logo

కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం.. కీలక విభాగాలకు త్వరలో కొత్త బాసులు!

తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గ్రేటర్‌ పరిపాలనలో కీలకమైన విభాగాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి.

Updated : 05 Dec 2023 09:59 IST

హెచ్‌ఎండీఏ, బల్డియా, జలమండలిలో మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గ్రేటర్‌ పరిపాలనలో కీలకమైన విభాగాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వారంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. నగరాభివృద్ధిలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏలదే ప్రధాన పాత్ర. రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పట్ల ఒక సానుకూలత రావాలంటే రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతుల దగ్గర నుంచి పాలన వ్యవహారాల్లో పారదర్శకత చాలా అవసరం. ముఖ్యంగా నీటి సరఫరా, మురుగు నీటి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్లానింగ్‌ లాంటి అంశాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందే.

హెచ్‌ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌!

ప్లానింగ్‌లో కీలకమైన హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపల్‌శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్కడా ఇక్కడా విధుల నిర్వహణలో సమన్వయం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా కీలకమైన సమీక్ష సమావేశం ఉంటే తప్పా...పూర్తిస్థాయిలో హెచ్‌ఎండీఏపై దృష్టి సారించక పోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఆడిందే ఆటగా సాగుతోంది. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలో వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వేలం ద్వారా విక్రయించారు. మరికొన్ని వేలం వేసే క్రమంలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు జిల్లాల పరిధిలో కొన్ని భూములు ఆక్రమణల పాలవుతున్నాయి. శంషాబాద్‌లో ఇటీవలి ఓ నేత 50 ఎకరాలు హెచ్‌ఎండీఏ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినా..ఆఖరి వరకు అధికారులు గుర్తించలేకపోయారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో చివరిలో అడ్డుకున్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రణాళిక విభాగంలో అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో కొన్నాళ్లుగా హెచ్‌ఎండీఏలో పాలన గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా హెచ్‌ఎండీఏకు నూతన కమిషనర్‌ను నియమించే అవకాశం ఉంది.

పోలిస్‌ శాఖలో..

జలమండలి ఎండీగా దానకిషోర్‌ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లు దాటింది. అవుటర్‌ చుట్టూ ఉన్న గ్రామాలకు తాగునీరు అందించడం.. నగరంలో  మురుగు నీటి శుద్ధి జరిగేలా కొత్తగా 31 మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం...ఇతరత్రా అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. ఇక్కడి నుంచి ఆయన్ను బదిలీ చేసి కీలక విభాగాల్లో సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బల్దియా కమిషనర్‌గా రోనాల్డ్‌ రాస్‌ ఎన్నికల ముందే బాధ్యతలు చేపట్టడంతో ఆయన్నే కొనసాగిస్తారో లేదో కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. మూడు పోలీసు కమిషనరేట్లలో కూడా బదిలీలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎన్నికల సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బదిలీ ఉంటుందని సమాచారం. నగర కమిషనర్‌ సందీప్‌శాండిల్య ఎన్నికల సమయంలో వచ్చారు. రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ కూడా ఏడాది కిందటే వచ్చారు. వీరిరువురిని కొనసాగిస్తారా? లేదా అనేది వేచి చూడాలి. నగర ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌ సుధీర్‌బాబు ఏడాది కిందటే వచ్చారు. ఆయన్ను బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని