ఇంటర్వ్యూ ఇంటి నుంచే అయినా ఇవి పాటించాల్సిందే!

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేయడమే కాదు.. ఇంటర్వ్యూ కూడా ఇంటి నుంచే.. అదీ ఆన్‌లైన్‌లో తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నాయి కొన్ని కంపెనీలు. అయితే ఇంటర్వ్యూ ఇంటి నుంచే కదా అనే నిర్లక్ష్యం, ఇంటర్వ్యూ చేసే వాళ్లు మన ఆహార్యాన్ని అంతగా పట్టించుకోరన్న ఆలోచన అసలే వద్దంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు. ముఖాముఖీ ఆన్‌లైన్‌లోనే అయినా చక్కటి ఆహార్యంతో పాటు వృత్తినైపుణ్యాలను సైతం చాటాలంటున్నారు.

Published : 09 Jul 2021 19:48 IST

కరోనా సంక్షోభం కారణంగా కోమలి ఉద్యోగం పోయింది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమెను ఓ కంపెనీ వర్చువల్‌ ఇంటర్వ్యూకి ఆహ్వానించింది. ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ ముఖాముఖీ కోసం సన్నద్ధమవుతోందామె.

ప్రస్తుతం ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరో కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తోంది మాధవి. ఈ క్రమంలోనే ఆమె ప్రొఫైల్‌ మెచ్చి మరో రెండు రోజుల్లో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో పాల్గొనాల్సిందిగా మెయిల్ పంపించింది సదరు సంస్థ.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేయడమే కాదు.. ఇంటర్వ్యూ కూడా ఇంటి నుంచే.. అదీ ఆన్‌లైన్‌లో తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నాయి కొన్ని కంపెనీలు. అయితే ఇంటర్వ్యూ ఇంటి నుంచే కదా అనే నిర్లక్ష్యం, ఇంటర్వ్యూ చేసే వాళ్లు మన ఆహార్యాన్ని అంతగా పట్టించుకోరన్న ఆలోచన అసలే వద్దంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు. ముఖాముఖీ ఆన్‌లైన్‌లోనే అయినా చక్కటి ఆహార్యంతో పాటు వృత్తినైపుణ్యాలను సైతం చాటాలంటున్నారు. లేదంటే మీ నైపుణ్యాలు వారికి నచ్చినా మిమ్మల్ని తిరస్కరించే అవకాశమూ ఉంటుందంటున్నారు. మరి, ఇలా జరగకుండా వర్చువల్‌ ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

నచ్చిన ప్రదేశంలో..!

ఎలాగూ ఇంటర్వ్యూ ఇంట్లోనే కదా అని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే కుదరదు. ముఖ్యంగా అందరూ ఉన్న గదిలో అయితే మీరు మీ పనిపై ఏకాగ్రత పెట్టలేరు. తద్వారా ఇంటర్వ్యూ చేసే వాళ్లకు మీపై నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడచ్చు. కాబట్టి వర్చువల్‌ ఇంటర్వ్యూ కోసం మీ ఇంట్లోనే మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకోండి. అయితే మీ గదిలో, ప్రశాంతంగా ఉన్నట్లయితే బాల్కనీలో, మీ పిల్లలు చదువుకునే గదిలో.. ఇలా నిశ్శబ్దంగా, ఎలాంటి అంతరాయం లేకుండా ఉండే వాతావరణాన్ని ఇంటర్వ్యూ కోసం ఎంచుకుంటే మీ పూర్తి దృష్టిని దానిపైనే నిలపచ్చు. అలాగే మీరు ఇంటర్వ్యూలో ఉన్న సమయంలో ఎవరూ మీ గదిలోకి రావద్దని ముందే మీ ఇంట్లో వాళ్లందరికీ చెప్పి పెట్టడం మంచిది.

ఆహార్యంతో ఆకట్టుకోండి!

ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు మన ఆహార్యం కూడా ప్రధానమే. ఎలాగూ వర్చువల్‌ ఇంటర్వ్యూనే కదా అని కొంతమంది ఆదరాబాదరాగా రడీ అయి కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కానీ అది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అయినా ప్రొఫెషనల్‌ డ్రస్సులో తయారు కావాలంటున్నారు. ఈ క్రమంలో మీకు చీర అలవాటుంటే కట్టుకోవచ్చు.. లేదంటే కార్పొరేట్‌ లుక్‌ రావడానికి సూట్‌ ధరించచ్చు.. అలాగని జీన్స్‌-టీషర్ట్‌ ధరిస్తానంటే కుదరదు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్లు మీరు చెప్పే సమాధానాలే కాదు.. మీరు ఎలా రడీ అయ్యారు.. నీట్‌గా ఉన్నారా? లేదా? అనే విషయం కూడా గమనిస్తుంటారు. అలాగే ఆహార్యంతో పాటు కూర్చునే పద్ధతి కూడా మార్చుకోవాలి. కుర్చీలో జారినట్లుగా, నీరసంగా కాకుండా.. నిటారుగా, నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా కూర్చోవాలి.

నెట్‌వర్క్‌ అంతరాయం లేకుండా..!

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు ఇంటర్నెట్‌ అంతరాయం లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే! అలాకాకుండా సీరియస్‌గా ముఖాముఖీ జరుగుతున్నప్పుడు మధ్యలో నెట్‌ వేగం తగ్గిపోవడం, డిస్‌-కనెక్ట్‌ అయిపోవడం.. వంటి సమస్యలొస్తే ఇటు మీరు, అటు ఇంటర్వ్యూ చేసిన వారు.. ఇద్దరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ సమస్యలేవీ లేకుండా ఉండాలంటే ఇంటర్నెట్‌ సిగ్నల్‌కి సమీపంలో కూర్చోవడం, మీకు ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు మీ కుటుంబ సభ్యులు నెట్‌ వాడకుండా చూసుకోవడం.. వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ముందే ప్రిపేరవ్వండి!

ఆన్‌లైన్‌ ముఖాముఖీ అంటే ఎవరికైనా కాస్త భయం, కొత్తకొత్తగా అనిపించడం సహజం. అయితే అదే బిడియంతో నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారంటే వారు అడిగిన ప్రశ్నలకు మీరు తడబడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఒకటికి రెండుసార్లు రిహార్సల్స్‌ చేయడం మంచిది. ఈ క్రమంలో మీ కుటుంబ సభ్యులతోనే ఆన్‌లైన్‌ ముఖాముఖీలో పాల్గొనడం, వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రశ్నలు సంధిస్తే వెంటనే జవాబు చెప్పేలా ప్రిపేరవడం మంచిది. తద్వారా మీలో ఉన్న భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే మిమ్మల్ని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో సక్సెసయ్యేలా చేస్తుంది.

రిహార్సల్స్‌ చేయాల్సిందే!

* ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పేటప్పుడు కూడా అటూ, ఇటూ చూస్తూ.. పైకి చూస్తూ చెప్పడం అస్సలు కరక్ట్‌ కాదు.. ఇంటర్వ్యూ చేసే వాళ్లను చూస్తూ, చిరునవ్వుతో సమాధానం చెబితే అవతలి వారికి మీపై సానుకూల అభిప్రాయం కలుగుతుంది. అలాగే మీకు విషయ పరిజ్ఞానం ఉందన్న సంగతీ వారికి అర్థమవుతుంది.

* ఇంటర్వ్యూలో పాల్గొనే క్రమంలో సమయపాలన పాటించడం కూడా ముఖ్యమే. ఈ క్రమంలో ఓ అరగంట ముందుగానే కంప్యూటర్‌ ముందు కూర్చొని రిహార్సల్స్‌ చేస్తే ఆ భయం, బిడియం తొలగిపోతాయి. అలాగే మీకు సమయపాలన ఉందన్న విషయం కూడా వారికి అర్థమవుతుంది.

* ఇక ఇంటర్వ్యూ ముగిశాక ఎంపికైతే వాళ్లే చెబుతారులే అనుకోకుండా థ్యాంక్యూ చెబుతూ ఓ మెయిల్‌ పెట్టండి.. అప్పుడు మీరు వారి కంపెనీలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారని వారికి అర్థమవుతుంది.

* ఒకవేళ మీరు ఆ ఇంటర్వ్యూలో ఫెయిలైనా సరే నిరాశకు గురికావద్దు. ఈ క్రమంలో మీలో ఎక్కడ లోపాలున్నాయో వారిని ఫీడ్‌బ్యాక్‌ అడగండి.. అవి సరిచేసుకొని తదుపరి ఇంటర్వ్యూలో మళ్లీ ఆ పొరపాట్లు చేయకుండా పకడ్బందీగా సన్నద్ధమవ్వచ్చు.

వర్చువల్‌గానే ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటికీ అందులో సక్సెస్‌ కావాలంటే, ఇంటర్వ్యూ చేసే వాళ్ల మనసు గెలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసిందిగా! కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి.. విజయం మిమ్మల్నే వరిస్తుంది.. ఆల్‌ ది బెస్ట్!!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్