logo

దోపిడీ ముఠాను పట్టిచ్చిన ద్విచక్రవాహనం

చైతన్యపురి పోలీసు స్టేషన్‌ పరిధి స్నేహపురి కాలనీలోని ఆభరణాల దుకాణ చోరీ కేసులో ప్రధాన నిందితులను ఆదివారం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Updated : 05 Dec 2022 13:32 IST

రాచకొండ పోలీసుల అదుపులో నిందితులు

బైకుపై దొంగలు

ఈనాడు, హైదరాబాద్‌, చైతన్యపురి, న్యూస్‌టుడే: చైతన్యపురి పోలీసు స్టేషన్‌ పరిధి స్నేహపురి కాలనీలోని ఆభరణాల దుకాణ చోరీ కేసులో ప్రధాన నిందితులను ఆదివారం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 1న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆభరణాల దుకాణంలోకి చొరబడి తుపాకీతో కాల్పులు జరిపారు. 3.5 కిలోల బంగారం దోచుకొని పారిపోయిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 15 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారాలతో దొంగల ఆచూకీ గుర్తించగలిగారు. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ పరిసరాల్లో గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి చుట్టుపక్కల అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. ఆ రోజు సాయంత్రం నంబరు ప్లేటు తొలగించి సదరు వ్యక్తి అదే వాహనంపై చక్కర్లు కొట్టాడు. ఉదయం సీసీ టీవీ ఫుటేజ్‌లో గమనించిన ద్విచక్రవాహనం నంబరు ప్లేటు ఆధారంతో కూపీ లాగితే అసలు గుట్టు వెలుగుచూసింది. గజ్వేల్‌కు చెందిన వ్యక్తి ఆ వాహనంపై చక్కర్లు కొట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. అతడే సికింద్రాబాద్‌ నగల దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించినట్టు నిర్ధారించారు. అనంతరం దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలతో కలిసి స్నేహపురి కాలనీలోని నగల దుకాణంలో దోపిడీకి తెగించినట్టు అంచనాకు వచ్చారు. వందలాది సీసీ టీవీల ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు.. నిందితులు ఉప్పల్‌ వైపు పారిపోయినట్టు గుర్తించారు. సీసీ కెమెరాల లైవ్‌ట్రాకింగ్‌తో మహారాష్ట్రలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు, మరో ఇద్దరిని సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారులు మాత్రం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని