ఓ ప్రధాని, ఓ ముఖ్యమంత్రి తయారవ్వాలని...

మంచు లక్ష్మి.. ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుమార్తె, నటిగానే చాలామందికి తెలుసు. తనలో ఓ సేవకురాలూ ఉంది. చైతన్య అనే యువకుడితో కలిసి ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అంటూ ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా ఆంగ్ల పాఠాలు, నైపుణ్యాలు అందేలా చేస్తోంది. ఇప్పుడు వెయ్యి మందికి పైగా స్వచ్ఛంద సేవకులూ ఆమెతో కలిసి నడుస్తున్నారు. తనను వసుంధర పలకరిస్తే... బోలెడు విశేషాలను పంచుకుందిలా..!

Updated : 29 May 2022 07:41 IST

మంచు లక్ష్మి.. ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుమార్తె, నటిగానే చాలామందికి తెలుసు. తనలో ఓ సేవకురాలూ ఉంది. చైతన్య అనే యువకుడితో కలిసి ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అంటూ ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా ఆంగ్ల పాఠాలు, నైపుణ్యాలు అందేలా చేస్తోంది. ఇప్పుడు వెయ్యి మందికి పైగా స్వచ్ఛంద సేవకులూ ఆమెతో కలిసి నడుస్తున్నారు. తనను వసుంధర పలకరిస్తే... బోలెడు విశేషాలను పంచుకుందిలా..!

నేను అమెరికా నుంచి వచ్చాక ఎన్నో సేవా కార్యక్రమాలకు అతిథిగా వెళ్లా. సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు చైతన్య అనే కుర్రాడు కలిశాడు. సర్కారు బడులకు సాయం చేసే ఆలోచనని వివరించాడు. ఓసారి బోయినపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాం. ప్రహరీ గోడ లేదు, ఆవరణంతా చెత్త, పగిలిపోయిన బీరు బాటిళ్లు. పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వార్తాపత్రికల్లో తింటున్నారు. ఆ దృశ్యాలు చూస్తే కడుపుతరుక్కుపోయింది. దాన్ని మోడల్‌ స్కూల్‌గా మారుద్దామనుకున్నా. 2014లో ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ను మొదలుపెట్టి ప్రహరీ, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాం. అది మొదలు ఎన్నో స్కూళ్లలో వసతులు మెరుగుపరిచాం. అయినా ఏదో వెలితి. అప్పుడే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ప్రథమ్‌’ అనే సంస్థ పాఠశాల విద్యపై ఓ నివేదికను రూపొందించింది. ఇది చూసి షాక్‌కు గురయ్యా. దాని ప్రకారం అయిదో తరగతి పిల్లలు ఒకటి, రెండు తరగతుల పాఠాలూ చదవలేక పోతున్నారు. కొందరు ప్రాథమిక స్థాయిలో చదువును మానేస్తుంటే కొందరు ప్రైవేటు పాఠశాలల్నే నమ్ముతున్నారు. ఈ పరిస్థితిని చేతనైనంత మార్చాలని నేను, చైతన్య చర్చించుకున్నాం.

42 వేలమందికి శిక్షణ

ప్రభుత్వ విద్యాలయాల్లోని 3-5 తరగతుల పిల్లలకు చదువు, రాత, వినే, మాట్లాడే నైపుణ్యాలతోపాటు లైఫ్‌స్కిల్స్‌నీ నేర్పించాలనుకున్నాం. ఉపాధ్యాయుల్ని కలిసి మా ఆలోచన వివరిస్తే ‘మీరు మా స్కూళ్లలో పాఠాలు చెబుతారా?’ అని కొందరు ఆశ్చర్యపోతే ఇంకొందరు ‘మా ఉద్యోగాలకు ఇబ్బంద’న్నారు. తర్వాత అర్థం చేసుకున్నారు. మా ఉద్దేశం ఒకటే.. ప్రభుత్వాలని నిందించడం కంటే ఒక అడుగు ముందుకేసి వాళ్లకి చేయూతనివ్వడం మేలు! తెలుగు రాష్ట్రాలే కాదు.. కర్ణాటక, తమిళనాడుల్లోనూ మొత్తం 430 ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానమయ్యాం. పదింటిలో కంప్యూటర్‌ ల్యాబ్స్‌, ఇరవై స్కూళ్లలో స్మార్ట్‌ క్లాస్‌లనూ ఏర్పాటుచేశాం. 42 వేల మంది పిల్లలకు ఆంగ్లంలో చదవడం, రాయడం, మాట్లాడటం నేర్పిస్తున్నాం. వివిధ రంగాల ప్రతిభావంతులు, ఆంగ్లంపై పట్టున్న యువత మమ్మల్ని చూసి ప్రేరణ పొంది మాతో కలిశారు. వారికి కొద్దిపాటి శిక్షణనిస్తాం. ఇలా ప్రస్తుతం వెయ్యి మందికిపైగా వలంటీర్లున్నారు. వీళ్లు టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అందించే పుస్తకాల ద్వారా పిల్లలకు బోధనతోపాటు కథలు, వివిధ రకాల నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.

వాటి కన్నా.. చదువు మిన్నని!

ప్రాజెక్టు గురించి నాన్నకు వివరించాక ప్రోత్సహించారు. సంస్థ ప్రారంభించి ఏడేళ్లు. పిల్లల్లో ఎంతో మార్పును చూశాం. గతంలో మాట్లాడటానికే బిడియపడేవాళ్లు. ఇప్పుడు వాళ్ల లక్ష్యాల్ని స్పష్టంగా చెబుతున్నారు. 2017లో ప్రయోగాత్మకంగా 150 మందితో టోఫెల్‌ రాయిస్తే మంచి మార్కులు సాధించారు. తిండి, దుస్తులు.. ఇలా ఎన్నో ఇవ్వొచ్చు. కానీ వాటి అవసరం కొద్ది రోజులే! విద్య అలా కాదు. అందుకే నా కూతురుకు ఏం ఇవ్వాలనుకుంటానో.. ఈ పిల్లలకీ అదే ఇవ్వాలనుకున్నా. అందుకు చదువొక్కటే చాలదు. నైపుణ్యాలనీ చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. నేను చదువుకునేప్పుడు టైలరింగ్‌, కార్పెంటర్‌ పనులు సహా నేర్పించారు. అదే విధానాన్ని ఈ పాఠశాలల్లో ప్రవేశపెట్టా. పాఠాల విషయంలోనూ మార్పు రావాలి. యోగా, ధ్యానాలకూ ప్రాధాన్యమివ్వాలి. గురుకుల తరహా విద్యాబోధన రావాలి. ప్రభుత్వాధికారులు, నాయకులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివిస్తేనే వాటిల్లో మార్పు సాధ్యం. పాత కాలంలోలా సర్కారు బళ్ల నుంచీ భవిష్యత్‌లో ఓ ప్రధాని, ఓ ముఖ్యమంత్రి వచ్చేలా వాళ్లని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.

ఏటా 30 మంది పిల్లలను సంక్రాంతికి ఇంటికి పిలిచి భోజనం, బట్టలు పెడతా. చక్కగా చదివితే ఏ స్థాయికైనా చేరొచ్చనే అభిప్రాయం కల్పించడమే దాని ఉద్దేశం. సినీపరిశ్రమ నుంచి రెజీనా, రకుల్‌, నిధి అగర్వాల్‌, ప్రణీత, అల్లు శిరీష్‌ స్వయంగా పాఠాలు బోధించారు. అదితీరావు హైదరీ, అఖిల్‌, ప్రగ్యా జైస్వాల్‌, సుధీర్‌ బాబు, నవదీప్‌, ఈషా రెబ్బ.. ఇలా సుమారు 40 మంది ఫ్యాషన్‌ షోల్లో పాల్గొన్నారు. వాటి ద్వారా వచ్చిన మొత్తాన్నీ వీళ్ల చదువులకే కేటాయిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో గీతారెడ్డి, కేటీఆర్‌, జయేశ్‌ రంజన్‌ లాంటి ప్రముఖులతోపాటు ఉత్తరాదిలో జయాబచ్చన్‌, మున్‌మున్‌ సేన్‌, శశిథరూర్‌ లాంటి వారూ మాకు సాయం చేస్తున్నారు. ఈ సేవల్ని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నాం.

- సతీష్‌ దండవేణి, ఈటీవీ, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్