logo

Telangana Elections: పార్టీలు మారినా పట్టు నిలుపుకొన్నారు!

అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది ఎంతోమంది రాజకీయల నాయకుల కల. ఇందుకోసం కొందరు దశాబ్దాలుగా అలుపెరగకుండా ఎన్నికల్లో తలపడుతుంటారు. వీరిలో చాలామందికి అసెంబ్లీలో అడుగు పెట్టడం అందని ద్రాక్షగానే మిగిలింది.

Updated : 25 Oct 2023 11:15 IST

నాలుగైదుసార్లు గెలిచి..
మరోసారి బరిలో పలువురు అభ్యర్థులు
హ్యాట్రిక్‌, డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం మరికొందరు..
ఈనాడు, హైదరాబాద్‌

అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది ఎంతోమంది రాజకీయల నాయకుల కల. ఇందుకోసం కొందరు దశాబ్దాలుగా అలుపెరగకుండా ఎన్నికల్లో తలపడుతుంటారు. వీరిలో చాలామందికి అసెంబ్లీలో అడుగు పెట్టడం అందని ద్రాక్షగానే మిగిలింది. మరికొందరేమో నాలుగైదుసార్లు గెలిచి నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకొన్నవారూ ఉన్నారు. వీరిలో కొందరు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో ప్రతి ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పును ఇస్తున్నారు. పాతబస్తీ మినహా ఒక్కోసారి ఒక్కో పార్టీకి పట్టం కడుతున్నారు. ప్రతికూల రాజకీయ పరిస్థితులకు ఎదురొడ్డి.. ప్రజల నాడిని పసిగట్టి... నియోజకవర్గంలో ఓటర్ల మనసు గెల్చుకొని ఎక్కువసార్లు గెలుస్తున్న అభ్యర్థులు కొందరే ఉంటున్నారు. వీరిలో ఎక్కువగా పార్టీలు మారిన వారే ఉండటం గమనార్హం. అంతేకాదు పునర్విభజనలో నియోజకవర్గాలూ మారారు. 


తలసాని శీనన్న ఆరోసారి

సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ఆరోసారి గెలుపు కోసం భారాస తరుఫున బరిలో ఉన్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలెట్టారు. ఇప్పటివరకు ఆయన ఐదుసార్లు శాసనసభకు వేర్వేరు పార్టీల తరుఫున ఎన్నికయ్యారు. 1986లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1994లో సికింద్రాబాద్‌ నుంచి తెదేపా నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో రెండోసారి గెలుపొంది మంత్రి అయ్యారు. 2004లో పరాజయం ఎదురైనా.. 2008 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. మళ్లీ 2009లో ఓడిపోయారు. 2014లో సనత్‌నగర్‌ నుంచి తెదేపా తరుఫున గెలుపొందారు. అనంతరం భారాసలో చేరి మంత్రి అయ్యారు. 2018లోనూ గెలిచిన ఆయన మరోసారి విజయం కోసం  శ్రమిస్తున్నారు.


దానం కూడా అదేదారిలో..

ఆరోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ నుంచి భారాస తరుఫున బరిలో ఉన్నారు. 2018 ఎన్నికలకు ముందు భారాసలో చేరి టికెట్‌ దక్కించుకుని విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయన ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌, తెదేపా పార్టీల నుంచి 1994, 1999, 2004లో శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2009, 2018లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో ఖైరతాబాద్‌లో,  అంతకుముందు ఆసిఫ్‌నగర్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. మరోసారి విజయం కోసం గట్టిగానే తలపడుతున్నారు.


సబితా ఇంద్రారెడ్డి ఐదో సారి..

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటిసారి 2000లో జరిగిన చేవెళ్ల ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున గెలుపొందారు. 2004లోనూ గెలుపొందారు. 2009లో మహేశ్వరం నుంచి విజయం సాధించారు. 2014లో పోటీ చేయలేదు.. 2018లో గెలుపొందాక భారాసలో చేరారు. ఈసారి గెలిస్తే ఐదోసారి అవుతుంది.


మైనంపల్లి నాలుగో పర్యాయం

మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని రామాయంపేట నుంచి 2008 ఉప ఎన్నికల్లో మొదటిసారి తెదేపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మెదక్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో భారాస తరుఫున మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.  


ఓటమి లేకుండా...

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన టి.ప్రకాశ్‌గౌడ్‌.. నాలుగోసారి బరిలో ఉన్నారు.  2009, 2014లో తెదేపా నుంచి విజయం సాధించిన ప్రకాశ్‌గౌడ్‌.. ఆ తర్వాత భారాసలో చేరారు. 2018లో భారాస నుంచి గెలుపొందారు. 2023లోనూ గెలుపు నాదే అంటున్నారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. భారాస తరుపున మరోసారి పోటీ చేస్తున్నారు. 2009లో తెదేపా నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లోనూ అదే పార్టీ నుంచి గెలుపొందారు. అనంతరం తెరాసలో చేరారు. గత శాసనసభ ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి మళ్లీ బరిలో నిలిచారు. 


ఎంఐఎం అరుదైన రికార్డు..

చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ 1999 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి గెలిస్తే  అరుదైన డబుల్‌ హ్యాట్రిక్‌ రికార్డు ఆయన పేరున ఉంటుంది. నగరంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరుఫున ఇన్ని పర్యాయాలు ఇప్పటివరకు ఎవరూ వరుసగా గెలవలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని