Mansoor Ali khan: మన్సూర్‌పై న్యాయస్థానం ఆగ్రహం

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ప్రవర్తనను మద్రాసు హైకోర్టు తప్పుబట్టింది. 

Published : 12 Dec 2023 02:27 IST

చెన్నై: నటి త్రిష (Trisha)పై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali khan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్రిష, చిరంజీవి, ఖుష్బూ కారణంగా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ వారిపై మద్రాస్‌ హైకోర్టులో మన్సూర్‌ ఇటీవల పరువునష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసు విచారణలో మన్సూర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మన్సూర్‌ ప్రవర్తనను న్యాయస్థానం తప్పుబట్టింది. నిజానికి ఈ కేసు మన్సూర్‌పై త్రిష నమోదు చేయాలని తెలిపింది.

పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా నటిపై మన్సూర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి.. పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలో తనకు తెలుసనడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. తరచూ వివాదాల్లో నిలుస్తూ.. తనని తాను అమాయకుడినని చెప్పుకోవడం సరికాదన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు మన్సూర్‌ వ్యాఖ్యలకు సంబంధించిన అన్‌కట్‌ వీడియోను త్వరలోనే న్యాయస్థానానికి అందజేస్తానని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే, త్రిష, ఖుష్బూ, చిరంజీవి కూడా తమ వాదనలు వినిపించాలని న్యాయమూర్తి తెలిపారు.  ఈ మేరకు విచారణను డిసెంబర్‌ 22కు వాయిదా వేశారు.

Top Searched Movies in 2023: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలివే!

అసలేం జరిగిదంటే: ‘లియో’ సక్సెస్‌ అనంతరం మన్సూర్‌ గత నెలలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నాడు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, ప్రముఖ హీరో చిరంజీవి, ఖుష్బూ నితిన్‌, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని మన్సూర్‌ తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా వాళ్లు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధపెట్టాయన్నారు. దాదాపు రూ.కోటి డిమాండ్‌ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని