logo

ఎదగనిద్దాం.. ఎగరనిద్దాం

ఇదీ బాలికల విషయంలో తరచూ అందరూ చెప్పే మాటలు. మరి నిజంగానే వారికి స్వేచ్ఛగా ఎగిరే వాతావరణం ఉందా? అంటే మిశ్రమ సమాధానమే వస్తోంది. ఎందుకంటే సవాళ్లను ఎదుర్కొంటూ దూసుకెళ్లే వారు కొందరైతే, ప్రతికూల పరిస్థితికి వెనకడుగు వేసేవారు మరికొందరు ఉన్నారు. అలా లక్ష్యాన్ని చేరుకుంటున్న వారు చరిత్రలో స్థానం సంపాదించుకొంటున్నారు. ఈ సంఖ్య మన దగ్గర పరిమితంగా ఉండటానికి సామాజిక రుగ్మతలే కారణమన్నది ఎవరూ కాదనలేని సత్యం. వీటిని పారదోలి బాలికల్లో స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ఇందుకు మూలంగా తీసుకున్నారు.

Published : 24 Jan 2022 04:08 IST

నేడు జాతీయ బాలికా దినోత్సవం ●

‘ఆకాశమే వారికి హద్ధు. ఆ దిశగా ఎగరనిద్దాం’

న్యూస్‌టుడే, ఇందూర్‌ ఫీచర్స్‌

ఇదీ బాలికల విషయంలో తరచూ అందరూ చెప్పే మాటలు. మరి నిజంగానే వారికి స్వేచ్ఛగా ఎగిరే వాతావరణం ఉందా? అంటే మిశ్రమ సమాధానమే వస్తోంది. ఎందుకంటే సవాళ్లను ఎదుర్కొంటూ దూసుకెళ్లే వారు కొందరైతే, ప్రతికూల పరిస్థితికి వెనకడుగు వేసేవారు మరికొందరు ఉన్నారు. అలా లక్ష్యాన్ని చేరుకుంటున్న వారు చరిత్రలో స్థానం సంపాదించుకొంటున్నారు. ఈ సంఖ్య మన దగ్గర పరిమితంగా ఉండటానికి సామాజిక రుగ్మతలే కారణమన్నది ఎవరూ కాదనలేని సత్యం. వీటిని పారదోలి బాలికల్లో స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ఇందుకు మూలంగా తీసుకున్నారు. బాలికల సాధికారత కోసం అనువైన మార్గాలు ఏర్పాటు చేయడం అందరి బాధ్యత. ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఆకాశాన్ని అందుకోవడానికి నిచ్చెనలాంటి నాలుగు విభాగాల్లో అవకాశాలను కల్పిద్దాం.

ఆవిష్కర్తలుగా మార్చాలి

అమ్మాయిలకు చదువులెందుకనే ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ఫలితంగా వారు బయటికిరాగలుగుతున్నారు. ఆవిష్కర్తలుగా మార్చగల వనరులను ప్రభుత్వాలు కల్పించాయి. వినియోగంపైనే కొంత వెనుకబాటు ఉంది. లింగ వివక్ష వంటి సామాజిక రుగ్మతలు అందుకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో బాలికలు, ప్రైవేటులో బాలుర సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ విద్యార్థినులు ఉన్నత చదువుల్లో రాణించలేకపోతున్నారు. ఈ విధానం మారి వారిని ప్రోత్సహిస్తే అవకాశాలు అందిపుచ్చుకొంటారు. అబ్బాయిలకు దీటుగా నిలుస్తారనేందుకు ఏటా విడుదలయ్యే వార్షిక ఫలితాలే నిదర్శనం.

అన్ని రకాల విద్యాలయాల్లో చదువుతున్న బాలికలు (6- 10 వరకు) : 46,735

నేరరహిత సమాజం ఇవ్వాలి

అమ్మాయిలకు రక్షణ లేదనే అపవాదు నెలకొనడానికి నిత్యం చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలను నిరంతరం కనిపెట్టుకోవాల్సి వస్తుందనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది. వారు నిరంతరం భద్రమైన వలయంలో ఉన్నామనే భరోసా కల్పించాలి. షీ టీం ఏర్పాటు, పోక్సో చట్టాలు అమలు చేస్తున్నా.. అవి నేరం జరిగిన తర్వాత విధించే శిక్షలకేనని గుర్తించాలి. అసలు నేరం జరగకుండా నిలువరించే సమాజాన్ని ఆవిష్కరిద్దాం.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు

15-19 ఏళ్లలోనే తల్లులైన వారి శాతం: 1.1

బాలల్లో స్త్రీ, పురుష నిష్పత్తి: 870 (1000 మందికి)

15-19 ఏళ్లలో రక్తహీనత శాతం: 65.5

మహిళలపై అత్యాచారాలు

2020 : 22

2021 : 25

పోక్సో కేసులు : 8

ఈవ్‌టీజింగ్‌ : 12


ఆర్థిక తోడ్పాటు అవసరం

బతుకుదెరువు కోసం ఏదో జీవనోపాధితో సరిపెట్టకుండా.. స్వయంసమృద్ధిగా ఎదిగేలా చూడాలి. ఇతరులకూ ఉపాధి చూపేలా ఆర్థిక స్వావలంబన కల్పించాలి. ఆర్థిక స్వేచ్ఛ, అవకాశాలు, ఆలోచనలకు విలువ దక్కినప్పుడే ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వీలుంటుంది. అందుకు అనువైన మార్గాల్లో ప్రోత్సహించాలి.


ఆరోగ్యం ముఖ్యం

ఇప్పటికే బాల భారతం పోషకలేమితో కుదేలవుతోందని చాటుతున్న సర్వేల్లో బాలికల పరిస్థితే దయనీయంగా ఉందని చెబుతోంది. దాదాపుగా 50-60 శాతం మంది రక్తహీనతతోనే బాధపడుతున్నారు. ఈ సమస్య వారి శారీరక, మానసిక ఎదుగుదలకు నిరోధకంగా మారుతుంటే... చదువుల్లోనూ వెనకబడిపోయి పోటీని ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. ఈ పరిస్థితి తొలగాలంటే పోషకాహారం అందించాలి.


వీరు కాదా ఆదర్శం..

మలావత్‌ పూర్ణ: గురుకుల పాఠశాలలో చదువుకునే సమయంలో యాజమాన్యం ఆమెను పర్వతారోహణకు ఎంపిక చేసింది. చిన్నవయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఘనత సొంతం చేసుకున్నారు.

యెండల సౌందర్య: హాకీపై ఆమెకు ఉన్న ఆసక్తిని గుర్తించి తల్లిదండ్రులు, గురువులు తర్ఫీదునివ్వడంతో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందారు.

నిఖత్‌ జరీన్‌: అంతర్జాతీయ వేదికలపై పంచులు కురిపిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న ఆమె ప్రతిభను తల్లిదండ్రులు, గురువులు బాల్యంలోనే గుర్తించారు. ఏ స్థాయి పోటీలకు ఎలా తలపడాలో శిక్షణ ఇప్పించారు.

సౌమ్య: ఫుట్‌బాల్‌లో సత్తాచాటడంతో అందరిని ఆకర్షించారు. తాజాగా అంతర్జాతీయ పోటీల్లో బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సుప్రియ: హైదరాబాద్‌లో మెట్రో రైలును నడుపుతున్నారు. ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని