logo

ఈవీ.. పరుగులేవీ?

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు.

Published : 20 Apr 2024 03:31 IST

విద్యుత్‌ వాహనాల విక్రయం అంతంతే
అత్యధికులు ఆదరిస్తేనే కాలుష్యానికి అడ్డుకట్ట

ఈనాడు, హైదరాబాద్‌: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల్లో ఆటోలు, ట్యాక్సీలతోపాటు గూడ్స్‌ వాహనాలు ఎక్కువ శాతం ఉంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలక్ట్రికల్‌ ద్విచక్ర బైక్‌లు 1,04,080 విక్రయించారు. ఇందులో 80 శాతం గ్రేటర్‌లోనే. మరో 66 వేల బైక్‌లు విక్రయాలపై రాయితీ అందుబాటులో ఉంది. రాష్ట్ర ంలో 8 వేల ఈవీ కార్లకు అనుమతులు జారీచేయగా... ఇప్పటికే అన్నీ విక్రయించారు. అదనంగా అనుమతుల కోసం వాహనదారులు ఎదురుచూస్తున్నారు. ఈ వాహనాలు కొనుగోలు చేసిన వారికి జీవితకాల పన్నుతో పాటు రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ప్రభుత్వం మినహాయిస్తోంది. అవగాహన , ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడం వంటి అంశాలే ప్రధాన కారణం. ప్రధానంగా ఆటోలు, ట్యాక్సీలు, గూడ్స్‌ వాహనాలపై రాయితీలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ పాలసీ అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,45,974 విద్యుత్‌ వాహనాలు విక్రయించగా ఇందులో 80 శాతం గ్రేటర్‌లోనే విక్రయించారు.


ఆటో పర్మిట్లు పెంచినా...

తొలుత గ్రేటర్‌లో వెయ్యి ఈవీ ఆటోలకు రవాణా శాఖ పర్మిట్లు ఇచ్చింది. ఇటీవల ఈ సంఖ్యను 4 వేలకు పెంచింది. వాస్తవానికి పెట్రోల్‌, గ్యాస్‌ ఆటోల ధర, ఇతర ఛార్జీలతో పోలిస్తే తక్కువకే ఈవీ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఆటోల కొనుగోలుకు గ్రేటర్‌లో అనుమతులు లేకపోవడంతో పాత పర్మిట్‌ను బ్లాక్‌లో కొనుక్కోవాలి. ఇందుకు దాదాపు రూ.2 లక్షలవుతోంది. ఆటో కోసం మరో రూ.2 లక్షలపైనే ఖర్చవుతోంది. ఆటో కొన్న తర్వాత ఆ పర్మిట్‌ను కొత్తగా కొన్నవారి పేరిట మార్చుకోవడానికి మరింత ఖర్చవుతుంది. సాధారణ ఆటో ధరలో సగానికే ఎలక్ట్రిక్‌ ఆటో కొనుగోలుకు అవకాశముంది. ఈవీలు పెరుగుతున్న దృష్ట్యా షోరూంలూ గ్రేటర్‌లో విస్తరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని