Financial Planner: ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ సలహాలు ఎందుకవసరం?

సౌకర్యవంతమైన జీవితానికి డబ్బు ఎంత అవసరమో, దాన్ని మేనేజ్‌ చేయడానికి ఫైనాన్షియల్‌ ప్లానర్ అంతే అవసరం.

Published : 16 Jan 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరికైనా వారి దైనందిన కార్యకలాపాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు చాలా వరకు డబ్బుతో ముడిపడి ఉంటాయి. తమ ఆర్థిక పరిస్థితులను చక్కగా తీర్చిదిద్దుకునేవారు, మిగతా విషయాల్లో కూడా తగిన ప్లానింగ్‌తో ఉండే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఇది మన భవిష్యత్‌ ఎంతో అవసరం. అయినప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ప్రాముఖ్యతను తరచుగా విస్మరిస్తారు. ఆర్థిక ప్రణాళికను అమలుజేయడంలో తగిన పరిజ్ఞానం అందరికీ ఉండదు. నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకారం భారత్‌లో కేవలం 27% మంది మాత్రమే ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉన్నారు. చాలా మంది సరైన ఆర్థిక నిపుణుల సలహాలు లేకుండానే కీలకమైన విషయాల్లో తలదూర్చి.. తర్వాత తప్పులు చేసి  ఆర్థికంగా నష్టపోతుంటారు. తర్వాత ఆర్థిక నిపుణుల  అవసరాన్ని తెలుసుకుంటారు.

ఫైనాన్షియల్‌ ప్లానర్‌ అవసరం

ఆర్థిక ప్రణాళిక అనేది సంపన్నులకు, పదవీ విరమణకు చేరువలో ఉన్నవారికి మాత్రమే కాదు. ఇది జీవితంలో ఏ దశలోనైనా, ఎవరికైనా ప్రయోజనం కలిగించే ప్రక్రియ. ఉదాహరణకు, ఒక వృత్తి నిపుణుడు తన కెరీర్‌లో బాగా సంపాదిస్తూ ఉండొచ్చు. సంపాదన తర్వాత దాన్ని మేనేజ్‌ చేయడంలో తికమకకు గురవుతారు. అదే ఫైనాన్షియల్‌ ప్లానర్‌ సలహా తీసుకుంటే బడ్జెట్‌ను రూపొందించడంలో, ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించడంలో, భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో తగిన ప్లానింగ్‌ను అమలు చేయగలరు. ఎవరైనా తమ కెరీర్‌లో పురోగమిస్తున్నప్పుడు వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటారు. వారికి ఫైనాన్షియల్‌ ప్లానర్‌ తోడుగా ఉంటే తగిన పెట్టుబడి వ్యూహాన్ని అమలుచేసి, పన్నుల విషయంలో తెలివిగా వ్యవహరించేలా చేస్తారు. 

ఫైనాన్షియల్‌ ప్లానర్‌ ఎంపిక

స్నేహితులు, కుటుంబంలోని వ్యక్తులు, పరిచయస్తుల ద్వారా మంచి ఆర్థిక సలహాదారుడిని సంప్రదించొచ్చు. ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌లో ఆర్థిక సలహాదారుల కోసం ప్రయత్నించవచ్చు. ఆన్‌లైన్‌లో రీసెర్చ్‌ ద్వారా సరైనా సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ను కనుగొనడం సులభమే. సోషల్‌ మీడియాలో వీరి ఇంటర్వ్యూలను చూసి వీరి శక్తిసామర్థ్యాలను అంచనా వేసి, ఆర్థిక సలహాదారుడుగా ఎంపిక చేసుకోవచ్చు. కొంతమంది పేరున్న ఆర్థిక సలహాదార్లు రిఫరెన్స్‌ల ద్వారా మాత్రమే క్లయింట్లను తీసుకుంటారు. మీ ఆర్థిక నిర్ణయాలకు మార్గనిర్దేశం చేసే వ్యక్తి విశ్వసనీయమైన సమర్థుడో కాదో మీరు నిర్ధారించుకోవాలి. ఆర్థిక సలహాదారుడితో మాట్లాడే ముందు, మీ ఆర్థిక జీవితంలో ఏయే అంశాల్లో మీకు సహాయం కావాలో నిర్ణయించుకోండి. మీరు జీవితంలో ఆర్థికంగా ఎక్కడ ఉన్నారనే దానిపై ఆధారపడి మీకు సమగ్ర ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని వివరిస్తారు.

సలహాలు

పెట్టుబడి ప్రణాళిక, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్లు, ఇన్సూరెన్స్‌ గురించే కాకుండా టాక్స్‌ ప్లానింగ్‌ పరంగా.. ఆర్థిక సలహాదారులు అద్భుతంగా సలహాలు ఇస్తారు. పెట్టుబడి వ్యూహాలు, పన్నులకు సంబంధించిన చట్టాలు, మార్కెట్‌ పరిస్థితిలపై అవగాహన కలిగి ఉంటారు. ద్రవ్యోల్బణం, ఉపాధి అనిశ్చితి, ఆరోగ్య సమస్యలు, ఉన్నత విద్య, ముందస్తు పదవీ విరమణ, ప్రయాణాలు మొదలైన వాటి గురించి ప్రజలు ఈ రోజుల్లో ఆర్థిక సలహాదారుడి నుంచి ఎక్కువ సలహాలను కోరుతున్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ఆర్థిక లక్ష్యాలు, పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా తగిన వ్యూహాలను రూపొందించే ప్లానర్‌తో కలిసి పని చేయడం చాలా అవసరం. సాధారణంగా వీరు సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (CFP), ఛార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (CFA), రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ (RIA) వంటి అర్హతలను కలిగి ఉంటారు. ఈ విద్యార్హతలతో పాటు తగిన అనుభవం ఉన్నవారికి క్లయింట్లు ఆర్థిక నిర్వహణ బాధ్యతను అప్పగించొచ్చు లేదా తగిన ఆర్థిక సలహాలు పొందొచ్చు.

ఫీజులు

ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌.. ఆర్థిక సలహాల గురించి వచ్చే క్లయింట్ల వద్ద ఫీజును తీసుకుంటారు. కొంతమంది క్లయింట్లు పెట్టుబడి పెట్టే లేదా కొనుగోలు చేసిన వాటిపై కొంత శాతాన్ని తమ ఫీజుగా తీసుకుంటారు. ఈ ఉచిత ఆర్థిక సలహాదారులు సాధారణంగా పెట్టుబడి, బీమా రంగంలో అందుబాటులో ఉంటారు. కొంతమంది ఆర్థిక సలహాదారులు క్లయింట్ల కోసం నిర్వహించే మొత్తం ఆస్తుల ఆధారంగా రుసుము వసూలు చేయొచ్చు. సాధారణ ఆర్థిక సలహాదారుల ఫీజులయితే గంటకు రూ.750-1,200 ఉండొచ్చు. వార్షికంగా రూ.6,000-40,000 వరకు వసూలు చేయొచ్చు. సేవల సంఖ్య, సంక్లిష్టత, పోర్ట్‌ఫోలియో పరిమాణం ఆధారంగా ఏడాదికి రూ.5,000 నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేసే ఆర్థిక సలహాదార్లు కూడా ఉన్నారు.

చివరిగా: క్లయింట్లు ఛార్జీల గురించి ముందుగా చర్చించడం మంచిది. ఫీజులు కూడా వారు అందించిన సేవలకనుగుణంగా ఉన్నాయా లేదా అని మీరు నిర్ధారించుకోవాలి. జీవితంలో అన్ని దశల కోసం తగిన ఆర్థిక సలహాదారుడి అవసరం ఎంతయినా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని