logo

Hyderabad: సార్‌.. నన్ను గుర్తుపట్టారా..? నా ప్రాణాలు కాపాడింది మీరే

సాయం చేసిన మనిషిని అవసరం తీరాక మరిచిపోతున్న రోజులివి. కానీ ఓ మహిళ మాత్రం తన ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారిని మరిచిపోలేదు.

Updated : 28 Aug 2023 09:26 IST

ఏసీపీ రవీందర్‌కు దండం పెడుతున్న కవిత

రెజిమెంటల్‌బజార్‌, కార్వాన్‌, న్యూస్‌టుడే: సాయం చేసిన మనిషిని అవసరం తీరాక మరిచిపోతున్న రోజులివి. కానీ ఓ మహిళ మాత్రం తన ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారిని మరిచిపోలేదు. సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఆ అధికారి ఎదురుకాగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు. బస్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలిపింది. ఈ రోజు తాను బతికి ఉన్నానంటే మీరే కారణమంటూ అతనిపై కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న తీరు అక్కడున్న వారి హృదయాన్ని తాకింది. వివరాల్లోకి వెళ్తే..

ఆనాడు..

ప్రస్తుతం మహంకాళి ఏసీపీ రవీందర్‌ 2014లో టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో కార్వాన్‌కు చెందిన కవితకు కడుపులో గడ్డలు ఏర్పడి నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. ఆదుకునే వారులేక నరకయాతన అనుభవించారు. విషయం తెలుసుకున్న రవీందర్‌ ఆమెను ఆసుపత్రిలో చేర్పించి తన సొంత ఖర్చులతో ఆపరేషన్‌ చేయించారు. తరువాత అతడు అక్కడి నుంచి బదిలీ కావడంతో విషయం మరిచిపోయారు. ఇది జరిగి తొమ్మిదేళ్లు గడిచింది.


ఈరోజు

రవీందర్‌ నుంచి సాయం పొందిన కవిత మాత్రం అతడ్ని మరిచిపోలేదు. తన సెల్‌ఫోన్‌లో ఫొటో పెట్టుకొని గుర్తు చేసుకుంటూనే ఉంది. ఆయనకు రాఖీ కట్టాలని ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు సైతం చేసింది.


  • ఆదివారం కవిత పని నిమిత్తం సికింద్రాబాద్‌కు బస్సులో వెళ్తుండగా.. ఆర్పీ రోడ్డులో దర్గా వద్ద ప్రస్తుతం ఏసీపీగా విధుల్లో ఉన్న రవీందర్‌ను చూసి గుర్తు పట్టింది. బస్సు కొంతదూరం వెళ్లాక సిగ్నల్‌ వద్ద ఆగాక దిగేసింది. ఆయన వెళ్లిపోతారేమోననే ఆందోళనతో పరుగులు పెట్టింది. రవీందర్‌ వద్దకు చేరుకొని దండం పెట్టింది. ఆయన మాత్రం గుర్తు పట్టలేదు. ఎవరమ్మా మీరు అని అడగడంతో తనను తాను పరిచయం చేసుకుంది. ఆనందంతో కన్నీళ్లు కార్చింది. ‘సార్‌.. మీకు వెండి రాఖీ తీసుకొచ్చి కడతాను. ఫోన్‌ నంబరు ఇవ్వండి’ అంటూ అడిగి తీసుకొని వెళ్లిపోయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని