logo

అక్రమార్కులకు అండదండలు

భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌(ఎస్‌వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా..

Published : 19 Apr 2024 03:09 IST

భూవివాదాల్లో కొందరు పోలీసుల తీరు

ఈనాడు - హైదరాబాద్‌: భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌(ఎస్‌వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. హద్దు మీరినవారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు విధిస్తున్నా.. కొందరికి ఇవేవీ తలకెక్కడం లేదు. బాధితులకు అండగా నిలవకుండా, ఆక్రమణదారులకు వంత పాడుతున్నారు. భూముల కబ్జాలపై కొందరు ఫిర్యాదుచేసినా  పట్టించుకోవడం లేదు.  దీంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇవీ ఉదాహరణలు.. ః సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని ఓ ఠాణా పరిధిలో 1996లో ఓ వ్యక్తి 4 ఎకరాలు కొని సేద్యం చేసుకుంటున్నాడు. ఇటీవల ఓ రియల్టర్‌ ఆభూమిలో రెండెకరాలు ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. భూయజమాని ఫిబ్రవరి 10న ఠాణాలో ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదు. కొద్దిరోజుల తర్వాత రియల్టర్‌  భూమి ఆక్రమించాడు. బాధితుడు అదేరోజు ఫిర్యాదు చేయగా..  నువ్వే పరిష్కరించుకోవాలని ఎస్‌ఐ సలహా ఇచ్చాడు. కొన్నిరోజుల పాటు బాధితుడిని వేధించాడు. అతడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.

రాచకొండలో విశ్రాంత ప్రొఫెసర్‌  స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడు. అక్కడి ప్రహరీని కూల్చేశాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదుచేయగా, ఎన్నికలు ఉన్నాయని పట్టించుకోలేదు. ఆక్రమణదారు బోరు వేయడం, ఇతర చర్యలకు దిగగా యజమాని మళ్లీ ఎస్‌ఐని సంప్రదించగా సెటిల్‌ చేసుకోవాలన్నాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ప్రహరీని మళ్లీ నిర్మించాలని, ఎవరైనా అడ్డుకుంటే కేసు నమోదు చేస్తామన్నారు.

పోలీసుల వేధింపులపై రైతుల నిరసన

మదనపల్లి పరిధి పొలంలో నిరసన తెలుపుతున్న రైతులు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసుల వేధింపులకు నిరసనగా రైతులు పొలాల్లో మండుటెండలో ధర్నాకు దిగిన ఘటన శంషాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. రైతుల కథనం ప్రకారం.. మదనపల్లి పాతతండాకు చెందిన వడ్త్యా కిషన్‌కు 3 ఎకరాలు, నెనావత్‌ దేవుజకు 3 ఎకరాలు, పాత్లావత్‌ గోబ్య్రాకు ఎకరా మదనపల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్‌ భూములుగా ఉన్నాయి. ముత్తాతల కాలం నుంచి వారు సాగు చేసుకుంటున్న ఈ పొలాల్ల్లోకి రావొద్దని, రెండు వారాలుగా శంషాబాద్‌ పోలీసులు బెదిరిస్తున్నారు. గురువారం పొలాల్లో ఉన్న రైతులను అదుపులోకి తీసుకోవడానికి వచ్చినట్లు తెలియడంతో తండావాసులు ధర్నాకు దిగారు. పోలీసులు వెనక్కి తగ్గడంతో రైతులు శాంతించారు. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డిని చరవాణిలో సంప్రదించగా అందుబాటులోకి రాలేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని