logo

Hyderabad: కీలేడీ చెంచు లక్ష్మి.. చోరీల్లో డబుల్‌ సెంచరీ..

ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ‘కీ’లేడీని అంబర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడు కమిషనరేట్లలోని వివిధ ఠాణాల పరిధిలో జరిగిన చోరీల్లో ఇప్పటికే ఆమె డబుల్‌ సెంచరీ పూర్తి చేసింది.

Updated : 16 Dec 2022 13:23 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ‘కీ’లేడీని అంబర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడు కమిషనరేట్లలోని వివిధ ఠాణాల పరిధిలో జరిగిన చోరీల్లో ఇప్పటికే ఆమె డబుల్‌ సెంచరీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో డేటాబేస్‌ కేంద్రంలోని వేలిముద్రలను పోల్చిచూసి.. 24 గంటల్లోనే ఆమెను పట్టుకోగలిగారు. గురువారం అంబర్‌పేట ఠాణాలో డీఐ ప్రభాకర్‌, డీఎస్సై రాంచందర్‌రాజు వివరాలు వెల్లడించారు. ఈ నెల 12, 13 తేదీల్లో అంబర్‌పేట బురుజుగల్లీలోని హనుమాన్‌ ఆలయం తాళాలు పగులగొట్టి వెండి పాదుకలు, పూజా సామగ్రి, మారుతీనగర్‌లోని మరో ఇంట్లో బంగారం, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి.  ఆలయంలో సేకరించిన వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మల్లేపల్లి మాంగార్‌బస్తీకి చెందిన గడ్డం లక్ష్మి అలియాస్‌ చెంచులక్ష్మి(33)ని నిందితురాలిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమె నుంచి 1.6 తులాల బంగారు ఆభరణాలు, 44 తులాల వెండి సామగ్రి, చరవాణులు, తాళాలు పగులగొట్టేందుకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట చోరీకి వెళ్లిన సమయంలో ఇళ్ల తాళాలు పగులగొట్టే ముందు.. వాటికి సమీపంలోని ఇతర గృహాల తలుపుల గడియలనూ పెట్టి దొంగతనాలకు పాల్పడటం చెంచులక్ష్మి ప్రత్యేకత అని పోలీసులు తెలిపారు.

16 ఏళ్ల ప్రాయం నుంచే నేరాల బాట..

ఇంట్లోని వారిని పోషించడానికి 16 ఏళ్ల వయసులోనే చెంచులక్ష్మి దొంగతనాల బాట పట్టింది. జైలుకెళ్లి వచ్చినా  ప్రవర్తన మార్చుకోలేదు. తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లగానే.. వంటింట్లో తినడానికి ఏమైనా దొరుకుతాయా అని ఆమె వెతుకుతుందని సమాచారం. నగరంలోని ఓ కారాగారంలో ఉన్నపుడు ఆమె కొంతకాలం అక్కడి జైలు పెట్రోల్‌ బంక్‌లోనూ పనిచేసింది. నగరంలోని లింగంపల్లి, కూకట్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే అధిక శాతం చోరీలకు పాల్పడింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చెంచు లక్ష్మితోపాటు, పొరుగున ఉండే రేణుక,  పద్మ, సాలమ్మలు కూడా చోరీల్లో పాలుపంచుకునేవారు. అనంతరం వారితో విభేదాలు తలెత్తడంతో.. కొన్నేళ్లుగా చెంచులక్ష్మి ఒంటరిగానే దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని