Prakash Raj: అతడు మార్స్‌, జూపిటర్‌ వరకు వ్యాపారం విస్తరించాడు.. ప్రకాశ్‌రాజ్‌ మరో ట్వీట్‌

‘అతడు మార్స్‌, జూపిటర్‌ వరకు వ్యాపారాన్ని విస్తరించాడు’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 24 Aug 2023 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) కొన్ని రోజుల క్రితం చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘చంద్రయాన్‌-3’ (Chandrayaan 3) ప్రయోగం కీలక దశకు చేరిన సమయంలో... ‘విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి నుంచి పంపుతున్న మొదటి ఫొటో’ అంటూ ఒక వ్యక్తి టీ తయారు చేస్తున్న ఫొటోను జోడించడంతో దుమారం రేగింది. ఇది తమ నాయకుడిని ఉద్దేశించే పోస్టు చేశారని కొందరు, దేశ ప్రగతి, ప్రతిభను సహించలేకేనని మరికొందరు నెటిజన్లు ఆయన తీరును దుయ్యబట్టారు. ఈ ఫొటో కేరళకు చెందిన ప్రజలు అన్ని చోట్లా ఉంటారనే ఒక సరదా సందర్భానికి సంబంధించినదని ప్రకాశ్‌ రాజ్‌ అభిమానులు కొందరు పేర్కొన్నారు. తాజాగా అదే ఫొటోను షేర్‌ చేస్తూ ప్రకాశ్‌ రాజ్‌ కొత్త పోస్ట్‌ పెట్టారు.

చంద్రయాన్‌ సక్సెస్‌.. #రాకేశ్‌రోషన్‌ పేరిట నెట్టింట మీమ్స్‌

‘‘ఇప్పటికీ జోక్‌ అర్థంకాని వారికి, మా మలయాళీ చాయ్‌వాలాకు ఏమైందని అడిగేవారికి... అతడు మీలా కాదు చాలా తెలివైనవాడు. అతడు తన వ్యాపారాన్ని మార్స్‌ (అంగారక గ్రహం), జూపిటర్‌ (బృహస్పతి) వరకు విస్తరించాడు. త్వరలోనే ప్లూటో గ్రహంపైకీ వెళ్తాడు. అతడిని పట్టుకోగలిగితే పట్టుకోండి’ అంటూ నవ్వుల ఎమోజీలు జోడించారు. #justasking హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీనినీ కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. 

‘చంద్రయాన్‌- 3’పై ప్రకాశ్‌ రాజ్‌ పెట్టిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడమే కాదు కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో కొందరు వ్యక్తులు ఆయనపై ఫిర్యాదు చేశారు. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేశారని వారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, ‘చంద్రయాన్‌-3’ ప్రయోగం విజయవంతంకావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మీమ్స్‌ భావోద్వేగానికి గురి చేస్తే, మరికొన్ని నవ్వులు పూయిస్తున్నాయి. ప్రకాశ్‌ రాజ్‌పైనా మీమ్స్‌ అధిక సంఖ్యలో వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని