ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?

వేసవి అనగానే ప్రతి ఒక్కరికీ మామిడి పండ్లే గుర్తుకు వస్తాయి. ఈ కాలంలో మాత్రమే లభించే మామిడి పండ్లను పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ పండ్లలో వెరైటీలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ఒక్కో రకానిది ఒక్కో ప్రత్యేకత.

Published : 30 Apr 2024 12:57 IST

వేసవి అనగానే ప్రతి ఒక్కరికీ మామిడి పండ్లే గుర్తుకు వస్తాయి. ఈ కాలంలో మాత్రమే లభించే మామిడి పండ్లను పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ పండ్లలో వెరైటీలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ఒక్కో రకానిది ఒక్కో ప్రత్యేకత. అయితే ఎన్ని వెరైటీలున్నా చాలావరకు మనకు అందుబాటు ధరల్లోనే లభిస్తుంటాయి. కానీ, కొన్ని వెరైటీలు మాత్రం సంపన్నులు మాత్రమే కొనగలరేమో అనేవిధంగా ఉంటాయి. అయితే ఇలాంటివి కొన్ని రకాలే ఉన్నా వాటి గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ క్రమంలో ప్రపంచంలోనే ఖరీదైన కొన్ని మామిడి పండ్ల గురించి తెలుసుకుందామా...

మియాజాకీ మామిడి...

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో మియాజాకీ మామిడి రకం మొదటి స్థానంలో ఉంటుంది. గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కేజీ 2.75 లక్షలుగా పలికింది. ఇవి జపాన్‌లోని మియాజాకీ అనే ప్రాంతంలో మొదటగా పండించారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే ఈ రకం పండ్లు సహజసిద్ధంగా వచ్చినవి కావు. 1980లో మియాజాకీ యూనివర్సిటీ పరిశోధకులు, స్థానిక రైతులు కలిసి ఈ రకాన్ని అభివృద్ధి చేశారు. మంచి రుచి కలిగి ఉండడంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం ఈ పండ్ల ప్రత్యేకత. సాధారణంగా మామిడి కాయలు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు వర్ణంలోకి మారుతుంటాయి. కానీ, మియాజాకీ పండ్లు మాత్రం ఊదా రంగు నుంచి ఎర్రగా మారతాయి. అండాకృతిలో ఎర్రగా ఉండడంతో వీటిని ‘ఎగ్‌ ఆఫ్‌ ది సన్’ (సూర్యుని గుడ్డు)గా పిలుస్తుంటారు. ఈ పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రస్తుతం ఈ రకాన్ని జపాన్‌లోనే కాకుండా బంగ్లాదేశ్‌, ఇండియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌ వంటి చోట్ల కూడా పండిస్తున్నారు.


కొహితూర్‌ మామిడి...

కొహితూర్‌ మామిడి పండ్లు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ రకాన్ని 18 వ శతాబ్దంలో సిరాజ్‌ ఉద్‌ దౌలా అనే రాజు అభివృద్ధి చేయించాడని అంటుంటారు. కలోపహర్ అనే రకాన్ని మరొక రకంతో కలిపి ఈ పండ్లను పరిశోధకులు అభివృద్ధి చేశారని చరిత్రకారులు అంటుంటారు. ఇవి తక్కువగా లభించడంతో మొదట రాజ కుటుంబీకులకు మాత్రమే ఈ పండ్లు దక్కేవట. ఇప్పుడు కూడా ఈ రకం మామిడి పండ్ల సాగు తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటి ధర కేజీ 3 వేల రూపాయల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 10 వేల ధర కూడా పలికిందని స్థానిక రైతులు చెబుతున్నారు. రుచిలో కూడా ఏమాత్రం తీసిపోని ఈ పండ్లకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జీఐ ట్యాగ్‌ కోసం దరఖాస్తు చేసింది.


అల్ఫోన్సో

పండ్లలో రారాజు మామిడి. మరి, మామిడి పండ్లలో రాజుగా అల్ఫోన్సోని అభివర్ణిస్తుంటారు. టేస్టీగా, జ్యూసీగా ఉండే ఈ రకం మామిడి పండ్లను మన దేశంలో ఎక్కువగా తింటుంటారు. ఈ పండ్లు మహారాష్ట్రలోని రత్నగిరి, దేవగఢ్‌ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయట. అందుకేనేమో గతేడాది ఆన్‌లైన్‌లో ఈ రకం పండ్లనే ఎక్కువగా కొనుగోలు చేశారని సర్వేలు చెబుతున్నాయి. ఈ పండ్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి జీఐ ట్యాగ్‌ కూడా ఉంది. ఈ రకం పండ్ల ఖరీదు డజను 3 వేల రూపాయల వరకు ఉంటుంది.


సింధ్రీ మామిడి...

ఖరీదైన మామిడి పండ్లలో సింధ్రీ రకం మామిడి పండ్లు కూడా ఒకటి. ఈ రకాన్ని పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. సింధ్రీ మామిడి పండ్లు పొడవుగా ఉంటాయి. ఒక్కో పండు కేజీ వరకు కూడా ఉంటుంది. ఈ పండ్లు తియ్యగా ఉండడంతో పాటు ఆకృతిలోనూ పెద్దగా ఉండడంతో చాలామంది ఇష్టపడుతుంటారు. ఒక్కో మామిడి ధర 3 వేల రూపాయల వరకు ఉంటుంది.


నూర్జహాన్‌ మామిడి...

ప్రపంచంలోనే ప్రత్యేకమైన, ఖరీదైన మామిడి రకాల్లో నూర్జహాన్‌ మామిడి పండ్లు కూడా ఒకటి. ఈ రకం పండ్లు మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పుర్ జిల్లాలో ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు ఒక్కోటి రెండున్నర నుంచి మూడు కేజీల బరువు ఉండడంతో పాటు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఈ పండ్లు ఆ ప్రాంతంలోనే ఎక్కువగా లభించడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది. ఈ మామిడి పండ్లకు మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్జహాన్ పేరు వచ్చింది. ఈ రకం పండ్లు జూన్‌ మాసంలో లభిస్తాయి. ఇక ధర విషయానికి వస్తే ఒక్కో మామిడి కాయ ధర 1500 వరకు ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న మామిడి పండ్ల ధరలు కేవలం సమాచారం కోసం మాత్రమే. సీజన్‌, ప్రాంతం, దిగుబడి, మార్కెట్ పరిస్థితులను బట్టి వీటి ధరలు మారుతుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్