logo

Hyderabad Metro: అదనపు కోచ్‌లు ఇప్పట్లో లేనట్లే!

మెట్రో రైళ్లో రద్దీ సమయంలో ప్రయాణికుల పాట్లు ఇప్పట్లో తీరేలా లేవు.

Updated : 13 Feb 2024 08:23 IST

ఐటీ కారిడార్‌ మార్గం మెట్రోలో విపరీతమైన రద్దీ

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైళ్లో రద్దీ సమయంలో ప్రయాణికుల పాట్లు ఇప్పట్లో తీరేలా లేవు. కారిడార్‌-1 ఎల్బీనగర్‌- మియాపూర్‌, కారిడార్‌-3 నాగోల్‌-రాయదుర్గం మార్గంలో ఇప్పుడున్న మెట్రో రైల్‌ కోచ్‌లు రద్దీ వేళల్లో సరిపోవడం లేదు. అమీర్‌పేట, మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్‌ మెట్రోలు నడుపుతున్నా.. ఇవి పరిమితంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు అదనపు కోచ్‌లను లీజుకు తీసుకోవాలని గత ప్రభుత్వం ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోని ఆదేశించింది. నాగ్‌పూర్‌నుంచి 12 కోచ్‌లు తీసుకునేందుకు చర్చలు జరిపారు. తర్వాత ఎందుకనో ఈ ప్రక్రియ ముందడుగు పడలేదు.

మెట్రో రైళ్లో ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. జేబీఎస్‌ నుంచి ఎంబీబీఎస్‌ కారిడార్‌-2లో 35 వేల మంది వరకు ప్రయాణిస్తుంటే.. మిగతా రెండు కారిడార్లలోనే మిగిలిన వారు ప్రయాణిస్తున్నారు. ఉదయం అమీర్‌పేట నుంచి రాయదుర్గం వెళ్లేందుకు రద్దీతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. సాయంత్రం రాయదుర్గం నుంచి నాగోల్‌ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటోంది. రద్దీ వేళల్లో మూడు నాలుగు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నా.. రాయదుర్గంలోనే మెట్రో కోచ్‌లన్నీ నిండిపోతున్నాయి. హైటెక్‌ సిటీలో కష్టంగా ఎక్కగలుగుతున్నారు. దుర్గంచెరువు స్టేషన్‌లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేక మూడు నాలుగు మెట్రోలను వదిలేస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

వేసవిలో మరింత రద్దీ..

ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కంపెనీలు కోరుతుండటంతో మెట్రోలో రద్దీ పెరిగింది. వేసవిలో చల్లని ప్రయాణం కోసం మరింత మంది మెట్రోని ఆశ్రయిస్తారు. దీంతో ఐదు లక్షలమందికిపైగా దాటి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. అదనపు కోచ్‌లు లేకపోతే రద్దీని తట్టుకోవడం కష్టమే. మెట్రో వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లీజుకు కోచ్‌లు వచ్చే అవకాశం లేదంటున్నారు.

ఉచిత బస్సు ప్రభావం ఎంత?

మెట్రోలో రద్దీ ఉన్నా, గతేడాదితో పోలిస్తే ప్రయాణిస్తున్న వారి సంఖ్య తక్కువే ఉందంటున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం డిసెంబరు 9న ప్రారంభించాక.. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య 4 శాతం తగ్గింది. ఉచిత బస్సుతో తగ్గారా? ఇంకేదైనా కారణమా విశ్లేషించాలని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని