logo

వ్యాపారికి ధనం.. బల్దియాకు ఇంధనం

కల్తీ నూనె కట్టడికి, అతిగా మరిగించిన నూనెతో ఇంధనం తయారీ చర్యలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. నగరంలో రోజూ వేలాది లీటర్ల నూనె వాడుతుంటారు. కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరిగిస్తూ..

Updated : 09 Dec 2022 13:25 IST

వినియోగదారుడికి ఆరోగ్యం
వాడేసిన నూనె సేకరణకు జీహెచ్‌ఎంసీ చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: కల్తీ నూనె కట్టడికి, అతిగా మరిగించిన నూనెతో ఇంధనం తయారీ చర్యలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. నగరంలో రోజూ వేలాది లీటర్ల నూనె వాడుతుంటారు. కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరిగిస్తూ.. ఆహార పదార్థాలను తయారు చేస్తుంటారు. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. దీన్ని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వృథా నూనె సేకరణను మూడు నెలల క్రితం ప్రారంభించింది. సేకరణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న రూకో(రీపర్పస్‌ యూజ్డ్‌ కుకింగ్‌ ఆయిల్‌) కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

అవగాహన కల్పిస్తూనే..

‘‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన వృథా నూనె సేకరణ ఏజెన్సీలు నగరంలో తక్కువ. మొదట రెôడు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఒకటే పనిచేస్తోంది. మరిన్ని ముందుకొచ్చేలా యత్నిస్తున్నాం. నూనెను అతిగా మరిగించొద్దని.. తద్వారా నూనెలోని టీపీసీ(టోటల్‌ పోలార్‌ కౌంట్‌) 25 శాతానికి మించిపోయి.. హానికరంగా మారుతుందని.. ఆ వంటకాలు తింటే దీర్ఘకాలంలో క్యాన్సర్‌ తదితర వ్యాధులొచ్చే ప్రమాదం ఉందని వివరిస్తూనే.. తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం’’ అని జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ కె.బాలాజీరాజు ‘ఈనాడు’కు తెలిపారు.

ఉభయతారకం

వృథా నూనెను పారేస్తే నీరైనా, నేలైనా కలుషితమవుతుంది. కొన్ని హోటళ్ల నిర్వాహకులు ఇలాంటి తైలాన్ని అక్రమ వ్యాపారులకిస్తుంటాయి. వారు దాన్ని వడపోసి, వేరే నూనెలతో కలిపి మార్కెట్లో అమ్ముతున్నారు. అలా కాకుండా, శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌ చేస్తే ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రయోజనం.

ప్రస్తుతం నూనె సేకరణ ఇలా..

* సేకరిస్తున్న ఏజెన్సీ నంబర్లు 8985557397, 9705149048

* ఏజెన్సీ ఇప్పటివరకు సేకరించింది: 6 వేల లీటర్లు

* ఏం చేస్తారు: ఏపీలోని బయోడీజిల్‌ కేంద్రాలకు తరలించి, జీవ ఇంధనం తయారు చేస్తున్నారు.

వ్యాపారికి, వినియోగదారుడికి  కలిగే ప్రయోజనాలు

* కిలో వాడేసిన నూనెకు: రూ.25(టీపీసీ శాతం ఆధారంగా చెల్లింపు)

* వినియోగదారుల నమ్మకం చూరగొని వ్యాపారం పెరిగే అవకాశం.

* మేలైన, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు లభిస్తాయి.

* దీర్ఘకాల అనారోగ్యాలు, ఇతర సమస్యలు దరిచేరవు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు