Air India: ఎయిరిండియాలో నియామకాలు కొనసాగుతాయ్‌: సీఈవో

ఈ ఏడాదితోపాటు, వచ్చే ఏడాది కూడా ప్రతి నెలా సంస్థలో సిబ్బంది నియామకాలు చేపడతామని ఎయిరిండియా (Air India) ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Campbell Wilson) తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎయిరిండియాలో నిజమైన మార్పు వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుందని అన్నారు.

Updated : 31 May 2023 09:44 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికకు మార్కెట్‌ ట్రెండ్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని కంపెనీ ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Campbell Wilson) అన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా 550 మంది క్యాబిన్‌ సిబ్బంది, 50 మంది పైలట్ల నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. మున్ముందూ ఈ ధోరణి కొనసాగుతుందన్నారు. గతేడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియా సంస్థను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. అనంతరం, సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్‌ బస్‌ నుంచి 250, బోయింగ్‌ నుంచి 220 విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే క్యాబిన్‌ సిబ్బంది, పైలట్లను ఆ సంస్థ భారీగా నియమించుకుంటోంది.

సిబ్బంది నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదని విల్సన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఏడాదితోపాటు, వచ్చే ఏడాది కూడా నియామక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఏషియా, విస్తారాలను ఎయిరిండియాలో విలీనం నిబంధనలకు అనుగుణంగా జరిగిందని తెలిపారు. ఈ విలీన ప్రక్రియ వల్ల సంస్థలో మొత్తంగా ఎంత మంది సిబ్బంది ఉన్నారనేది తెలియడంతోపాటు, భవిష్యత్‌ అవసరాల కోసం ఎంత మంది సిబ్బంది అవసరమనేది అంచనా వేయొచ్చన్నారు. ఈ నెల ప్రారంభంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కోసం సుమారు 3,900 సిబ్బందిని నియమించుకున్నట్లు తెలిపారు. వీరిలో 500 మంది పైలట్లు కాగా, 2,400 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారన్నారు.

జులై లేదా ఆగస్టు నెలల్లో తొలి నారో బాడీ (చిన్న) విమానం, అక్టోబర్‌లో వైడ్‌ బాడీ (పెద్ద) A350 విమానం ఎయిరిండియాకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 122 విమానాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆరు A350 విమానాలతో పాటు, ఎనిమిది B777 విమానాలు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. ఎయిరిండియాలో నిజమైన మార్పు వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుందని విల్సన్‌ అన్నారు. కంపెనీ కొనుగోలు చేసిన విమానాలు వరుసగా అందుబాటులోకి రావడంతోపాటు, సిబ్బంది నియామకాలు, సర్వీసుల పెరగడం ద్వారా అతిపెద్ద విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని