెడుతున్నారు. దానివల్ల  నిద్ర పోవట్లేదు. కొన్ని రోజులకు చెప్పినమాట వినకపోవడం, చదవకపోవడం, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి.

పక్కింటి పిల్లలతో, తోటి వయసు వారితో కలవనివ్వట్లేదు. అలాగని.. తల్లిదండ్రులు కూడా ఆడించరు. ఇలాంటి పరిస్థితులు పిల్లలకు ఆరోగ్యకరం కాదు. పిల్లలను స్వేచ్ఛగా, ఆహ్లాదకర వాతావరణంలో పెంచాలి.

మానసిక సమస్యలు ఎదుర్కొనే బాలబాలికల్లో.. మరిన్ని వింతపోకడలు కనిపిస్తున్నాయి. వారికి ఆటలైనా, పాటలైనా ఫోన్లోనే. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరచి ఛాటింగ్‌ చేయడం, గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేయడం వంటివి చేస్తున్నారు. అతి కొద్ది మంది గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. డబ్బు, వాహనాలు, దుస్తులు, ఫోన్లు, ఇతర వస్తువుల కోసం తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.


వారంపాటు అవగాహన కార్యక్రమాలు..

నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ, సండోసి హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ సంస్థలు సంయుక్తంగా మంగళవారం నుంచి 10 తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతోన్న అన్ని వయసుల వారికి భరోసా ఇచ్చే సూచనలతో సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు నిపుణులు ముందుకొచ్చారని, మరింత మందిని ఈ తరహా చైతన్య కార్యక్రమాలతో అనుసంధానం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి వారోత్సవాల ప్రచార పత్రాలను మంగళవారం మేయర్‌ విజయలక్ష్మి ఆమె కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ మానసిక నిపుణుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.ఎ.కరీం, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మానసిక సమస్యలపై అన్ని వయసుల వారు ఉచిత కన్సల్టేషన్‌ కోసం 94404 88571 నంబరులో సంప్రదించవచ్చని కరీం తెలిపారు.

నిపుణుల అంచనా ప్రకారం మానసిక సమస్యలున్న వారిలో..

విపరీత ప్రవర్తన: 25శాతం

అంతర్జాల వ్యసనం: 7.5శాతం

కుంగుబాటు: 10.5

మద్యం, మత్తుకు బానిసలు: 15శాతం

వేర్వేరు ఆందోళనలు: 38శాతం

ఇతరత్రా: 4 శాతం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని